ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రైతాంగం ఈదురుగాలులు, అకాల వర్షాలతో దినదినగండంగా గడుపుతున్నారు. ఓ వైపు ప్రభుత్వ నిర్లక్ష్యం.. మరోవైపు అకాల వర్షాలతో రైతులకు కన్నీళ్లే మిగులుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామగ్రామాన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఏ ఒక్క రైతూ నష్టపోకుండా ప్రతి రైతుకూ మద్దతు ధర అందేలా చర్యలు చేపడితే.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రైతుల విషయంలో అన్నింటిలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అన్యాయం చేస్తున్నది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో వరి కోతకు వచ్చిన సమయంలోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్య సేకరణ ప్రక్రియ జరిగేది.
జిల్లాలో యాసంగి సీజన్‌కు సంబంధించి రైతులు వరి కోతలు పూర్తి చేసి గత వారం రోజులుగా పడిగాపులు కాస్తున్నా ధాన్యం కొనుగోలు చేయడంలో మాత్రం ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తున్నది. దీంతో చాలా మంది రైతులు నష్టపోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. వికారాబాద్ జిల్లావ్యాప్తంగా 92 వేల ఎకరాల్లో వరి పంట సాగుకాగా, 2.25 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి., రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 73 వేల ఎకరాల్లో వరి పంట సాగు కాగా.. 2.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని ఆయా జిల్లాల వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం ప్రారంభం కాకపోవడంతో తక్కువ ధరకే ధాన్యాన్ని బహిరంగ మార్కెట్లో విక్రయిస్తూ రైతులు నష్టపోతున్నారు. తరుగు, తేమ శాతం పేరిట దళారులు దోచుకుంటున్నారు.
– రంగారెడ్డి/వికారాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి జిల్లాలో సివిల్ సప్లయ్ ఆధ్వర్యంలో కొనుగోలు లక్ష్యం 20 వేల మెట్రిక్ టన్నులుగా నిర్ధారించగా.. ఇప్పటివరకు 500 మెట్రిక్ టన్నుల వరకు కొనుగోలు చేసింది. 80 వేల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం రైతుల చేతికి రాగా.. ఎక్కువ శాతం మధ్య దళారులకే విక్రయించారు. వికారాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 226 మంది రైతుల నుంచి రూ.2.57 కోట్ల విలువైన 10,832 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించగా, ఇంకా ఒక్క రైతుకు కూడా నయా పైసా చెల్లింపులు చేయకపోవడం గమనార్హం. మధ్య దళారులు కల్లాల వద్దకే వెళ్లి ధాన్యం కొనుగోలు చేస్తుండటంతో రైతులు వారికే విక్రయిస్తున్నారు. దీంతో కొనుగోలు కేంద్రాల లక్ష్యం నెరవేరటంలేదనే ఆరోపణలొస్తున్నాయి.
పేరుకే కొనుగోలు కేంద్రాలు
రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 20 కేంద్రాలు., వికారాబాద్ జిల్లావ్యాప్తంగా బొంరాస్‌పేట్ మండలంలో 4, దోమ మండలంలో 5, దౌల్తాబాద్ మండలంలో 4, కొడంగల్‌లో 5, పరిగి మండలంలో ఒకటి, యాలాల మండలంలో ఒక కొనుగోలు కేంద్రంలో ప్రస్తుతానికి ధాన్యం సేకరణ ప్రక్రియ ప్రారంభమయ్యింది. కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి వదిలేయడంతో రైతులు అకాల వర్షాల భయానికి తక్కువ ధరకే దళారులకు విక్రయిస్తున్నారు. వరి సాగు చేసిన రైతులు ధాన్యాన్ని విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాల వద్ద గత వారం రోజులుగా పడిగాపులు కాస్తున్నారు.
ఎప్పుడు వర్షం పడుతుందో తెలియని పరిస్థితులుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చినప్పటికీ ఎందుకు కొనుగోలు చేయడం లేదని రైతులు అధికారులను నిలదీస్తున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం గమనార్హం. కొన్ని కొనుగోలు కేంద్రాల్లో తూకం వేయకుండానే నేరుగా సంబంధిత రైస్ మిల్లులకు ధాన్యాన్ని పంపిస్తూ అక్కడే కాంటా వేస్తున్నట్లు రైతులు చెబుతున్నారు.
తరుగు పేరిట దోపిడీ
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి ఎదురుచూసి పూర్తిగా నష్టపోకుండా దళారులను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు తరుగు పేరిట కిలోల కొద్దీ రైతులు పండించిన ధాన్యం నుంచి కొట్టేయడం, తేమ శాతం అధికంగా ఉందంటూ తక్కువ ధరకు కొనుగోలు చేస్త్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. 50 కిలోల బస్తాలో 5 కిలోల వరకు తరుగు తీస్తున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్వింటాలుకు 10 కిలోల వరకు ధాన్యాన్ని తరుగు పేరిట దోపిడీ చేస్తున్నట్లు రైతులు చెబుతున్నారు.
రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వమే కొర్రీలు పెడుతూ నష్టం కలిగిస్తుండడంతో ప్రైవేట్ వ్యాపారులు, దళారులను ఆశ్రయిస్తూ ఆరుగాలం కష్టపడి పండించిన రైతులు నష్టపోతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేందాల్లో జరుగుతున్న అవకతవకలతోపాటు సమస్యలపై జిల్లా యంత్రాంగం పట్టించుకోకపోవడంతో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో జిల్లాలోని మెజార్టీ రైతులంతా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కాకుండా ప్రైవేట్ మార్కెట్‌కే ధాన్యాన్ని తరలిస్తున్నారు.
మద్దతు ధర నిర్ణయించిన సర్కారు
యాసంగి సీజన్లో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు వికారాబాద్ జిల్లావ్యాప్తంగా 128 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయించగా.. ఐకేపీ ద్వారా 41, పీఏసీఎస్ ద్వారా 49, డీసీఎంఎస్ ద్వారా 38 కొనుగోలు కేంద్రాలను సర్కారు ఏర్పాటు చేయనున్నది. వీటిలో సన్నరకం వడ్లను కొనుగోలు చేసేందుకు 11 కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయించింది. రైతులకు అందించే మద్దతు ధరకు సంబంధించి క్వింటాలుకు ఏ గ్రేడ్ రూ.2320, సాధారణ రకం క్వింటాలుకు రూ.2300లుగా ప్రభుత్వం నిర్ణయించింది.
భయాందోళనలో అన్నదాతలు
ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యం అకాల వర్షాలతో ఎక్కడ పాడవుతుందోనని రైతులు భయాందోళనలో ఉన్నారు. ఓవైపు ప్రభుత్వం ప్రతి చివరి గింజ వరకు రైతుల నుంచి వడ్లు కొంటామని ప్రకటిస్తున్నా, ఆచరణలో వచ్చేసరికి అలా జరగడం లేదనే విమర్శలున్నాయి. ఓవైపు వరి కోతలు జరిగి వడ్లు ఎండబెట్టిన తర్వాత సైతం అధికారులు బస్తాలు ఇవ్వడం లేదని, లేదంటే రైస్‌మిల్లు దగ్గరికే వెళ్లాలని సూచిస్తుండడం విమర్శలకు తావిస్తున్నది. మరికొంత మంది రైతులు వరికోతలు చేపడుతున్నారు. పలువురు రైతులు తమ వ్యవసాయ పొలాల్లోనే వడ్లు ఆరబెడుతున్నారు.
సంచి బాజు కిలో, కాంట బాజు కిలో, తాలు పేరిట మరో కిలో చొప్పున 50 కిలోల బస్తాకు మూడు కిలోలు తరుగు తీస్తారని, ఈ లెక్కన క్వింటాలుకు 6 కిలోలు తరుగు తీస్తున్నట్లు రైతులు మండిపడుతున్నారు. రైస్ మిల్లర్లు, ప్రభుత్వ అధికారుల కుమ్మక్కుతోనే ఈ దోపిడీ జరుగుతున్నదని ఆరోపిస్తున్నారు. అమ్మితే అమ్మండి.. లేకుంటే వెళ్లండి.. అన్నట్లుగా పరిస్థితి కొనసాగతున్నదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట దిగుబడి తక్కువగా ఉందని ఓ పక్క బాధపడుతుంటే, మరో పక్క రైస్ మిల్లర్ల దోపిడీతో నిండా మునిగిపోతున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి జరుగుతున్న తూకం దోపిడీలను నివారించాలని కోరుతున్నారు.
మొదట్లో చిరిగిన బస్తాలు వచ్చాయి
మొదట్లో కొనుగోలు కేంద్రానికి చాలా వరకు చిరిగిన సంచులే సరఫరా అయ్యాయి. అధికారులు పంపించిన బస్తాలనే రైతులకు అందించాం. ఆ తరువాత రెండోసారి వచ్చిన బస్తాలు చాలా వరకు మేలు. ప్రస్తుతం వాటినే రైతులకు ఇస్తున్నాం. కొనుగోలు కేంద్రాల్లో తూకం వేయడానికి కూలీలు లభించడంలేదు. తద్వారా నేరుగా ధాన్యం బస్తాలను రైస్ మిల్కు తరలిస్తున్నాం. పెద్దనందిగామ కొనుగోలు కేంద్రానికి పందుల బెడద అధికంగా ఉన్నది. అందుకే వచ్చిన ధాన్యాన్ని త్వరగా తరలించేందుకు ప్రయత్నిస్తున్నాం.
– బాలకృష్ణ, కొనుగోలు కేంద్ర నిర్వాహక సిబ్బంది, పెద్దనందిగామ
ధాన్యం కొనుగోలు కేంద్రం కోసం ఎదురు చూస్తున్నాం
నాగారంలో ఏర్పాటు చేయనున్న ధాన్యం కొనుగోలు కేంద్రం కోసం ఎదురు చూస్తున్నాం. గత నాలుగైదు రోజులుగా గ్రామంలో కొనుగోలు కేంద్రం వద్ద వరి ధాన్యాన్ని ఆరబెట్టుకుంటున్నాం. ప్రభుత్వం రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కొనుగోలు కేంద్రాన్ని త్వరగా ప్రారంభించి కొనుగోలు చేయాలి. ఆలస్యం చేయడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఉదయం పూట ఆరబెడుతుండగా.. సాయంత్రం వర్షాలు కురుస్తాయేమోనని భయంగా ఉన్నది. ధాన్యం అమ్మిన డబ్బులు తాడిపత్రి కొనడానికి మాత్రమే సరిపోతున్నాయి. మద్దతు ధర కల్పించి ధాన్యం కొనుగోలు చేయాలి.
-సి.అంజిలయ్య నాగారం, ధారూరు మండలం
ధాన్యం కొనుగోలు చేయడంలేదు
కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినా కొనుగోలు చేయడంలేదు. గన్నీ బ్యాగులు కోసం టోకెన్లు ఇచ్చారు కాని ఇప్పటివరకు బ్యాగులు ఇవ్వలేదు. ఈ రోజు రేపు అంటూ కాలయాపన చేస్తున్నారు. తాండూరులోని డీసీఎంఎస్ కార్యాలయంలో వచ్చే సోమవారం నుంచి బ్యాగులు ఇస్తామని చెప్పారు. ఇటీవల వర్షానికి ధాన్యం తడిసిపోగా ఆరబెడుతున్నాం. ఈ లోపు మళ్లీ వర్షం పడితే ఏమి చేయాలో అర్థం కావడంలేదు. అధికారులు వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలి.
– లాలప్ప, రైతు, చెంగోల్, తాండూరు మండలం
కొనేవారు లేరు
వరి కోతలు పూర్తి కావస్తున్నా మా గ్రామంలో వడ్లు కొనడంలేదు. ఓవైపు బోర్లలో నీరు తగ్గి దిగుబడులపై ప్రభావం చూపింది. మరోవైపు ఎప్పుడు వాన వస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. అకాల వర్షాలు, గాలి దుమారంతో వడ్లను కాపాడుకోవాలంటే నానా ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. పొలం దగ్గరే వడ్లు ఆరబెడుతున్నాం. ప్రతిసారి రైస్‌మిల్లర్లు బస్తాకు మూడు కిలోలు తరుగు తీస్తూ రైతులను దోచుకుంటున్నారు. ఈసారి వరి కోతలు పూర్తి కావస్తున్నా ఇప్పటివరకు గ్రామం నుంచి వడ్లు కొంటలేరు. రైస్ మిల్లు దగ్గరకు వెళ్తే రైతును దోచుకుంటున్నా అడిగేవారు లేరు.
– కోట్ల మహిపాల్, రూప్‌ఖాన్‌పేట్, పరిగి మండలం
తూకం నేరుగా మిల్లర్ల వద్దనే..
పండించుకున్న పంటను అమ్ముకోవడానికి ఇబ్బందులు పడుతున్నాం. అప్పట్లో కొనుగోలు కేంద్రాల వద్ద తూకం వేసి చీటీ ఇచ్చేవారు. కొనుగోలు కేంద్రం వరకే ధాన్యాన్ని తరలించే పరిస్థితి ఉండేది. కానీ నేడు కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొస్తే.. తేమను పరిశీలించుకొని పంటను ఎండబెట్టుకొని బస్తాలు కుట్టుకొని వారు చెప్పిన రైస్ మిల్కు ధాన్యాన్ని తీసుకుపోతున్నాం. అక్కడ మా రైతుల పాట్లు మరో రకంగా ఉన్నాయి. మిల్లర్లు తూకంలో 50 కిలోల బస్తాకుగాను ఏకంగా రెండు కిలోల తరుగు తీస్తున్నారు. చేసేదేమీ లేక వచ్చినంతకే పంటను అమ్ముకొంటున్నాం.
– జగ్గప్ప, రైతు, పాత కొడంగల్
పదిహేను రోజులు గడిస్తే బయటపడతాం
పంట నోటికాడికొచ్చింది. పంట చేతికందే సమయంలో అకాల వర్షాలు, గాలి వానలు తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి వరి పంటలు సాగు చేస్తే రాళ్లవాన వలన నేలపాలవుతున్నాయి. పెట్టుబడి సాయంతో పాటు పంటల బీమా ఇస్తామని నమ్మబలికిన కాంగ్రెస్ సర్కారు.. దాని ఊసే ఎత్తడంలేదు. అకాల వర్షాల వలన తీవ్ర నష్టాలు చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
– హన్మంత్‌రెడ్డి, చర్లపటేల్‌గూడ