జిల్లాలో తాగునీటి కష్టాలు తీవ్రమయ్యాయి. కేసీఆర్ పదేండ్ల పాలన లో తాగునీటి సమస్య లేకుండా మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ నల్లాల ద్వారా అందించగా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో మళ్లీ నీటి ఎద్దడి మొదలైంది. వారానికి ఒకట్రెండు రోజులే నీరు వస్తుండడంతో.. మహిళలు, ప్రజలు కిలోమీటర్ల మేర దూరంలో ఉన్న బోరు,బావుల వద్దకు నడుచుకుంటూ వెళ్లాల్సిన దుస్థితి వచ్చింది.
-వికారాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ)
జిల్లాలో తాగునీటి కష్టాలు తీవ్రమయ్యా యి. గత రెండు, మూడు నెలలుగా నీటికోసం ప్రజలు అల్లాడుతున్నారు. సుమా రు రూ. వెయ్యి కోట్లు ఖర్చు చేసి ప్రజల తాగునీటి కష్టాలను తీర్చేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మిషన్ భగీరథ పథకంపై ప్రస్తుత సర్కార్లో పర్యవేక్షణ కరువైంది. మిషన్ భగీరథకు సంబంధించి గ్రిడ్ లేదా ఇం ట్రా విలేజ్లో నీటి సరఫరా ఆగిపోయినా సంబంధిత అధికారులు స్పందించడం లేదు. ఇంట్రా విలేజ్లో భగీరథ నీరు రావడం లేదని ప్రజలు ఫిర్యాదు చేస్తే మాకు సంబంధం లేదని, పంచాయతీ అధికారులు చూసుకుంటారని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా మిషన్ భగీరథ నీరు సక్రమంగా రావడం లేదని ప్రజలు ఫిర్యాదు చేసి రోడ్డెక్కి ధర్నాలు చేసిన రెండు, మూడు రోజుల తర్వాత.. మిషన్ భగీరథ అధికారులు తీరిగ్గా వెళ్లి.. అక్కడ ఏ సమస్య లేదంటూ ఒకరిద్దరితో వీడియోలు తీయించి జిల్లా ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అదేవిధంగా ఇంట్రా విలేజ్కు నీటిని సరఫరా చేసే గ్రిడ్లోనూ లికేజీలు ఏర్పడి మిషన్ భగీరథ నీరు వృథాగా పోతున్నా పట్టించుకోవడంలేదు. కాగా, గతంలో ఐఏఎస్ అధికారి మిషన్ భగీరథ పథకాన్ని పర్యవేక్షించడంతో సక్రమంగా నీటి సరఫరా జరిగింది. ప్రస్తుతం ఏ అధికారి కూడా సక్రమంగా పర్యవేక్షించకపోవడంతో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. జిల్లాలో ఫిబ్రవరి నుంచే ప్రజలు నీటికోసం అల్లాడుతున్నారు. ఓ వైపు మిషన్ భగీరథ నీటి సరఫరా లేకపోవడం, మరోవైపు భూగర్భజలాలు అడుగంటిపోవడంతో తాగునీటి సమస్యను తీర్చాలంటూ ప్రజలు రోడ్డెక్కుతున్నారు.
జిల్లాలో నీటికోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కిలోమీటర్ల మేర ఉన్న పొలాల్లోని బోరు, బావుల వద్దకు ఖాళీ బిందెలతో నడుచుకుంటూ వెళ్లడంతోపాటు ట్యాంకర్ల వద్ద నీటికోసం తోసుకునే పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో ఎండల తీవ్రత పెరిగి 42 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో భూగర్భజలాలు పూర్తిగా అడుగంటిపోతున్నాయి. ఫిబ్రవరి నాటికి 13.58 మీటర్ల లోతుకు జిల్లాలో నీటి నిల్వలు తగ్గగా, మార్చిలో 14.53 మీటర్లకు, ఏప్రిల్ చివరి నాటికి 15 మీటర్లకుపైగా అడుగంటిపోయాయి. అయితే ఈనెలాఖరు వరకు జిల్లాలో భూగర్భజలాలు ఇంకా ప్రమాదకర స్థాయిలో తగ్గే ప్రమాదం ఉన్నదని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే బోర్లు, బావుల్లో నీటి నిల్వలు తగ్గిపోవడం, మరోవైపు మిషన్ భగీరథ నీటి సరఫరా వారానికి ఒకట్రెండు రోజులే వస్తుండడంతో జిల్లాలోని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో తాగునీటి కోసం ట్యాంకర్లపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొన్నది. తండాలతోపాటు మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లోనూ తాగునీటి కోసం రోడ్డుపై ఇంటిల్లిపాది బిందెలు పట్టుకొని ట్యాంకర్లు ఎప్పుడు వస్తాయా..? అని ఎదురుచూస్తున్నారు.
వికారాబాద్ : తాగునీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారు. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ఐదోవార్డు కొత్రేపల్లిలో గత మూడు రోజులుగా మిషన్ భగీరథ నీరు రావడం లేదు. కాలనీకి నీటిని సరఫరా చేసే వాటర్మన్ గత నాలుగు రోజులుగా కనిపించకపోవడంతో ఈ సమస్య తలెత్తిందని కాలనీవాసులు పేర్కొంటున్నారు. దీంతో అరకిలోమీటర్ దూరంలో ఉన్న బావి నుంచి నీటిని తోడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో ఎలాంటి ఇబ్బంది లేదని.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ఈ సమస్య మొదలైందని పలువురు మండిపడుతున్నారు. తాము గత మూడు రోజులుగా అవస్థ పడుతున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
15, 20 రోజులకొకసారి మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదు. ఇలా నీరు రాన ప్పుడు స్థానికులు నాలుగైదు రోజుల వరకు చాలా ఇబ్బంది పడుతున్నారు. బోర్లు పనిచేయడం లేదు. దాంతో ట్యాంకర్లను ఆశ్రయించాల్సి వస్తున్నది. అవి ఒక వైపు వస్తే మరో వైపు రావడంలేదు. ఓ గల్లీకి కూడా నీరు సరిపోవ డం లేదు.
– మహమ్మద్ ఆరిఫ్, వాటర్మన్, యాలాల గ్రామం, యాలాల
నాలుగు రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రావడంలేదు. చాలా ఇబ్బంది అవుతున్నది. అసలే ఎండాకాలం.. ఎలా బతకాలో అర్థం కావడం లేదు. ఇట్ల తిప్పలు ఎప్పుడు పడలే. పైపులు పగిలిపోయానని అంటున్నారు. వాటిని త్వరగా బాగు చేయించొచ్చు కదా.
– గొల్ల లక్ష్మమ్మ, యాలాల గ్రామం, యాలాల