వికారాబాద్, సెప్టెంబర్ 20 : పింఛన్లు పెంచే వరకు ఉద్యమం ఆగదని దివ్యాంగుల హక్కుల పోరాట సమితి వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు శ్యాంప్రసాద్ స్పష్టం చేశారు. శనివారం వికారాబాద్ ప్రాంత దివ్యాంగులతో కలిసి ఆయన మున్సిపల్ కార్యాల యం ఎదుట ధర్నా చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం దివ్యాంగుల పింఛన్‌ను రూ.6016కు, చేయూత పింఛన్లను రూ. 4,016కు, తీవ్రవైకల్యం గల దివ్యాంగులకు రూ. 15,000 హామీ ఇచ్చిన తేదీ నుంచి బకాయిలతో సహా చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్న పింఛన్‌దారులందరికీ దరఖాస్తు చేసుకున్న తేదీ నుంచి మంజూరు చేయాలన్నారు. ఏఐసీసీ ఎన్నికల హామీ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో దివ్యాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తూ చట్ట సవరణ లేదా ఆర్డినెన్స్ ద్వారా అమలు చేయాలన్నారు. దివ్యాంగుల రక్షణ చట్టాన్ని మరింత బలోపేతం చేయాలని.. అదేవిధంగా ఆర్టీసీలో నాలుగు శాతం బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
అనంతరం మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆనంద్‌మాదిగ మాట్లాడుతూ.. అక్టోబర్ 11న హైదరాబాద్‌లో జరుగనున్న చేయూత పింఛన్‌దారులు, దివ్యాంగుల పింఛన్‌దారుల మహాగర్జన కార్యక్రమం నిర్వహించే లోపే సీఎం రేవంత్‌రెడ్డి పింఛన్ల పెంపు పై నిర్ణయం తీసుకోవాలని, లేకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పింఛన్‌దారుల సత్తా చూపుతామని హెచ్చరించారు.
అనంతరం కార్యాలయ అధికారికి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందించారు. కార్యక్రమంలో దివ్యాంగుల హక్కుల పోరాట సమితి మండల కమిటీ, ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి ప్రశాంత్మాదిగ, వీహెచ్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటయ్య, మహిళా నాయకురాలు సునీత, వికారాబాద్ మండల ఇన్చార్జి కిష్టయ్య పాల్గొన్నారు.