కులకచర్ల, నవంబర్ 17 : ఉపాధ్యాయులు నిర్లక్ష్యాన్ని వీడి వారివారి సబ్జెక్టుల్లో విద్యార్థులు పూర్తిస్థాయిలో రాణించేలా చర్యలు తీసుకోవాలని వికారాబాద్ డీఈవో రేణుకాదేవి అన్నారు. సోమవారం కులకచర్లలోని బాలుర ఉన్నత పాఠశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. 10వ తరగతి విద్యార్థులతో సబ్జెక్టులవారీగా ప్రశ్నలు అడిగి వారి పరిజ్ఞానాన్ని తెలుసుకున్నారు. విద్యార్థులు సంబంధిత సబ్జెక్టుల్లో సమాధానాలు చెప్పకపోవడంతో ఉపాధ్యాయులపై అమె అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం సంబంధిత సబ్జెక్టులవారీగా ఉపాధ్యాయులను నియమించింది విద్యార్థులకు వారివారి సబ్జెక్టుల్లో పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడానికేనన్నారు. ఉపాధ్యాయులకు ఇంత నిర్లక్ష్యం పనికిరాదని పేర్కొన్నారు.
10వ తరగతి పరీక్షలకు టైము దగ్గర పడుతున్నా విద్యార్థులకు ఆయా సబ్జెక్టుల్లో కనీస అవగాహన లేకపోవడం దారుణమన్నారు. విద్యార్థులకు నాణ్యమైన బోధన చేయాలని సూచించారు. ముఖ్యంగా గణితం, సైన్స్, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో విద్యార్థులకు పూర్తిస్థాయి అవగాహన కల్పించపోతే 10వ తరగతిలో ఉత్తీర్ణత ఎలా సాధిస్తారని ప్రశ్నించారు. ఉపాధ్యాయులు తప్పనిసరిగా తమ విధులను సక్రమంగా నిర్వహించి పరీక్షలకు విద్యార్థులను సంసిద్ధం చేయాలని పేర్కొన్నారు. నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 10వ తరగతిలో 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా కృషిచేయాలన్నారు. ఈ సందర్భంగా బాలుర పాఠశాలలో తాగునీటి సరఫరా ట్యాంకు నుంచి నీరు బాగా లేదని విద్యార్థులు తెలియజేయగా ట్యాంకును మార్చాలని సూచించారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో కులకచర్ల ఎంఈవో హబీబ్ అహ్మద్ పాల్గొన్నారు.