వికారాబాద్, అక్టోబర్ 9(నమస్తే తెలంగాణ): వచ్చే నెల 30న జరుగనున్న సార్వత్రిక ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎన్నికల నిర్వహణపై విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షెడ్యూల్ వచ్చిన వెంటనే ఎన్నికల కోడ్ జిల్లాలో అమల్లోకి వచ్చిందని.. కొత్త పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు చేయకూడదని, ఇప్పటికే చేపట్టిన అభివృద్ధి పనులు, పథకాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. జిల్లా నోడల్ అధికారు లు, మండలాల అధికారులకు ఎన్నికల కోడ్ పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. కోడ్‌ను అన్ని పార్టీలు పాటించాలని.. ఉల్లంఘిస్తే కఠిన తప్పవన్నారు. కోడ్‌ను పకడ్బందీగా అమలు చేసేందుకు ఆరు ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు, ఆరు స్టాటిస్టికల్ బృందాలు, మండలానికి ఒక వీడియో బృందాన్ని ఇప్పటికే నియమించామన్నారు. కోడ్ ఉల్లంఘనలపై ఎవరైనా నేరుగా ఫిర్యాదు చేయొచ్చని.. టోల్‌ఫ్రీ నం బర్ 1950తోపాటు సీ-విజిల్ యాప్ ద్వారా కూడా ఫిర్యాదులు చేయొచ్చన్నారు.
రూ.50 వేలకు మించితే ఆధారాలు చూపాలి..
ఎన్నికల కోడ్‌ను పకడ్బందీగా అమలు చేసేందు కు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే ఏడు అంత్రరాష్ట్ర చెక్‌పోస్టులు, ఆరు అంతర్జిల్లా చెక్‌పోస్టులను ఏర్పాటు చేశాం. కోడ్‌ను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలుంటాయి. కోడ్ అమల్లో ఉన్నందున రూ. 50 వేలకు మించి నగదును తరలించినట్లయితే తప్పనిసరిగా ఆ నగదుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను చూ పించాలి. జిల్లావ్యాప్తంగా 293 మంది రౌడీషీటర్లుండగా ఇప్పటివరకు 210 మందిని బైండోవర్ చేశాం. జిల్లాలో 240 లైసెన్సెడ్ గన్లు ఉండగా ఇప్పటికే 160 మంది డిపాజిట్ చేశారు. ఎన్నికల సామగ్రి తరలింపు తదితరాలకు సంబంధించి రూట్ మ్యాప్‌లను సిద్ధం చేస్తున్నాం.
– ఎన్.కోటిరెడ్డి, వికారాబాద్ ఎస్పీ
జిల్లాలో 1133 పోలింగ్ కేంద్రాలు..
జిల్లాలో 1,133 పోలింగ్ కేంద్రాలుండగా.. 206 శాతం బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్లు 160 శాతం అదనంగా అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ నారాయణరెడ్డి వివరించారు. అదేవిధంగా జిల్లాలో ఎన్నికల నిర్వహణకు 8600 మంది సిబ్బంది అవసరం కాగా 9వేల మంది అందుబాటులో ఉన్నారన్నారు. ఈ దఫా ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు కేంద్రానికి సంబంధించి పరిగిలోని ఏఎంసీలో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆమోదానికి ప్రతిపాదనలను పంపించామన్నారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలోనూ ఐదు చొప్పున మహిళలు, యువత, దివ్యాంగులకోసం ప్రత్యేకంగా మాడల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించామన్నారు. మంచానికే పరిమితమైన ఓటర్లు ఇంటి నుంచే ఓటేసేందుకు ఎన్నికల సంఘం అవకాశం ఇచ్చిందని, నవంబర్ 8లోగా ఫారం-12డీ ద్వారా లేదా సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి సదరం ధ్రువీకరణ పత్రంతో దరఖాస్తు చేసుకుంటే ఇంటి నుంచే ఓ టు హక్కును వినియోగించుకోవచ్చన్నారు. జిల్లాలోని ఓటర్లందరూ స్వేచ్ఛగా ఓటుహక్కును వినియోగించేకునేలా అవసర మైన చర్యలు తీసుకుంటామన్నారు. పోలింగ్‌కు వారం రోజుల ముందే ఓటరు స్లిప్పులను అందజేస్తామని, అంధులకు ప్రత్యేకంగా బ్రెయిలీ లిపిలో ఓటరు స్లిప్పులను సిద్ధం చేశామన్నారు.
అదేవిధంగా దివ్యాంగ ఓటర్ల నిమిత్తం ప్రతిపోలింగ్ కేంద్రంలోనూ వీల్చైర్లను అందుబాటులో ఉంచుతామని.. దివ్యాంగులు వీల్‌చైర్, ఓటేసేందుకు వచ్చే సమయం, పోలింగ్ కేం ద్రం వివరాలతో సాక్ష్యం యాప్‌లో దరఖాస్తు చేసుకుంటే వారి కి వీల్‌చైర్ సౌకర్యం కల్పిస్తామన్నారు. అదేవిధంగా సువిధ యాప్ ద్వారా ఆయా పార్టీలు సమావేశాలు, ర్యాలీలకు అనుమతులు తీసుకోవచ్చని, నామినేషన్లు, అఫిడవిట్లను ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకొని, ప్రింట్ కాపీని సంబంధిత నియోజకవర్గ ఆర్వోకు అందించొచ్చన్నారు. పత్రికల్లో వచ్చే పెయిడ్ వార్తలపై ఎంసీఎంసీ కమిటీ నిఘా ఉంటుందని.. పత్రికల్లో ఆయా పార్టీల అభ్యర్థులు వేసే ప్రకటనలకు సంబంధించి తప్పనిసరిగా ఎంసీఎంసీ నుంచి అనుమతి తీసుకోవాలన్నారు. జిల్లావ్యాప్తంగా 9.34 లక్షల మంది ఓటర్లున్నారని, ఇటీవల నిర్వహించి ప్రత్యేక ఓట రు నమోదు కార్యక్రమంలో కొత్తగా 45 వేల మంది ఓటర్లుగా చేరారన్నారు. ఈనెల 18 వర కు అక్టోబర్ 1 నాటికి 18 ఏండ్లు నిండిన వా రుంటే కొత్త ఓటరుగా నమోదు చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ సూచించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, ట్రైనీ కలెక్టర్ అమిత్ నారాయణ్ తదితరులు పాల్గొన్నారు.