మియాపూర్ ,ఫిబ్రవరి 19: షేర్ లింగంపల్లి(Sher Lingampalli )జోన్లో తటాకాలను(Ponds) పూర్తిస్థాయిలో సుందరీకరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి పేర్కొన్నారు. మల్కం చెరువు తరహాలో గంగారం, పటేల్ కుంట చెరువులను అభివృద్ధిపరిచి ఆహ్లాదానికి నెలవుగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. హెచ్ఎండీఏ,జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఉపేందర్ రెడ్డి బుధవారం పటేల్ కుంట, గంగారం చెరువులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్ఎండీఏ నిధులతో చెరువుల అభివృద్ధి, సుందరీ కరణ చర్యలను ప్రారంభించనున్నట్లు తెలిపారు.
చెరువుల విస్తీర్ణం గుర్తించి చుట్టూ పటిష్టమైన బండ్ ఏర్పాటు, లాన్, వాకింగ్ ట్రాక్, అందమైన విద్యుత్ లైట్లు, చిన్నారులకు ఆటపరికరాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకు సంబంధించి సమర్థమైన ప్రణాళికలను రూపొందించాలని జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి అధికారులకు సూచించారు. చెరువుల సుందరీ కరణ, అభివృద్ధికి సంబంధించిన పనులకు ఎటువంటి ఆటంకం లేకుండా ముందస్తుగా న్యాయపరమైన అంశాలన్నింటిని పరిష్కరించి ముందుకు సాగాలని ఆదేశించారు.
వీటి పర్యవేక్షణపై ఏర్పాటు చేసిన అధికారులు విలువైన స్థలాలు ఆక్రమణలకు గురికాకుండా విజిలెన్స్ పెట్టాలని, చెరువుల పరిసరాలలో నిర్మాణ, ఇతర వ్యర్ధాలు వేయకుండా పకడ్బందీగా పర్యవేక్షించాలని ఆదేశించారు .ఈ కార్యక్రమంలో చందానగర్ సర్కిల్ ఉప కమిషనర్ మోహన్ రెడ్డి, ఏసీపీ నాగిరెడ్డి, టీపీఎస్‌లు కార్తీక్, శ్రీనివాస్ రెడ్డి, వైద్యాధికారి డాక్టర్ రవి, డిఈ దుర్గాప్రసాద్, ఇరిగేషన్ డీఈ నళిని, హెచ్ఎండీఏ అధికారులు పాల్గొన్నారు.