వికారాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): మలిదశ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన ఉద్యమ నాయకుడు కేసీఆర్ తెలంగాణ తెచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అని ఆమరణ నిరాహార దీక్షకు దిగి ఈ నెల 29కి సరిగ్గా పదిహేనేండ్లు. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. రాష్ట ఏర్పాటు అనంతం ప్రతి ఏటా నవంబర్ 29న దీక్షాదివస్‌గా నిర్వహిస్తూ వస్తున్నది. దీక్షాదివస్ కార్యక్రమాన్ని ఈసారి అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కేసీఆర్ ఆదేశాలతో జిల్లా కేంద్రంలో దీక్షాదివస్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేందుకుగాను పార్టీ జిల్లా యంత్రాంగం సన్నాహాలు చేస్తున్నది.
ఇందులో భాగంగా మంగళవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దీక్షాదివస్ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ ఆధ్వర్యంలో నాలుగు నియోజకవర్గాల్లోని ముఖ్య నాయకులు, మండలాల అధ్యక్షులు, మాజీ ఎంపీపీలు, జడ్పీటీసీలు, పార్టీ మండలాల అధ్యక్షులతో దీక్షాదివస్ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దీక్షాదివస్ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 29న నిర్వహించనున్న దీక్షాదివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. నియోజకవర్గానికి 500 నుంచి 600 మంది చొప్పున 2 వేల మందితో దీక్షాదివస్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అందరూ సమన్వయంతో పని చేయాలని సూచించారు.
ఈ నెల 29న వికారాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించనున్న దీక్షాదివస్ కార్యక్రమానికి అందరూ హాజరై తెలంగాణ తల్లికి పూలమాల వేసి, అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి, మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేయాలన్నారు. దీక్షాదివస్ రోజున ఉద్యమ నేత కేసీఆర్ ఉద్యమ ప్రస్ధానానికి సంబంధించి డాక్యుమెంటరీని దీక్షాదివస్ రోజున ప్రదర్శించనున్నట్లు నవీన్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. ఉద్యమ ప్రస్థానంలో కేసీఆర్ నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో రాష్ర్టాన్ని సాధించి, సాగునీటి ప్రాజెక్టులను చేపట్టడంతోపాటు ఉద్యోగ నియామకాలు చేపట్టి సబ్బండ వర్ణాల సంక్షేమం నిమిత్తం రైతు బీమా, రైతు బంధు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాలను అమలు చేశారని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలో అన్నింటిలోనూ వైఫల్యం చెందిందని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. అందరికీ పదవులు రావని, పార్టీ కోసం కష్టపడి పని చేసే వారికి తప్పనిసరిగా ఆలస్యంగానైనా న్యాయం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్, మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు విజయ్‌కుమార్, నాగేందర్ గౌడ్, శ్రీశైల్ రెడ్డి, శుభప్రద్‌పటేల్, రాజుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.