మంచాల ఫిబ్రవరి 13: మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా (Venugopala Swamy Rathotsavam)గురువారం ఉదయం వేణుగోపాలస్వామి రుక్మిణి,సత్యభామల రథోత్సవం కనుల పండుగగా ముందుకు సాగింది. రథోత్సవ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. రథోత్సవ కార్యక్రమంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా స్వామివారు కొలువుతీరిన రథోత్సవాన్ని లాగడానికి పోటీపడ్డారు.
ఉదయం ఆరు గంటలకు వేణుగోపాలస్వామి దేవాలయం నుండి ప్రారంభమైన రథోత్సవం మధ్యాహ్నం ఒకటి గంటల వరకు ఆరుట్ల ప్రధాన చౌరస్తా చేరుకుంది. రథోత్సవ కార్యక్రమం సందర్భంగా కళాకారుల ఆటపాటలతో ముందుకు సాగింది. రథోత్సవానికి తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో ఆ ప్రాంతం కిటకిటలాడింది. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, యువజన సంఘాల సభ్యులు, గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.