షాద్‌నగర్, మే 14 : మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా తయారైంది రైతన్న పరిస్థితి. పంట రుణాలు మాఫీ కాక.. రైతు భరోసా రాక.. అప్పులు తీసుకొచ్చి సాగు చేసి పంటను అమ్ముకుందామని మార్కెట్ యార్డుకు తీసుకెళ్తే ప్రకృతి రైతుపై పగబట్టి పంటనంతా వర్షార్పణం చేసింది. దీంతో ఆరుగాలం కష్టపడిన అన్నదాత కన్నీరుమున్నీరవుతున్నాడు. షాద్‌నగర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి వందలాది బస్తాల ధాన్యం, మొక్కజొన్న తడిసి ముద్దయింది.
పంట తమ కండ్ల ఎదుటే నీటిలో కొట్టుకుపోతుంటే అన్నదాతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఫరూఖ్‌నగర్ మండలంలోని లింగారెడ్డిగూడ గ్రామానికి చెందిన శ్రీశైలంయాదవ్ అనే రైతుకు చెందిన 300 ధాన్యం బస్తాలు తడిసిపోవడంతో సుమారు రూ.70,000 నష్టం జరిగిందని వాపోయాడు. అన్నారం గ్రామానికి చెందిన జంగయ్య అనే రైతుకు చెందిన ధాన్యం బస్తాలు 75 కాగా.. అందులో 25 బస్తాల ధాన్యం పూర్తిగా నీటిలో కొట్టుకుపోగా.. మిగిలిన వడ్లు తడిసిపోయాయి.
అదే గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళా రైతుకు చెందిన 30 బస్తాల మొక్కజొన్న నీటిలో తడిసిపోవడంతో రూ.50,000 వరకు నష్టం వాటిల్లింది. దూసకల్ గ్రామానికి చెందిన నిరంజన్‌రెడ్డి అనే రైతుకు చెందిన ధాన్యం తడిసిపోవడంతో రూ.10,000 వరకు, అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన శివ అనే రైతుకు చెందిన 300 బస్తాల ధాన్యం తడిసి రూ.50,000 వరకు నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. పలు గ్రామాలకు చెందిన రైతులు మొక్కజొన్న, ధాన్యం తడిసిపోవడంతో తీవ్రంగా నష్టపోయారు.
దళారులు క్వింటాలుకు రూ.1800-రూ.1950 మాత్రమే చెల్లించి కొంటున్నారని.. తడిసిన ధాన్యాన్ని కొంటారో లేదోననే భయం అన్నదాతల్లో నెలకొన్నది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినా వాటిపై రైతులకు అవగాహన లేకపోవడం, సకాలంలో డబ్బులు అందకపోవడంతోపాటు బోనస్ డబ్బులు రావనే ప్రచారం ఉండడంతో వాటి వద్దకు అన్నదాతలు వెళ్లడంలేదు.