పరిగి, నవంబర్ 1 : మాతా శిశు సంరక్షణకు సర్కారు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఓవైపు గర్భిణులకు ఏఎన్‌టీ చెకప్‌లు మొదలుకొని ప్రసవాల వరకు సర్కారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది. సర్కారు దవాఖానల్లో ప్రసవాలు పెరుగుతున్నాయి. తద్వారా వికారాబాద్ జిల్లాలో మాతా శిశు మరణాలు చాలావరకు తగ్గుతూ వస్తున్నాయి. వైద్యుల పర్యవేక్షణ పెరుగడంతోపాటు సర్కారు అమలు చేస్తున్న అనేక కార్యక్రమాల వల్ల శిశు మరణాల సంఖ్య తగ్గుతూపోతున్నది. శిశు సంరక్షణకు ప్రభుత్వం ఇటీవల జిల్లాలో ప్రత్యేకంగా మాతా శిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేయడం ఇందులో భాగంగానే చెప్పవచ్చు. గత మూడేండ్లుగా అమలవుతున్న కార్యక్రమాలతో జిల్లాలోని సర్కారు దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెరుగుతుండగా శిశు మరణాల సంఖ్య తగ్గుతున్నది.
జిల్లాలో 29,033 మందికి కేసీఆర్ కిట్లు
దవాఖానల్లో కేసీఆర్ కిట్లతో ప్రసవాల సంఖ్య పెంచడం, తద్వారా మెరుగైన వైద్యంతో శిశు మరణాల సంఖ్య తగ్గిస్తున్నది. వికారాబాద్ జిల్లా పరిధిలో కేసీఆర్ కిట్ పథకం ప్రారంభమైన 2017 జూన్ 2 నుంచి 2021ఆక్టోబర్ నెలాఖరు వరకు 29,033 మంది బాలింతలకు కేసీఆర్ కిట్లు అందజేశారు. ఈ సమయంలో జిల్లాలోని సర్కారు దవాఖానల్లో 52వేలకు పైగా ప్రసవాలు జరుగగా.. అందులో కేసీఆర్ కిట్‌కు అర్హులుగా 29,033 మందికి కిట్లు అందించారు. కేసీఆర్ కిట్ కార్యక్రమంలో భాగంగా ఒకటవ, రెండవ కాన్పుకు ఆడ శిశువు జన్మిస్తే రూ.13వేలు, మగ శిశువు జన్మిస్తే రూ.12వేలు ఇస్తున్నారు. గర్భిణులకు ఏఎన్సీ చెకప్‌ల కోసం ప్రత్యేకంగా వాహనాల్లో సర్కారు దవాఖానలకు తరలించడంతోపాటు వైద్య పరీక్షల అనంతరం వారిని తిరిగి ఇండ్ల వద్ద వదిలిపెడుతున్నారు.
రూ.20కోట్లతో మాతా శిశు కేంద్రం
మాతా శిశు సంరక్షణకు అవసరమైన అన్ని చర్యలు సర్కారు చేపడుతున్నది. తాండూరులో జిల్లా దవాఖానకు అనుబంధంగా ప్రత్యేకంగా మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రూ.20కోట్ల వ్యయంతో ఈ దవాఖాన భవనం నిర్మాణం పూర్తి చేయగా గత శనివారం రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఇందులో ప్రత్యేకంగా మాతా శిశు సంరక్షణకు వార్డులు కేటాయించారు. కేవలం మాతా శిశు సంరక్షణ కోసమే ఈ దవాఖాన ఏర్పాటు చేశారు. ఈ దవాఖానలో సిక్ న్యూ బర్న్ కేర్ యూనిట్, న్యూట్రిషనల్ రిహాబిలిటేషన్ సెంటర్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. సిక్ న్యూ బర్న్ కేర్ యూనిట్లో పుట్టుకతో తక్కువ బరువు గల శిశువులు, నెలలు నిండకుండానే పుట్టిన శిశువులు, పూర్తి మోతాదులో బరువు లేనివారికి ప్రత్యేకంగా సంరక్షణ కోసం బెడ్స్ ఏర్పాటు చేశారు. అలాగే న్యూట్రిషన్ రిహాబిలిటేషన్ సెంటర్లో పోషకాహార లోపంతో పుట్టిన శిశువులకు ప్రత్యేకంగా సంరక్షణ చర్యలు చేపడుతారు. తద్వారా శిశు మరణాల సంఖ్య మరింత తగ్గడానికి అవకాశాలు పెరిగాయి. ఓవైపు వైద్యుల పర్యవేక్షణలోనే శిశువులు ఉండడం వల్ల మరణాల శాతం తగ్గుతుంది.
తగ్గిన మాతా శిశు మరణాలు : తుకారాంభట్, జిల్లా వైద్యాధికారి
మాతా శిశు సంరక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో వికారాబాద్ జిల్లా పరిధిలో శిశు మరణాల సంఖ్య తగ్గింది. రెండు మూడు సంవత్సరాలతో పోలిస్తే క్రమంగా శిశు మరణాలు తగ్గుతున్నాయి. శిశు మరణాల రేటు రాష్ట్ర సగటుతో పోలిస్తే జిల్లాలో తక్కువగా ఉంది. మరోవైపు తాండూరులో ప్రత్యేకంగా మాతాశిశు ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయడం ద్వారా పుట్టిన శిశువులకు ఏదైనా ఆరోగ్య సమస్యలుంటే వెంటనే వైద్య సహాయం అందిస్తారు. తద్వారా శిశు మరణాలు మరింతగా తగ్గుతాయి. మాతా శిశు సంరక్షణకు వారంలో రెండు రోజులు సోమవారం, శుక్రవారం ప్రత్యేకంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తారు.