రంగారెడ్డి, మార్చి 12 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లాలో రబీ సీజన్లో వరి పంట వేసిన అన్నదాతలను యూరియా కొరత వెంటాడుతున్నది. ఇప్పటికే పంట వేసిన రైతులకు యూరియా దొరకక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. యూరియా బుకింగ్ కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన యాప్ గ్రామీణ ప్రాంత అన్నదాతలకు కొత్త చిక్కులను తెచ్చిపెడుతున్నది.
రైతులకు యాప్ ద్వారా యూరియా బుకింగ్ చేసుకునే అవగాహన లేకపోవడం.. మరోవైపు యాప్ ద్వారా ఇతర మండలాల్లో యూరియా బుక్ అయిన అన్నదాతలకు యూరియా ఇవ్వడంలేదు. చాలీచాలని యూరియా తమ మండలానికే సరిపోదని, పక్క మండలాల వారికి ఇవ్వొద్దని వ్యవసాయాధికారులు ఇప్పటికే పీఏసీఎస్‌లకు అనధికారికంగా ఆదేశాలు జారీ చేశారు.
దీంతో యాప్‌లో బుక్ అయిన సొంత మండలంలో యూరియా లేకపోవడంతో పక్క మండలానికి వెళితే యూరియా ఇవ్వని పరిస్థితి నెలకొన్నది. గురువారం జిల్లాలోని వివిధ పీఏసీఎస్‌లకు యూరియా బస్తాలు వచ్చాయి. అప్పటికే యాప్ ద్వారా బుక్ చేసుకున్న రైతులు అరగంటలోపే యూరియాను తీసుకెళ్లారు. యాప్ ద్వారా ఇతర మండలాల్లో బుకింగ్ అయిన అన్నదాతలు యూరియా కోసం అక్కడకు వెళితే వ్యవసాయాధికారులు ఇవ్వడంలేదు. పక్క మండలానికి ఇచ్చేది లేదని చెప్పడంతో రైతులు నిరాశతో వెనుతిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.
జిల్లాలో రబీ సీజన్లో అధికారుల లెక్కల ప్రకారం 1.20 లక్షల ఎకరాల్లో వరిపంట సాగు చేశారు. అదనంగా కౌలు రైతులు కూడా మరిన్ని ఎకరాల్లో సాగు చేశారు. వ్యవసాయాధికారుల లెక్కల ప్రకారం 19 వేల మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు అవసరం ఉందని ప్రతిపాదనలు పంపారు. కాని, సాగు విస్తీర్ణానికి ప్రస్తుతం వచ్చిన యూరియా ఏమాత్రమూ సరిపోవడంలేదు. ప్రతిపాదనల ప్రకారం ఇప్పటికే 20 వేల మెట్రిక్ టన్నుల యూరియా అందజేసినట్లు అధికారులు చెప్తున్నప్పటికీ జిల్లాలో మాత్రం యూరియా కొరత తీవ్రంగా ఉన్నది. ఇంకా 5 నుంచి 6 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుందని అన్నదాతలు తెలియజేస్తున్నారు. మరోవైపు వరి పంట పొట్టదశకు వస్తుండటంతో ఈ సమయంలోనే యూరియా తప్పనిసరి వేయాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నా.. మార్కెట్లో యూరియా దొరకని పరిస్థితి ఏర్పడింది.
యూరియా కొనుగోలు కోసం సర్కారు తీసుకువచ్చిన యాప్ గ్రామీణ ప్రాంత రైతులకు కొత్త సమస్యలు తీసుకొస్తున్నాయి. యాప్‌ను ఉపయోగించి యూరియా కొనుగోలు చేయడానికి అన్నదాతలకు సరైన పరిజ్ఞానం లేకపోవడం.. మరోవైపు కొంతమంది రైతుల వద్ద స్మార్ట్ ఫోన్లు లేకపోవడంతో యూరియా బుకింగ్ సమస్యగా మారింది. యాప్ ద్వారా ఎకరాకు 3 బస్తాల చొప్పున యూరియాను అందజేస్తున్నారు. కొంతమంది అన్నదాతలు యాప్‌ను ఉపయోగించుకుని పట్టాదారు పాసుపుస్తకాల ఆధారంగా యూరియాను బుక్ చేసుకుని నిల్వ ఉంచుకుంటున్నారు. దీంతో గ్రామాల్లో యూరియా కృత్రిమ కొరత తీవ్రమైంది. యాప్ కొంతమంది రైతులకే ఉపయోగపడుతుండగా.. మిగతావారికి మాత్రం శాపంగా మారింది.
సర్కారు తీసుకువచ్చిన యాప్ ద్వారా ఇప్పటివరకు డివిజన్ యూనిట్‌గా యూరియా బుక్ చేసుకునేవారు. ఆయాడివిజన్లలో ఏ మండలంలోనైనా యూరియా బుక్ చేసుకునే అవకాశముండేది. దీంతో ఆయా మండలాల రైతులు తమ మండలానికి వచ్చిన యూరియా తమకే కావాలని పట్టుబడుతుండటంతో ఇతర మండలాలవారికి దొరకని పరిస్థితి ఏర్పడింది. దీంతో యాప్‌లో బుక్ చేసిన అన్నదాతలకు కూడా పక్క మండలంలో యూరియా ఇవ్వని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిలో అధికారులు మండలాన్ని యూనిట్‌గా చేసి యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. ఇక నుంచి ఏ మండలంలోని రైతులు.. ఆ మండలంలోనే యూరియా బుక్ చేసుకునే వెసులుబాటు కలిగింది.
– ఉష, జిల్లా వ్యవసాయాధికారి