ధరణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని.. గత మూడు నెలల్లో 5 వేల దరఖాస్తులను పరిష్కరించినట్లు వికారాబాద్ కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. ప్రభుత్వం, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ.. మెరుగైన సేవలందిస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జిల్లాలో సమూల మార్పులు తీసుకొచ్చి ప్రజల మన్ననలు పొందుతున్న ఆయన ‘నమస్తే తెలంగాణ’తో పలు విషయాలను పంచుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో క్రమశిక్షణ, జవాబుదారీతనం తెచ్చేందుకు జియో అటెండెన్స్ యాప్, భూసమస్యల పరిష్కారానికి ప్రత్యేక వేదికలు, ప్రతి సోమవారం ప్రజావాణి చేపడుతున్నట్లు తెలిపారు. అనంతగిరిలోనే ప్రభుత్వ మెడికల్ కాలేజీ భవనాన్ని నిర్మిస్తామని, రెండేండ్లలో అందుబాటులోకి వస్తుందన్నారు. ధఅదేవిధంగా పేదలను దృష్టిలో ఉంచుకొని రూ.1800లకు విక్రయిస్తున్న ఇసుక లోడ్‌ను కేవలం రూ.600లకే అందించేలా నిర్ణయించామన్నారు.
వికారాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ) : వికారాబాద్ కలెక్టర్‌గా నారాయణరెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి జిల్లాలో సమూల మార్పులు తీసుకువచ్చారు. విధుల్లో నిర్లక్ష్యం వహించడంతోపాటు ప్రజలకు అందుబాటులో ఉండని ప్రభుత్వ ఉద్యోగులను దారిలో పెట్టేందుకు జిల్లా పాలనాధికారి తీసుకువచ్చిన జియో అటెండెన్స్ యాప్‌తో గత రెండు నెలలుగా గ్రామస్థాయి మొదలుకొని జిల్లా కలెక్టరేట్ వరకు ప్రజలకు అందుబాటులో ఉండడంతోపాటు సక్రమంగా విధులకు హాజరవుతున్నారు. భూ సమస్యలు అంటే నేరుగా కలెక్టరేట్‌కే రాకుండా మండల తహసీల్దార్ కార్యాలయాల్లోనూ భూసమస్యల వినతులను స్వీకరించే వేదికను అందుబాటులోకి తీసుకువచ్చారు.
ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం వరకు వినతులను స్వీకరిస్తూ చాలా సమస్యలకు వెంటనే పరిష్కారం చూపుతూ జిల్లా ప్రజల మన్ననలు పొందుతున్నారు కలెక్టర్ నారాయణరెడ్డి. క్షేత్రస్థాయి నుంచి కలెక్టరేట్ వరకు ఎక్కడా అవినీతికి తావులేకుండా పూర్తి పారదర్శకంగా పాలనా కార్యకలాపాలు జరిగేలా కలెక్టర్ పకడ్బందీ చర్యలు చేపట్టి జిల్లా ప్రజలతో శభాష్ అనిపించుకుంటున్నారు. ప్రభుత్వం సబ్బండ వర్గాలకు అందిస్తున్న సంక్షేమ ఫలాలను అర్హులైన ప్రతీ ఒక్కరికి అందేలా చర్యలు తీసుకుంటూ, జిల్లా అభివృద్ధిలో తనదైన ముద్ర వేస్తున్న కలెక్టర్ నారాయణరెడ్డితో నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూ..
అనంతగిరిలోని వైద్యారోగ్య శాఖకు సంబంధించిన స్థలంలోనే ప్రభుత్వ మెడికల్ కాలేజీ శాశ్వత భవనాన్ని నిర్మించనున్నాం. శాశ్వత మెడికల్ కాలేజీ భవనం రెండేండ్లలోగా అందుబాటులోకి వస్తుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటుకు అనువైన స్థలాలకై పలు ప్రాంతాల్లో స్థలాలను పరిశీలించిన అనంతరం అనంతగిరిలోని వైద్యారోగ్య శాఖకు సంబంధించిన స్థలంతోపాటు ఎస్ఏపీ కాలేజీ సమీపంలోని బిల్లా దాఖలా స్థలాల వివరాలను ప్రభుత్వానికి అందజేశాం. మెడికల్ కాలేజీకి అనంతగిరిలోని వైద్యారోగ్య శాఖకు సంబంధించిన టీబీ శానిటోరియం స్థలాన్నే ప్రభుత్వం ఖరారు చేసింది. రెండేండ్లలోగా కాలేజీని నిర్మించి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాం. ఈ ఏడాది మెడికల్ కాలేజీలో తరగతులు నిర్వహించేందుకు టీబీ శానిటోరియం భవనాల మరమ్మతు పనులు వేగంగా జరుగుతున్నాయి. వీలైనంత త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించాం. రెండేండ్లపాటు తరగతులు తాత్కాలిక భవనాల్లోనే జరుగనున్నాయి. మరోవైపు మెడికల్ కాలేజీ అనుబంధ ఆసుపత్రి నిర్మాణ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. మరో రెండు, మూడు నెలల్లో జిల్లా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.
ధరణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం. ప్రభుత్వం ఇచ్చిన ఆప్షన్ల మేరకు వచ్చిన దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా చర్యలు చేపట్టాం. గత మూడు నెలల్లో 5 వేల దరఖాస్తులను పరిష్కరించాం. రోజుకు 150 చొప్పున ధరణి దరఖాస్తులను పరిష్కరిస్తూ భూసమస్యలకు పరిష్కారం చూపుతున్నాం. తహసీల్దార్ కార్యాలయాల్లో ధరణి దరఖాస్తులను ప్రత్యేకంగా స్వీకరించేలా ఆదేశించాం. పార్ట్-ఏ భూసమస్యలు ఇప్పటికే పూర్తయ్యాయి. ప్రస్తుతం పార్ట్-బీ భూ సమస్యలున్నాయి, ఏదో ఒక కారణంతోనే పార్టీ-బీ సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. కలెక్టర్ స్థాయిలో ఉండే సమస్యలను పెండింగ్‌లో లేకుండా పరిష్కరిస్తున్నాం.
జిల్లాలో ఇసుక నిల్వలు చాలా తక్కువ. జిల్లా అవసరాల నిమిత్తం ఇతర జిల్లాల నుంచి తరలించే ఇసుకను వాడుతున్నారు. జిల్లాలో ఉన్న కొంతమేర ఇసుక కూడా అధిక ధరకు కాకుండా పేదలకు తక్కువకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు నిర్ణయించాం. ఇందులో భాగంగా రూ.1800లకు విక్రయిస్తున్న ఇసుక లోడ్‌ను కేవలం రూ.600లకే అందించేలా ఏర్పాట్లు చేశాం. ఇసుక అవసరముంటే తహసీల్దార్ కార్యాలయం నుంచి అనుమతులు పొంది ఇసుకను తరలించవచ్చు. తప్పనిసరిగా అనుమతులు పొందాలి. అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తే సంబంధిత వాహనాలను సీజ్ చేయాలని ఆదేశించాం.