పరిగి, అక్టోబర్ 28 : తెలిసీ తెలియని, అవగాహన లేని, అశాస్త్రీయ విధానంలో వైద్యం చేస్తూ పేదల ప్రాణాలతో ఆడుకుంటున్న ఆర్ఎంపీలు, నకిలీ వైద్యులపై చర్యలు తీసుకోవడంలో వైద్యారోగ్యశాఖ అధికారులు విఫలమయ్యారనే విమర్శలున్నాయి. ఎప్పుడో ఒకసారి తప్పని పరిస్థితుల్లో వైద్యారోగ్య శాఖ అధికారులు తనిఖీలు చేసి ఒకటి రెండు ఆర్ఎంపీల క్లినిక్‌లను సీజ్ చేసినా…పక్షం రోజుల్లోనే అవి మళ్లీ కొనసాగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీజ్ చేసిన క్లినిక్‌లను తెరవాలంటే అనుమతి పత్రాలు, ఇతర వాటిని సమర్పించాల్సి ఉండగా ఇవేవీ లేకుండానే అడ్డదారిలో మళ్లీ యథేచ్ఛగా తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి గత మార్చి నెలలో దోమ మండలంలోని ఊట్పల్లి గ్రామానికి చెందిన బంటు శ్రీనివాస్ మృతికి పరిగికి చెందిన ఆర్ఎంపీ కారణమంటూ, ఆయనపై చర్యలు తీసుకోవాలని పలువురు డీఎంహెచ్‌వో పాల్వన్కుమార్కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదే శాల మేరకు మార్చి 22న డిప్యూటీ డీఎంహెచ్వోలు డాక్టర్లు జీవరాజ్, రవీంద్ర, శ్రీనివాస్ విచారణ జరిపి ఆర్ఎంపీ నిర్వహిస్తున్న యాసిన్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్‌ను సీజ్ చేశారు. ఈ సెంటర్‌ను నిర్వహించేందుకు ఎలాంటి అర్హతలు, అనుమతుల్లేవని నిర్ధారించారు.
గత నెలలో చౌడాపూర్ మండల కేంద్రంలో తనిఖీలు చేసిన అధికారులు ఎస్కే, మదిహా డయాగ్నస్టిక్ సెంటర్లు, మదిహా క్లినిక్, రాజ్యలక్ష్మి ఫస్ట్ ఎయిడ్ సెంటర్, షిఫా క్లినిక్‌లను సీజ్ చేశారు. అదేవిధంగా శనివారం టీఎంసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్ నేతృత్వంలో టీఎంసీ సభ్యుడు డాక్టర్ సాయివిజయ్, అరుంధతి, సత్యప్రసాద్, ఎంసీఐ డాక్టర్ల బృందం పరిగి పట్టణంలోని యాసిన్, గ్లోబల్, హనుమాన్, రాఘవేంద్ర, పల్లవి తదితర క్లినిక్‌లలో తనిఖీలు చేయగా.. ఎలాంటి అర్హత, అనుమతుల్లేకుండా బెడ్స్ వేసి పేషెంట్లకు చికిత్స చేస్తున్నారని, ఇష్టానుసారంగా యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్స్ వినియోగిస్తున్నట్లు గుర్తించారు. నకిలీ వైద్యులపై ఎన్ఎంసీ చట్టం 34, 35 ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామన్నారు. అర్హత లేకుండా కొనసాగుతున్న క్లినిక్‌లను సీజ్ చేయాల్సిందిగా డీఎంహెచ్‌వోకు నివేదిస్తామన్నారు. ఓ వైద్యుడు తన విద్యార్హత ఎంబీబీఎస్ అంటూ బోర్డుపై రాసుకొని క్లినిక్‌ను నిర్వహిస్తుండగా టీఎంసీ డాక్టర్ల బృందం సర్టిఫికెట్లు అడిగితే చూపించకపోవడం విడ్డూరం.
ఆర్ఎంపీలు అల్లోపతి వైద్యం చేయరాదు, కేవలం ప్రాథమిక చికిత్స మాత్రమే అందించాలి. ఏ చిన్న రోగమైనా ఇంజెక్షన్లూ ఇవ్వరాదు. ఇదిలావుండగా ఆర్ఎంపీలు డాక్టర్లమంటూ బోర్డులు వేలాడదీసేవారు.. బీఆర్ఎస్ హయాంలో ఉన్నతాధికారుల చర్యలతో కేవలం ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు అని బోర్డులు ఏర్పాటు చేసుకున్నారు. మిడిమిడి జ్ఞానంతో మందులు రాస్తూ, ఇంజెక్షన్ చేస్తూ రోగుల నుంచి అం దినకాడికి దండుకుంటున్నారు. క్లినిక్ల్లోనే నాలుగైదు గదులను ఏర్పాటు చేసి రోగులకు స్లైన్లు పెడుతున్నారు. ఆర్ఎంపీలు హైడోస్ ఇంజెక్షన్లు, మందులు ఇచ్చి రోగం త్వరగా నయమయ్యేలా చేస్తుండడంతో పేదలు ఎంబీబీఎస్ డాక్టర్ల కంటే ఆర్ఎంపీల వద్దకే వైద్యం కోసం వెళ్తుండడం గమనార్హం. కొందరు ఇష్టానుసారంగా యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్స్ ఇస్తున్నట్లు టీఎంసీ డాక్టర్ల బృందం గుర్తించింది. తాము రాసే ప్రిస్క్రిప్షన్ బయటికి పోతే ఇబ్బంది వస్తుందని భావించి బంధువులతో తమ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ పక్కనే మెడికల్ షాపులు పెట్టించి.. అక్కడే మందులు కొనుగోలు చేయాలని రోగులకు సూచిస్తున్నారు. ఓ వైపు వైద్యం, మరోవైపు మెడికల్‌షాపుల ద్వారా పలువురు ఆర్ఎంపీలు ప్రతినెలా రూ.లక్షల్లో సంపాదిస్తున్నారు.
వైద్యారోగ్యశాఖ పనితీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలున్నాయి. అధికారుల తీరుతో ప్రైవేట్ దవాఖానల అక్రమ సంపాదనకు అడ్డూఅదుపు లేకుండాపోతున్నది. మరోవైపు ఆర్ఎంపీలు మిడిమిడి జ్ఞానంతో వైద్యం చేస్తూ పేదల ప్రాణాలతో ఆడుకుంటు న్నా వారిని అరికట్టడంలో అధికారులు విఫలమవుతున్నారనే ఆరోపణలున్నాయి. అంతేకాకుండా అధికారులు తనిఖీలు చేసి సీజ్ చేసిన ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు వారం, పది రోజుల్లోనే యథావిధిగా మళ్లీ కొనసాగుతున్నాయి. అధికారుల అవినీతి ఈ పరిస్థితికి కారణం అని కొందరు ఆరోపిస్తుండగా, రాజకీయ నాయకుల ఒత్తిడితోనే తాము అటు వైపు నకు వెళ్లడం లేదని అధికారులు తప్పించుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి నకిలీ వైద్యులు, ఆర్ఎంపీల అశాస్త్రీయ వైద్యంపై కఠినచర్యలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు.
బంట్వారం(కోట్‌పల్లి), అక్టోబర్ 28 : బంట్వారం, కోట్‌పల్లి మండలాల పరిధిలో ఫస్ట్ ఎయిడ్ క్లినిక్‌లు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. అనుమతులు కొన్నింటికే ఉండగా.. పర్మిషన్ లేనివి అధిక సంఖ్యలో ఉన్నాయి. అయితే పరిగి, తాండూరు మండలాల్లో ఎంసీఐ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తుండడంతో ఈ రెండు మండలాల్లోని ప్రైవేట్ క్లినిక్‌ల నిర్వాహకుల్లో భయం మొదలైంది. రెండేండ్ల కిందట డీఎంహెచ్‌వో అధికారులు బంట్వారంలో ఓ ప్రైవేట్ క్లినిక్‌ను తనిఖీ చేయగా ఎలాంటి అనుమతుల్లేవని గుర్తించి సీజ్ చేశారు. కొన్ని రోజుల తర్వాత స్థానిక ప్రజా ప్రతినిధుల ప్రోద్బలంతో మళ్లీ తెరుచుకున్నది. అధికారులు అనుమతులిచ్చారా.. లేదా..? తెలియాల్సి ఉన్నది. అదేవిధంగా కోట్‌పల్లి మండల కేంద్రంలో కొనసాగు తున్న పలు క్లినిక్‌లపై పలు సందేహాలు ఉన్నాయని, అనుమతుల్లేకుండానే అవి నడుస్తున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు.