వికారాబాద్, జూన్ 6 : పరిపాలనా పరంగా కార్యాలయంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ వెంటనే పూర్తి చేయాలని వికారాబాద్ కలెక్టర్ సి. నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే అధికారి నుంచి అటెండర్ వరకు ప్రతి ఒక్కరూ ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలందించాలన్నారు. గురువారం ఆయా శాఖల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలు సజావుగా నిర్వహించినందుకు అధికారులందరికీ అభినందనలు తెలిపారు.
ఉద్యోగులు అటెండెన్స్ యాప్ను ఉపయోగించాలన్నారు. సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి ఆయా విభాగాల జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలన్నారు. విద్యా సంవత్సరం త్వరలో ప్రారంభమవుతున్నదని.. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వ బడుల్లో శానిటేషన్, తాగునీరు వంటి సౌకర్యాలు త్వరితగతిన కల్పించాలన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు.
బడిబాట కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని బడీడు పిల్లలను స్కూళ్లలో చేర్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రారంభం రోజున పాఠశాలలను అందంగా తీర్చిదిద్దాలని, టెక్స్ట్, నోట్ బుక్స్, యూనిఫామ్స్ పంపిణీ చేయాలన్నారు. ఈ కాన్ఫరెన్స్లో జడ్పీ సీఈవో సుధీర్, డీఆర్డీవో శ్రీనివాస్ , డీఈవో రేణుకా దేవి, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.