వికారాబాద్, అక్టోబర్ 1: ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలని పీఆర్సీ జాయింట్ డైరెక్టర్ శ్రీప్రసాద్ తెలిపారు. శుక్రవారం వికారాబాద్ కేంద్రంలోని ఏరియా దవాఖానను కేంద్ర బృందం పరిశీలించింది. ఇందులో భాగంగా దవాఖానలోని ఆపరేషన్ చేసే గది, రక్తనిధి కేంద్రాన్ని, ఓపీ గది, మెడిసిన్లతో పాటు పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా పీఆర్సీ జాయింట్ డైరెక్టర్ శ్రీప్రసాద్ మాట్లాడుతూ కేంద్రం, రాష్ట్రం నుంచి వచ్చే ఎన్హెచ్ఎం నిధులను ఏ విధంగా ఖర్చు చేస్తున్నారనే విషయాలపై పర్యవేక్షించారు. దవాఖానలోని రోగుల అవసరాలకు ఖర్చు చేసిన నిధుల వివరాలు తెలుసుకున్నారు. దవాఖానకు వచ్చే రోగులకు అవసరమైన వైద్య సదుపాయాలు కల్పించాలని సూచించారు. దేశంలోని 767 దవాఖానలను పరిశీలించినట్లు, డయాగ్నస్టిక్ సేవలందించడంలో తాండూరు జిల్లా దవాఖాన మొదటి స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. ఏ దవాఖానలో ఎలాంటి అవసరాలు సమకూర్చాలి? ఎలా సద్వినియోగం చేసుకుంటున్నారో వాటిపై పూర్తి వివరాలు తెలుసుకున్నట్లు వారు తెలిపారు. వీటన్నింటికి నివేదికలు తయారు చేసి డిసెంబర్, జనవరిలో నిర్వహించే సమావేశంలో కమిషనర్‌కు నివేదిస్తామని పేర్కొన్నారు. వికారాబాద్ దవాఖానలో సేవలు బాగున్నాయన్నారు. అనంతరం డీఎంహెచ్‌వోతో కలిసి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఎన్ఏహెచ్ఎం నుంచి రూ.27 లక్షలు రాగా రూ.17 లక్ష లు ఖర్చు చేసినట్లు దవాఖాన సూపరింటెండెంట్ యాదయ్య తెలిపా రు. మిగిలిన నిధులను దవాఖాన అభివృద్ధి, అవసరాలకు ఖర్చు చేస్తామన్నా రు. వీరితో పాటు డీఎంహెచ్‌వో తుకారాం, రాష్ట్ర నోడల్ అధికారి జగన్నాథ్‌రెడ్డి, డాక్టర్లు లలిత, సాయిబాబ, రవీందర్‌యాదవ్, జీవరాజ్, శ్రీకాంత్, ఆసుపత్రి సిబ్బంది ఉన్నారు.