ఇబ్రహీంపట్నం, నవంబర్ 16 : జిల్లాలోని రైతులు వరి పంట సాగులో ట్రాక్టర్లు, హార్వెస్టర్లను వాడుతున్నారు. దుక్కులు దున్నడం, వరినాట్లు, కట్టలు వేయ డం లాంటి వాటికి ట్రాక్టర్లు అవసరమువుతాయి. పంట కోతకు హార్వెస్టర్లను వినియోగిస్తున్నారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు వరి సాగు చేసే రైతుల పాలిట శాపంగా మారాయి. కిరాయిలు పెరిగిపోవడంతో రైతులు నష్టపోవాల్సి వస్తున్నది. రైతులు యంత్రాలకు అలవాటు పడిన నేపథ్యంలో పెరుగుతున్న చమురు ధరలు రైతులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఒక్కోసారి పెట్టుబడులూ రాక నష్టపోవాల్సి వస్తున్నదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలీల కొరత ఏర్పడడంతో యంత్రాలపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. గత కేసీఆర్ హయాంలో రైతుబంధు ఠంచన్‌గా రావడంతో ఆ సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండేవికావు.
ఖర్చు తడిసి మోపెడు..
కూలీల కొరతను అధిగమించేందుకు యంత్రాల వినియోగం అన్నదాతకు ప్రయోజనకరంగా మారింది. ట్రాక్టర్లు, ట్రిల్లర్లు, వరికోతయంత్రాలు, బ్లేడ్ ట్రాక్టర్లు , పురుగు మందుల పిచికారీకి తైవాన్, పవర్ స్ప్రేయర్లను అధికంగా ఉపయోగిస్తున్నారు. పెరిగిన డీజిల్ ధరల కారణంగా వీటి ఖర్చులు పెరిగి మోపెడవుతుండటంతో రైతులు పెద్ద ఎత్తున ష్టపోతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో వ్యవసాయ యంత్రాల యజమానులు వాటి ధరలను విపరీతంగా పెంచుతున్నారు.
ట్రాక్టర్ పొలం దున్నేందుకు రూ. వెయ్యి నుంచి రూ. రెండువేల మధ్యలో తీసుకుంటున్నారు. అలాగే, వరికోత యంత్రాలకు గం టకు రూ.3,000 నుంచి రూ.5000 మధ్య వసూలు చేస్తున్నారు. కోసిన పంటను తరలించేందుకు ట్రాక్టర్ కిరాయిలతోపాటు పంట వేసినప్పటి నుంచి కోత కోసి ఇంటికి బియ్యాన్ని చేర్చేవరకు ఖర్చులు తడిసి మోపెడవుతుండడం.. పెట్టిన పెట్టుబడులకు అదనం గా రూ.రెండు నుంచి రూ.మూడు వేల వరకు ఖర్చులు అవుతుం డడంతో నష్టాల ఊబిలో కూరుకుపోతున్నాడు.

పంట మార్పిడితో అధిక లాభాలు
గతేడాది నుంచి ఆరుతడి పంటలతోపాటు కూరగాయల పంటలను సాగు చేస్తు న్నా. ఈ ఏడాది కూడా ఆ పంటలనే వేయాలనుకుంటున్నా. ఈ పంటలతో కష్టం తక్కువ. దిగుబడి ఎక్కువగా ఉంటుంది. భూమిలో సారం ఉండాలంటే పంట మార్పిడి చేయాలి. ప్రతిరైతూ ఆరుతడి పంటలనే సాగుచేయాలి.
-మొద్దు అంజిరెడ్డ్డి, రైతు
ఆరుతడి పంటలు సాగు చేయాలి
రైతులు వరి పంటను కాకుండా ఆరుతడి పంటలైన కూరగాయలు, ఆకుకూరలు, జొన్న, మొక్కజొన్న, సజ్జలు, రాగులు, మినుములు, కందులు, బొబ్బర్లు, వేరుశనగ, నూనెగింజల పంటలపై దృష్టి సారించాలి. ఆరుతడి పంటలతో అధిక దిగుబడులను సాధించొచ్చు.
-శ్రవణ్‌కుమార్, ఏఈవో ఇబ్రహీంపట్నం