తాండూర్, ఆగస్టు 26: గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ (Manoj) అన్నారు. అభినవ స్వచ్చంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో మంగళవారం తాండూర్ ఐబీ చౌరాస్తాలో ఉచితంగా మట్టి గణపతులు, మొక్కలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి హాజరైన సబ్ కలెక్టర్ కూడా మట్టి ప్రతిమలను, మొక్కలను అందించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా అభినవ స్వచ్చంద సేవా సంస్థ తోడ్పాటుతో మట్టి వినాయకులతో పాటు ఒక మొక్కను ఇవ్వడం అభినందనీయమని ఆయన తెలిపారు. తాండూర్ తెలంగాణ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు దేవరకొండ రాజన్న ఆధ్వర్యంలో క్లబ్ ప్రతినిధులు తాండూర్ ఐబీలో మట్టి గణపతులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జ్యోత్స్న, అధికారులు, నాయకులు, లయన్స్ క్లబ్ ప్రతినిధులు, అభినవ సేవా సంస్థ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.