కొడంగల్ జోన్ బృందం : రాష్ట్రాలలో పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసి, కరువు కాటకాలు సంభవించిన సమయంలో ప్రజలకు ఆహార ధాన్యాలను పంపిణీ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని, ఈ బాధ్యతను కేంద్రం విస్మరిస్తుందని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి తీవ్రంగా విమర్శించారు. యాసంగి వడ్లు కొనుగోలు విషయంలో కేంద్రం అవలంభిస్తున్న వైఖరికి నిరసనగా సోమవారం నియోజకవర్గంలోని కొడంగల్, బొంరాస్పేట, దౌల్తాబాద్ మండలాల్లో చావు డప్పులతో నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున కొనసాగింది. ఇందులో భాగంగా కొడంగల్, బొంరాస్పేట మండలాల్లో నిర్వహించిన ధర్నాలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే నల్ల బ్యాడ్జీలు, కండువాలు ధరించి ర్యాలీ, కేంద్రం దిష్టిబొమ్మను దహనం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణలో రైతును రాజును చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. యాసంగిలో పండించే ధాన్యాన్ని కొనాలని మంత్రుల బృందాన్ని ఢిల్లీకి పంపించినా కేంద్రంలో ఉలుకూ పలుకూ లేదని, కేంద్ర మంత్రులు, రాష్ట్ర బీజేపీ నేతలు తలో రీతిలో మాట్లాడుతున్నారని విమర్శించారు. వడ్లు కొనేవరకు ఈ ఆందోళనలు కొనసాగుతూనే ఉంటుందని, కేంద్రం మెడలు వంచైనా రైతులకు నష్టం కలుగకుండా చూస్తామన్నారు. కేసీఆర్కు రైతులను దూరం చేసేందుకే బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతుందని ఆరోపించారు.
పంజాబ్ ప్రాంతంలోని వరి పంటను కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది కానీ తెలంగాణలో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయననడంలో ఆంతర్యమేమిటే అన్నారు. వానా కాలంలో పండించిన వరి ధాన్యంను ఇంకా కేంద్రం కొనాల్సి ఉందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనబోమని చెప్పినందునే యాసంగిలో వరిపంటను సాగు చేయరాదని రాష్ట్ర ప్రభుత్వం రైతులను చైతన్యం చేస్తుందని అన్నారు. సీఎం కేసీఆర్ బతికున్నంతకాలం రైతుబంధు అమలులో ఉంటుందని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి స్పష్టం చేశారు. అన్ని పంటలకు ఎంఎస్పీ అమలు చేసేలా చట్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే స్వయంగా చావు డప్పు కొట్టారు.