Yacharam | యాచారం : కొత్తపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో రథోత్సవం కనులపండువగా సాగింది. రథోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి.. స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో కొలువుతీరిన గోదాదేవి పద్మావతి సమేత వేంకటేశ్వర వారలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి.. మొక్కులు సమర్పించుకున్నారు. జాతర మహోత్సవం సందర్భంగా వేంకటేశ్వర స్వామి గుట్ట ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తుల గోవింద నామస్మరణతో ఆలయ పరిసరాలు ఒక్కసారిగా మార్మోగాయి. ఆలయ అర్చకులు ప్రవీణ్ శర్మ ఆధ్వర్యంలో అభిషేకం, అర్చనలు ఘనంగా జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేంకటేశ్వర స్వామి రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు.
పిల్లలు పెద్దలు గోవింద నామస్మరణలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. రథోత్సవం కార్యక్రమం కొనసాగుతుండగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు కుటుంబ సమేతంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయం ఎదుట యజ్ఞాలు, హోమాలు వేద మంత్రోచ్ఛారణల మధ్య వేడుకగా జరిగాయి. గుట్టపై స్వయంభు వేంకటేశ్వర స్వామికి మొక్కులు సమర్పించి.. తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆలయ కమిటీ చైర్మన్ కట్టగుమ్ముల వెంకటరెడ్డి, పెద్దలు నారాయణరెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇబ్రహీంపట్నానికి చెందిన రవీందర్ ఆలయం వరకు మెట్లు నిర్మించేందుకు ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనను ఘనంగా సత్కరించారు. గత నాలుగు రోజులుగా సాగుతున్న వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం రథోత్సవంతో ముగిశాయి.