రంగారెడ్డిజిల్లాలో పత్తి, వరికి అవసరమైన యూరియా దొరకక అన్నదాతలు అయోమయానికి గురవుతున్నారు. యూరియా కోసం రోజంతా సహకార సంఘాల ఎదుట పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం నుంచి రైతులకు సరిపడా యూరియా రాకపోవడంతో అధికారులకు, రైతులకు మధ్య సహకార సంఘాల ఎదుట యుద్ధ వాతావరణం నెలకొంటున్నది. దీనికితోడు అన్నదాతలపై పోలీసుల జులుం కూడా పెరిగిపోతున్నది. ఒక్కోసారి రెండు మూడు రోజులకు ఒకే యూరియా లారీ వస్తున్నది.
యూరియా లేకపోవడం వలన వ్యవసాయం ముందుకు సాగక రైతులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం యూరియా అందించడంలో చేతులెత్తేయడంతో అన్నదాతల్లో అసహనం పెరుగుతున్నది. పలు చోట్ల ధర్నాలు కూడా చేస్తున్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో యూరియా కోసం ఏనాడూ రైతులు రోడ్డెక్కలేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే యూరియా తిప్పలు మొదలయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 1.30 లక్షల ఎకరాల్లో పత్తి, 1.21 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు.
– రంగారెడ్డి, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ)
జిల్లావ్యాప్తంగా లక్షా30వేల ఎకరాల్లో రైతులు పత్తిసాగు చేశారు. ఇటీవల వర్షాలు సమృద్ధిగా కురువడంతో యూరియా వేస్తేనే పత్తి ఏపుగా పెరిగి దిగుబడి కూడా అధికంగా వస్తుంది. ఒక్కొక్క ఎకరాకు సుమారు రెండు బస్తాల వరకు యూరియా అవసరం ఉంటుంది. ఒక్కో రైతు 10 నుంచి 15 ఎకరాల వరకు పత్తి సాగు చేశారు. పది ఎకరాల పత్తి సాగుకు సుమారు 20 బస్తాల యూరియా అవసరం ఉంటుంది.
కాని, ఒక్క బస్తా కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. దీంతో అదును దాటిపోతున్నా యూరియా రాకపోవడంతో రైతుల్లో ఆక్రోశం పెరిగిపోతున్నది. లక్షా21వేల ఎకరాల్లో వరిపంటను సాగుచేశారు. వరినాట్లు వేశారు. నాట్లు వేసిన వరికి యూరియా వేయాల్సిన సమయం వచ్చింది. కాని, సమయానికి యూరియా దొరకక వరి రైతులు కూడా రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది.
యూరియా కోసం రైతులు బారులు తీరినప్పటికీ వచ్చిన యూరియా ఎవరికీ సరిపోవడంలేదు. దీంతో అధికారులకు, అన్నదాతలకు మధ్య సహకార సంఘాల ఎదుట యుద్ధ వాతావరణం నెలకొంటున్నది. ఈ పరిస్థితిలో పోలీసులు రంగంలోకి దిగి రైతులపై జులుం ప్రదర్శిస్తున్నారు. బుధవారం జిల్లాలో యాచారం సహకార సంఘం వద్దకు యూరియా కోసం పెద్దఎత్తున అన్నదాతలు తరలివచ్చారు.
కాని, ఒకే ఒక్క లారీ రావడంతో అది ఎవరికీ సరిపోక రైతులు యూరియా వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. వెంటనే పోలీసులు రంగంలోకి వచ్చి అన్నదాతలను ఎక్కడికక్కడ నెట్టివేశారు. షాబాద్, కొత్తూరు, కొందుర్గు, కేశంపేట మండలాల్లో కూడా యూరియా కోసం రైతులు పెద్దఎత్తున సహకార సంఘాల ఎదుట బారులు తీరారు. పోలీసుల సమక్షంలో అరకొర యూరియాను అందించారు. సరిపడా యూరియా అందకపోవటంతో అన్నదాతలు తీవ్ర నిరసనకు దిగారు.
యూరియా కోసం రైతులు సహకార సంఘాల ఎదుట రోజుల తరబడి ఎదురుచూస్తున్నప్పటికీ ప్రభుత్వం సరిపడా యూరియా ఇవ్వడం లేదని ఆరోపిస్తూ యాచారం, మంచాల సహకార సంఘాల ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో బుధవారం ఆందోళనకు దిగారు. ప్రభుత్వ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు సరిపడా యూరియా అందించని ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని వారు డిమాండ్ చేశారు.
గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో యూరియా కోసం ఏనాడూ రైతులు రోడ్డెక్కలేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే యూరియా తిప్పలు మొదలయ్యాయి. యూరియా కోసం జిల్లావ్యాప్తంగా అన్నదాతలు రోడ్డెక్కుతున్నప్పటికీ ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదు. వెంటనే ప్రభుత్వం రైతుల అవసరాన్ని బట్టి యూరియా సరఫరా చేయాలి. అన్నదాతలకు సరిపడా యూరియా అందించకపోతే భవిష్యత్తులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన తీవ్రతరం చేస్తాం.
– మక్కపల్లి స్వరూప, సహకార సంఘం డైరెక్టర్ యూరియా అందించని
ఓట్ల కోసం గ్రామాలకు వచ్చే కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలి. మరోవైపు యూరియా కోసం సహకార సంఘాల వద్ద వేచి చూస్తున్న రైతులపై పోలీసుల జులుం కూడా అధికమైంది. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఏనాడూ యూరియా కొరత రాలేదు. కాంగ్రెస్ సర్కారు వెంటనే స్పందించి రైతుల డిమాండ్ మేరకు యూరియాను అందించాలి.
– బండిమీది కృష్ణ, మాజీ సర్పంచ్