పరిగి : ఆసక్తి గల రైతులను గుర్తించి వారి పొలాల వద్ద కల్లాల నిర్మాణం చేపట్టాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల సూచించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో నర్సరీల నిర్వహణ, కల్లాల నిర్మాణం, మరుగుదొడ్లు, వైకుంఠధామాల నిర్మాణాలకు సంబంధించిన చెల్లింపులపై ఎంపీడీవోలు, ఎంపీవోలతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని మండలాల్లో లక్ష్యం మేరకు కల్లాల నిర్మాణం చేపట్టాలని చెప్పారు. అధికారులు క్షేత్రస్థాయిలో రైతులను సంప్రదించి వారికి అవసరమైన ఇసుక, సిమెంట్ అందించి నిర్మాణాలు చేపట్టేలా వారి సమ్మతి తీసుకొని పనులు వేగవంతం చేయాలన్నారు.
గ్రామ పంచాయతీలలోని నర్సరీలలో నాణ్యమైన ఎర్రమట్టితో బ్యాగ్ ఫిల్లింగ్ పనులు చేపట్టి విత్తనాలు విత్తాలని చెప్పారు. హరితహారంలో ఎవెన్యూ ప్లాంటేషన్ చేపట్టాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఎంపీడీవోల పర్యవేక్షణలో ఈసారి ప్రతి ఇంటికి 6 మొక్కలు అందజేసి మొక్కలు నాటించాలని చెప్పారు. ప్రైవేటు స్థలాల్లో ఉన్న నర్సరీలను ప్రభుత్వ స్థలాల్లోకి మార్చాల్సిందిగా కలెక్టర్ ఆదేశించారు. నర్సరీలకు ఫెన్సింగ్, గేటు, బోర్డు, నీటి సదుపాయం ఏర్పాటు చేయాలన్నారు. వైకుంఠధామాల నిర్మాణ పనులకు సంబంధించి ఎఫ్టీవోలను ఆన్లైన్లో వెంటనే అప్లోడ్ చేసి కాంట్రాక్టర్లకు డబ్బులు అందేలా చూడాలని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, డీఆర్డీవో కృష్ణన్, ఎంపీడీవోలు, ఎంపీవోలు పాల్గొన్నారు.