తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం పారదర్శక పాలన అందిస్తూ బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్నది.. పల్లె ప్రగతి కింద ఇప్పటి వరకు రంగారెడ్డి జిల్లాకు రూ.335 కోట్ల నిధులు మంజూరయ్యాయి.. పట్టణ ప్రగతి కింద ప్రతి నెలా రూ.2.12 కోట్ల నిధులు విడుదలవుతున్నాయి..’ అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. గురువారం రాష్ర్టావిర్భావ దినోత్సవం సందర్భంగా సరూర్‌నగర్‌లోని ఇండోర్ స్టేడియంలో అమరవీరుల స్మారక స్థూపానికి మంత్రి నివాళులర్పించి, అనంతరం జిల్లా కలెక్టరేట్లో జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. ఇప్పటివరకు టీఎస్ఐ-పాస్ కింద పరిశ్రమల ఏర్పాటుకు జిల్లాకు రూ.71,674 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం పూర్తైతే జిల్లాలోని 3.59 లక్షల ఎకరాలకు సాగునీరందుతుందన్నారు. మన ఊరు-మన బడి కింద ప్రభుత్వ పాఠశాలలకు కొత్త హంగులు సమకూరుతున్నాయన్నారు. నేటి నుంచి బడి బాట కార్యక్రమం కొనసాగుతుందని, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని బడీడు పిల్లలను బడిలో చేర్పించేలా అవగాహన కల్పించాలన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రతి పల్లెలో క్రీడా మైదానాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నదని, ప్రస్తుతం మండలానికి రెండు గ్రామీణ క్రీడా మైదానాలు సిద్ధమయ్యాయన్నారు.
రంగారెడ్డి, జూన్ 2, (నమస్తే తెలంగాణ): ఎనిమిదేండ్లలో బంగారు తెలంగాణ దిశగా బలమైన అడుగులు వేయగలిగామని, దేశంలో మరే రాష్ట్రం అమలు చేయని ఎన్నో కార్యక్రమాలను అమలు చేసి దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. గురువారం రాష్ర్టావిర్భావ దినోత్సవం సందర్భంగా సరూర్‌నగర్‌లోని ఇండోర్ స్టేడియంలో అమరవీరుల స్మారక స్తూపానికి మంత్రి సబితాఇంద్రారెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్‌భగవత్, అదనపు కలెక్టర్లు తిరుపతిరావు, ప్రతీక్‌జైన్ నివాళులర్పించారు, అనంతరం కలెక్టరేట్ కార్యాలయంలో పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన మంత్రి సబితాఇంద్రారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎందరో అమరవీరుల త్యాగాలతో ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలుచేస్తూ ఆదర్శంగా నిలిచిందన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ముందుకెళ్తున్నారన్నారు. జిల్లాలో చేపట్టిన మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ పనులతో పూర్వ వైభవం వచ్చిందని, మిషన్ భగీరథతో జిల్లాలోని ప్రతి ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా జిల్లా మహిళా సమాఖ్యకు రూ.25.65 కోట్ల బ్యాంకు లింకేజీకి సంబంధించి చెక్కును మంత్రి అందజేశారు.
నేటి నుంచి బడిబాట..
నేటి నుంచి బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు, ప్రజాప్రతినిధులు, అధికారులంతా బడిబాట కార్యక్రమంలో పాల్గొని, బడీడు పిల్లలందరినీ బడిలో చేర్పించేలా అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. అదేవిధంగా బడిబాట కార్యక్రమంలో భాగంగా ప్రధానంగా ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం అమలును ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలను కల్పించి కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. మన ఊరు-మన బడి కింద మొదటి విడుతలో జిల్లాలో 464 పాఠశాలలను ఎంపిక చేశామని, పనులు ప్రారంభమయ్యాయని, పాఠశాలలు పునఃప్రారంభమయ్యేలోగా అన్ని హంగులతో సిద్ధం చేస్తామన్నారు. అదేవిధంగా ఒకటి నుంచి పదో తరగతి వరకు జిల్లాలో 1,72,425 మందికి మధ్యాహ్న భోజన పథకం కింద సన్నబియ్యంతో కూడిన భోజనం అందిస్తున్నామన్నారు.
ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలు..
క్రీడాకారులను ప్రోత్సహించేందుకుగాను తెలంగాణ గ్రామీణ ప్రాంగణాలను ఏర్పాటు చేశామని, ఇందులో భాగంగా జిల్లాలో మొదటగా మండలానికి రెండు క్రీడా ప్రాంగణాలను సిద్ధం చేశామన్నారు. అదేవిధంగా ధరణితో భూసంబంధిత లావాదేవీలు అత్యంత పారదర్శకంగా సేవలందుతున్నాయని, ఇప్పటివరకు జిల్లాలో 1,38,310 దరఖాస్తులురాగా, 1,33,118 దరఖాస్తులను పరిష్కరించినట్లు మంత్రి వెల్లడించారు. అంతేకాకుండా ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.97.56 కోట్లు, ఉపకార వేతనాల కింద రూ.17.51 కోట్లను 21,761 మంది విద్యార్థుల ఖాతాల్లో జమ చేశామన్నారు. విదేశాల్లో ఉన్నత విద్యనందించేందుకు జిల్లాకు చెందిన 22 మంది విద్యార్థులకు రూ.20 లక్షల చొప్పున అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి కింద రూ.4.49 కోట్లను జమ చేశామని మంత్రి తెలిపారు.
జిల్లాలోని యువతకు ఉచిత శిక్షణ..
రాష్ట్రంలోని యువతీ, యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో 87వేలకుపైగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రక్రియను చేపట్టిందని మంత్రి వెల్లడించారు. జిల్లాలోని యువతకు గ్రూప్స్‌లో ఉచిత శిక్షణ ఇవ్వడానికి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు కలిపి హైదరాబాద్ బీసీ స్టడీ సర్కిల్లో ఉచిత శిక్షణనందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో నాయీ బ్రాహ్మణులు, రజకులు నిర్వహిస్తున్న క్షౌరశాలలు, లాండ్రీ షాపులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మైనార్టీ సంక్షేమం కింద జిల్లాలో 2021లో క్రిస్మస్ సందర్భంగా 3వేల నిరుపేద క్రిస్టియన్ కుటుంబాలకు క్రిస్మస్ కానుకలను అందజేశామన్నారు. రంజాన్ పండుగకు సంబంధించి 6 వేల మంది నిరుపేద ముస్లిం కుటుంబాలకు గిఫ్ట్ ప్యాకెట్లు అందజేశామని మంత్రి పేర్కొన్నారు. అదేవిధంగా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో 368 గ్రామాల్లో గొర్రెకాపరుల సంఘాలను ఏర్పాటు చేసి 41,694 మంది సభ్యులకు సుమారు రూ.146 కోట్లతో ఇప్పటివరకు 11,663 యూనిట్లను పంపిణీ చేశామన్నారు. నీలి విప్లవంలో భాగంగా మత్స్యశాఖ ద్వారా మత్స్యకారుల అభివృద్ధి కోసం 794 చెరువుల్లో వంద శాతం సబ్సిడీతో 161లక్షల చేప పిల్లలను చెరువుల్లో వదిలినట్లు చెప్పారు.
రూ.335.32కోట్ల నిధులు..
పల్లెల్లో సమగ్రాభివృద్ధి కోసం పల్లెప్రగతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. పల్లెప్రగతి కార్యక్రమంతో పల్లెలన్నీ పరిశుభ్రత, పచ్చదనంతో రూపుదిద్దుకున్నాయన్నారు. పల్లెప్రగతి ద్వారా 558 గ్రామ పంచాయతీల్లో వైకుంఠధామాలు, డంపింగ్ యార్డుల నిర్మాణం పూర్తి చేసినట్లు చెప్పారు. నర్సరీలు, పల్లెప్రకృతి వనాలు, ట్రాక్టర్ ట్యాంకర్, ట్రాలీలను సమకూర్చమన్నారు. పల్లెప్రగతి కింద జిల్లాకు ప్రతినెలా రూ.9.80 కోట్ల నిధులు మంజూరు చేసి గ్రామాలను అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు. పల్లెప్రగతి కింద ఇప్పటివరకు రూ.335 కోట్ల నిధులను మంజూరు చేశామన్నారు. అదేవిధంగా పట్టణ ప్రగతిలో భాగంగా ప్రతినెల సుమారు రూ.2.12 కోట్ల నిధులను మంజూరు చేసి 12 మున్సిపాలిటీలు, 4 కార్పొరేషన్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. పట్టణ ప్రగతి కింద ఇప్పటివరకు రూ.57.41కోట్ల నిధులను మంజూరు చేశామని మంత్రి వెల్లడించారు.
టీఎస్-ఐపాస్ కింద రూ.71,674 కోట్ల పెట్టుబడులు..
జిల్లాలో పరిశ్రమలకు ఏర్పాటుకు కావాల్సిన అనుమతులను టీఎస్ఐపాస్ ద్వారా నిర్ణీత సమయంలో మంజూరు చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు టీఎస్ఐ-పాస్ కింద రూ.71,674 కోట్ల పెట్టుబడులురాగా, 1408 పరిశ్రమలు ఏర్పాటుకు వివిధ శాఖల అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నారన్నారు. జిల్లాలో పీఅండ్‌జీ, వెల్స్పన్, పోకర్ణ గ్రానైట్, రేడియంట్, చిర్పాల్ తదితర ఉత్పత్తి సంస్థలు జిల్లాలో ఏర్పాటయ్యాయన్నారు. రైతు సంక్షేమానికి సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యతనిస్తూ ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని, పెట్టుబడి నిమిత్తం సాయమందించేందుకుగాను ఎకరానికి రూ.10వేల చొప్పున ఆర్థికసాయం, రైతుబీమా కింద రైతు ఏ విధంగా మరణించినా ఒక్కొక్కరికీ రూ.5 లక్షల చొప్పున ఇప్పటివరకు 629 మంది రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో రూ.31.45 కోట్లను జమ చేసినట్లు మంత్రి వెల్లడించారు.
పాలమూరు ప్రాజెక్టుతో సాగునీరు..
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు కెనాల్ నెట్వర్క్ రెండో దశ నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయని మంత్రి తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం పూర్తైతే జిల్లాలోని 20 మండలాలకు చెందిన 330 గ్రామాలకు చెందిన జిల్లాలోని 3.59 లక్షల ఎకరాలకు సాగునీరందించనున్నామన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో 33 శాతం గ్రీనరీ సాధించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, ఈ ఏడాది హరితహారంలో భాగంగా 77 లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రతి మండలంలో బృహత్ పల్లెప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో 60 బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో 38 బస్తీ దవాఖానలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని, మరో 22 బస్తీ దవాఖానలను త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు. నాలుగు సూపర్ స్పెషాలిటీ దవాఖానల నిర్మాణ పనులు కొనసాగుతున్నట్లు చెప్పారు. అదేవిధంగా జిల్లాలోని 7 ఐసీడీఎస్ ప్రాజెక్టుల కింద 1600 అంగన్వాడీ కేంద్రాల ద్వారా 1.16 లక్షల మందికి ఆరేండ్లలోపు పిల్లలు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితాహరినాథ్‌రెడ్డి, కలెక్టర్ డి.అమయ్‌కుమార్, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్, అదనపు కలెక్టర్లు తిరుపతిరావు, ప్రతీక్‌జైన్, డీఆర్వో హరిప్రియ, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.