రంగారెడ్డి, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ) : అందరికీ రుణమాఫీ చేశామని ఓ పక్క కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుండగా.. మాకు మాఫీ వర్తించలేదు మహాప్రభో! అంటూ రైతాంగం గగ్గోలు పెడుతున్నది. మొదటి, రెండు విడుతల్లోనూ పేరు రాని రైతులు మూడో విడుత జాబితా కోసం ఎదురుచూశారు.
మూడో జాబితాలోనూ పేర్లు లేకపోవడంతో.. మేం రైతులం కాదా? మాకెందుకు మాఫీ కాలేదు? అంటూ అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో కలెక్టరేట్‌కు, మండల వ్యవసాయాధికారి కార్యాలయానికి రైతుల నుంచి ఫిర్యాదులు పోటెత్తుతున్నాయి. అధికారికి గణాంకాల ప్రకారం వెల్లడించిన జాబితాలో కనీసం మూడో వంతు మందికి కూడా మాఫీ జరుగకపోవడంతో జిల్లా రైతాంగం ఆందోళన చెందుతున్నది.
ఆంక్షల పేరిట మంగళం..
రంగారెడ్డి జిల్లాలో మొదటి విడుతలో 49,471 మందికి రూ.257.19 కోట్ల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. రెండో విడుతలో 22,915 మంది రైతులకు సంబంధించిన రూ.218.13 కోట్లను, మూడో విడుతలో 15,226 మంది రైతులకు రూ.185.40కోట్ల రుణాలను మాఫీ చేసినట్లు ప్రభుత్వం చెబుతున్నది.
మూడు విడుతల్లో కలిపి జిల్లాలో 87,612 మందికి రూ.660.72కోట్లను మాత్రమే మాఫీ చేసింది. అర్హులు లక్షల్లో ఉండగా.. కేవలం వేలల్లోనే రుణమాఫీ చేసి చేతులు దులుపుకున్నది. రేషన్‌కార్డులేక కుటుంబ నిర్ధారణ కాకపోవడం, పట్టాపాసుబుక్ లేకపోవడం, ఆధార్ కార్డుకు లోన్ ఖాతాకు పేరులో తేడా ఉండడం, సొసైటీలు, బ్యాంకుల్లో జరిగిన తప్పులతో వేల మంది రుణమాఫీకి దూరమయ్యారు.
మూడో జాబితాపై ఆశలు పెట్టుకున్న వారిపైననూ ప్రభుత్వం నీళ్లు చల్లింది. ప్రభుత్వం ప్రకటించిన అన్ని అర్హతలు ఉన్నవారికి సైతం రుణమాఫీ కాలేదు. తెల్ల రేషన్ కార్డు ఉన్నా.. కుటుంబంలో ఒక్కరే రుణం తీసుకున్నా.. పట్టాపాస్ పుస్తకం ఉన్నా.. ఆధార్ కార్డు, బ్యాంకు బుక్‌లో ఎలాంటి పొరపాట్లు లేకుండా ఉన్నప్పటికీ రూ.2లక్షల్లోపు రుణమాఫీ వర్తించలేదని రైతులు వాపోతున్నారు. రుణమాఫీ పోర్టల్‌లో పరిశీలిస్తే.. టు బీ ప్రాసెస్ అని వస్తున్నదని రైతులు చెబుతున్నారు.
నమ్మశక్యంగాలేని అధికారుల మాటలు..
రూ.2లక్షల లోపే రుణం తీసుకున్నప్పటికీ జాబితాలో పేర్లు లేకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ శాఖ కార్యాలయం, కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ సెంటర్ల వద్దకు పరుగులు తీస్తున్నారు. అధికారులు రుణమాఫీ పోర్టల్‌లో పరిశీలించి వివరాలు వెల్లడిస్తున్నప్పటికీ.. స్పష్టత రావడం లేదు. గ్రీవెన్స్‌లో దరఖాస్తు చేసుకుంటే అర్హులందరికీ మాఫీ అవుతుందని ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నా.. రైతుల్లో నమ్మకం కలుగడం లేదు.
సొసైటీల్లోని రైతులకు మొండి చెయ్యి..
పీఏసీఎస్‌లో రూ.2లక్షలు రుణాలు తీసుకున్న రైతులకు మూడో జాబితాలోనూ ప్రభుత్వం మొండి చెయ్యి చూపింది. మొదటి, రెండో విడుతల్లో పేర్లు రాక.. మూడో విడుతపై ఆశలు పెట్టుకున్న రైతులకు భంగపాటే మిగిలింది. నందిగామ పీఏసీఎస్‌లో రూ.2లక్షల రుణాలను 44 మంది రైతులు తీసుకుంటే కేవలం 18 మందికి మాత్రమే మాఫీ అయింది. 26 మందికి కాలేదు. మేకగూడ పీఏసీఎస్‌లో 38 మంది రైతులు రుణాలు తీసుకుంటే 241 మందికే మాఫీ కాగా.. 139 మంది రుణ విముక్తి కలుగలేదు. చేగూర్ పీఏసీఎస్‌లో 349 మంది రైతులకుగాను 236 మందికే మాఫీని వర్తింపజేశారు. ఇంకా 113 మంది రుణమాఫీకి దూరంగానే ఉన్నారు.
వికారాబాద్ జిల్లాలో..
పరిగి : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.2 లక్షలు రుణమాఫీ అంటూ ఆచరణకు అమలుకానీ హామీలిచ్చి ఇప్పుడు తీరా కొందరికే రుణమాఫీ చేయడం తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. ఎలాంటి షరతులు లేకుండా మాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ సర్కార్.. అనేక కొర్రీలు పెడుతున్నదని జిల్లావాసులు మండిపడుతున్నారు. పరిగి మండలం రంగాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో సుమారు 405 మంది రైతులు ఉన్నారు. వారిలో 200 మందికి పైగానే వివిధ బ్యాంకుల్లో రుణాలు పొందారు.
గత ఐదేండ్ల కాలంలో రుణం పొందిన వారికి రూ.2లక్షలు రుణమాఫీ అవుతుందని ఆశించారు. కానీ అరకొర మాఫీతో రైతులు పెదవి విరుస్తున్నారు. రంగాపూర్ పరిధిలో మొదటి విడుతలో లక్షలోపు రుణం ఉన్న 60 మంది రైతులకు రూ.43,48,950 మాఫీ జరిగింది. రెండో విడుతలో 42 మంది రైతులకు రుణమాఫీ జరిగింది. ఆగస్టు 15న మూడో విడుతలో ఎంతమందికి మాఫీ అయ్యిందో స్పష్టతలేదు. బ్యాంకు వారు తీసుకున్న వివరాలు కరెక్టుగా ఉన్నా పేరు మిస్‌మ్యాచ్ అని, రేషన్ కార్డులో ఒకే కుటుంబం వారు ఉన్నారన్న తదితర కారణాలు చెబుతూ రుణమాఫీ కాలేదంటూ బ్యాంకులు, వ్యవసాయ కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు.
కొందరికి రుణమాఫీ జరిగినట్లు మెసేజ్‌లు వచ్చినా డబ్బులు అందలేదు. ఒకే రేషన్‌కార్డులో తండ్రి, కొడుకుల పేర్లు ఉండి, వారు వేర్వేరు కాపురంగా ఉంటున్నా వారికీ రుణమాఫీ కాలేదు. వాణిజ్య పంటలు పండించే రైతులకు మాఫీ చేయలేదు. తమకు ఎంత రుణం ఉన్నదన్నది కాకుండా ప్రభుత్వం ఇచ్చే రూ.2లక్షలు మాఫీ అందరికీ వర్తింపజేయాలని, మిగతా డబ్బులు తాము చెల్లించుకుంటామని రైతాంగం పేర్కొంటున్నది.
ఒకే రేషన్‌కార్డు ఉన్నదని మాఫీ కాలె..
నా పేరిట 7.11 ఎకరాలు భూమి ఉండగా, పరిగిలోని ఎస్బీఐలో రూ.1.50లక్షలు రుణం తీసుకున్నా. నా కుమారుడు లావుడ్య నరేశ్ పేరిట 2 ఎకరాల భూమి ఉండగా రూ.80వేలు రుణం తీసుకున్నాడు. మాకు ఒకే రేషన్ కార్డు ఉండడంతో రుణమాఫీ కాలేదు.
-లావుడ్యా విజయ్, రంగాపూర్తండా, పరిగి మండలం
అధికారులు మాట దాటవేస్తుండ్రు..
నాకు, మా నాయన బాలయ్యకు రుణమాఫీ కాలేదు. పరిగిలోని ఎస్బీఐలో రుణం తీసుకున్నా. మాకు ఒకే రేషన్‌కార్డు ఉన్నదన్న కారణంగా రుణమాఫీ చేయలేదు. వ్యవసాయాధికారులను అడిగితే మాట దాటవేస్తుండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పి రైతులను మోసం చేస్తున్నది. రాబోవు రోజుల్లో గుణపాఠం తప్పదు.
– చాకలి వెంకటయ్య, రంగాపూర్, పరిగి మండలం
అధికారుల చుట్టూ తిరుగుతున్నా..
నా పేరుపైన రెండు ఎకరాల భూమి ఉన్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాలె. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి అన్ని కల్లబొల్లి మాటలే. నేను చేగూరు పీఏసీఎస్‌లో రూ.58,000 పంట రుణం తీసుకున్నా. మూడో విడుతలోనూ మాఫీ కాలె. అధికారులు, బ్యాంకుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు.
– బంట్రపు చెన్నమ్మ, ఈదులపల్లి, నందిగామ
మాఫీ అంటే సంతోషపడ్డా..
రుణమాఫీ అయితుందంటే ఎంతో సంతోషపడ్డా. చేవెళ్ల లోని ఎస్బీఐలో రూ.98,400 పంట రుణం తీసుకున్న. కానీ నాకు రుణమాఫీ కాలె. అధికారుల చుట్టూ రోజూ తిరుగుతున్నా. వడ్డీకి డబ్బులు తెచ్చి సాగు చేసినా. కాంగ్రెసోళ్ల మాయ మాటలు నమ్మి మోసపోయినం.
– మక్బూల్, చేవెళ్ల గ్రామం, రంగారెడ్డి జిల్లా
మూడో విడుతలోనూ మాఫీ కాలె..
మూడో విడుతలోనూ రుణ మాఫీ కాలె. చేవెళ్లలోని డీసీసీబీ బ్యాంకులో రూ.35 వేల రుణం తీసుకున్నా. అధికారులను అడిగితే వెయిట్ చెయ్యండి అంటూ దాటవేస్తున్నారు. కాంగ్రెసోళ్ల మాయమాటలు నమ్మి మోసపోయినం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు కొంచమైనా బాధ కలుగలె. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ సవాలక్ష కొర్రీలు పెట్టి రైతుల ఉసురు పోసుకుంటున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాలు చెప్పి రైతులు, ప్రజలను మోసం చేస్తున్నది.
– కొల్లగల్ల స్వర్ణలత, ఈర్లపల్లి గ్రామం, చేవెళ్ల మండలం, రంగారెడ్డి జిల్లా