జనవరి 10లోగా డీపీఆర్ అందజేయాలి
ఏప్రిల్ లోగా పరిశ్రమలు తరలించాలి
లేకపోతే భూ కేటాయింపులు రద్దు
పరిశ్రమల యజమానులతో ఉన్నతస్థాయి సమావేశం
పాల్గొన్న టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి, టీఎస్ఐఐసీ చైర్మన్ ఎండీ
పరిగి, డిసెంబర్ 13 : ఔటర్ రింగ్‌రోడ్డు లోపల గల స్టీల్ ఫ్యాక్టరీలను వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలో గల రాకంచర్ల పారిశ్రామికవాడకు తరలించాలని నిర్ణయించారు. ఈ తరలింపు నిర్ణయాన్ని గతంలోనే తీసుకున్నా పరిశ్రమల యజమానులు ఇప్పటివరకు తరలించకపోవడంతో మరోసారి చివరి అవకాశం కల్పించారు. పరిశ్రమల తరలింపునకు సంబంధించి జనవరి 10 లోగా డీపీఆర్‌లు అందజేయాలని, ఏప్రిల్ నెలాఖరు వరకు పరిశ్రమల తరలింపు పూర్తి చేయాలని ఆదేశించారు. సోమవారం టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు అధ్యక్షతన చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్‌రెడ్డి, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత, ఎమ్మెల్సీ పి.మహేందర్‌రెడ్డి, పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి, టీఎస్ఐఐసీ ఎండీ వెంకట్ నర్సింహారెడ్డి, వికారాబాద్ జడ్పీ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్, స్టీల్ పరిశ్రమల యజమానులతో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
35 స్టీల్ ఫ్యాక్టరీలను రాకంచర్లలోని 150 ఎకరాల్లో ఏర్పాటు చేసిన స్టీల్ ఇండస్ట్రియల్ పార్క్‌కు తరలించాలని 2008లోనే నోటీసులు జారీ చేసినా ఇప్పటివరకు తరలింపు జరుగలేదు. కాటేదాన్, జీడిమెట్ల ప్రాంతాలలోని 35 స్టీల్ పరిశ్రమలను రాకంచర్ల పారిశ్రామికవాడకు తరలించాల్సిందేనని తేల్చిచెప్పారు. తరలింపునకు సంబంధించి 2022 జనవరి 10 లోగా డీపీఆర్‌ను సమర్పించి, ఏప్రిల్‌లోగా రాకంచర్ల పారిశ్రామికవాడకు స్టీల్ పరిశ్రమలు ఏర్పాటు పనులు తప్పనిసరిగా పూర్తి చేయాలని టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు ఆదేశించారు. గడువు లోపు పరిశ్రమల తరలింపు ప్రక్రియను చేపట్టకపోతే సంబంధిత స్టీల్ పరిశ్రమలు మూసి వేయించడంతోపాటు వాటి భూ కేటాయింపులు రద్దు చేస్తామని తెలిపారు. పరిశ్రమల తరలింపులో ఏవైనా సమస్యలుంటే వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టనున్నట్లు హామీ ఇచ్చారు. తద్వారా రాబోయే కొద్ది నెలల్లోనే స్టీల్ పరిశ్రమలు రాకంచర్ల పారిశ్రామికవాడకు తరలించనున్నారు. పరిశ్రమల తరలింపుతో ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందడంతోపాటు యువతకు ఉపాధి అవకాశాలు పెరుగనున్నాయి.
సకల సదుపాయాలతో 150 ఎకరాల్లో పారిశ్రామికవాడ
వికారాబాద్ జిల్లాలోని పరిగి నియోజకవర్గం పూడూరు మండల పరిధిలోని రాకంచర్ల సమీపంలో జాతీయ రహదారికి ఆనుకొని 150 ఎకరాల్లో పారిశ్రామిక వాడ ఏర్పాటు చేయగా అందులో టీఎస్ఐఐసీ వారు పూర్తిస్థాయిలో సదుపాయాలు కల్పించారు. ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి అవసరం మేరకు స్థలాన్ని చదును చేయించి ప్రత్యేకంగా బీటీ రోడ్లు సైతం వేయించారు. అన్ని రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటారు. పరిశ్రమలకు అవసరమైన నీటి సరఫరాకు ప్రత్యేకంగా మిషన్ భగీరథ ఓవర్‌హెడ్ ట్యాంకును పారిశ్రామికవాడ ప్రాంతంలోనే నిర్మాణం చేపట్టారు. తద్వారా నీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆయా పరిశ్రమలకు అవసరం మేరకు నీటి సరఫరా చేపడుతారు. ఓఆర్ఆర్ లోపలి స్టీల్ ఫ్యాక్టరీలను రాకంచర్ల స్టీల్ ఇండస్ట్రియల్ పార్క్‌లోకి తరలించాలని నిర్ణయించారు. ఈ పార్కులో 42 ప్లాట్లు చేశారు. వాటిలో స్టీల్ పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు ఇస్తున్నారు. ఇప్పటివరకు 6 ప్లాట్లలో వివిధ పరిశ్రమలకు కేటాయించగా.. మిగతా ప్లాట్లలో స్టీల్ పరిశ్రమలు ఏర్పాటు చేస్తారు.
ఏప్రిల్ లోపు పరిశ్రమల తరలింపు
కాటేదాన్, జీడిమెట్ల ప్రాంతాలలో గుర్తించిన 35 ఐరన్ ఓర్, స్టీల్ ప్రొడక్ట్స్ పరిశ్రమలను రాకంచర్ల పారిశ్రామికవాడకు తరలించాలని నిర్ణయించారు. మూడు నెలల క్రితం టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు చేవెళ్ల ఎంపీ జీ.రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పి.మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డితో కలిసి రాకంచర్ల పారిశ్రామికవాడ స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కాటేదాన్, జీడిమెట్లలోని ఐరన్ ఓర్, స్టీల్ పరిశ్రమలను రాకంచర్లకు తరలిస్తామని ప్రకటించారు. ఈ తరలింపునకు సంబంధించి సంబంధిత పరిశ్రమలకు నోటీసులు జారీ చేయగా తరలింపు ప్రక్రియ జరుగకపోవడంతో చివరి అవకాశంగా పరిశ్రమల తరలింపుపై జనవరి 10లోగా డీపీఆర్ అందజేయాలని, ఏప్రిల్ నెలాఖరు లోపు పరిశ్రమల తరలింపు పూర్తి చేయాలని సోమవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయించారు.
ఫోర్ లేన్ రోడ్డు మంజూరు
పోలీసు అకాడమీ నుంచి మన్నెగూడ వరకు ఫోర్ లేన్ రోడ్డు(జాతీయ రహదారి) మంజూరైంది. రాబోయే ఏడాదిన్నరలో ఈ రోడ్డు నిర్మాణం పూర్తవుతుంది. మరోవైపు మన్నెగూడ నుంచి కర్ణాటకలోని జాతీయ రహదారి వరకు జాతీయ రహదారి నిర్మాణం చేపట్టారు. రాకంచర్ల పారిశ్రామికవాడ జాతీయ రహదారికి ఆనుకొని ఉంటుంది. తద్వారా హైదరాబాద్ నుంచి 40 నిమిషాల్లో, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి గంటలోపు పారిశ్రామికవాడకు చేరుకోవచ్చు. ఉత్పత్తులకు అవసరమైన ముడి సరుకులు, ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు తరలించడానికి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పవచ్చు. పరిగి నియోజకవర్గంలోని రాకంచర్ల పారిశ్రామికవాడలో పరిశ్రమల ఏర్పాటుతో వృత్తి నైపుణ్యంగల వారితోపాటు ఇతరులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. స్థానికులకు ప్రాముఖ్యం ఇవ్వనున్నారు.