ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 6 : సర్పంచ్‌గా పోటీ చేయాలన్న ఆశ.. కానీ, ఖర్చులు భరించేందుకు పైసలు ఎట్లా అనే మీమాంస పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో నెలకొన్నది. చేతిలో చిల్లిగవ్వలేకపోవడం, తాజా మాజీ సర్పంచ్‌లకు చేసిన పనులకు బిల్లులే రాక ఇంకా అవస్థలు పడుతున్న తీరు పోటీదారులకు అప్పు పుట్టకుండా చేస్తున్నది. ప్రధాన పార్టీల మద్దతు కావాలన్నా… నీ చేతిలో ఎంత డబ్బుందో ముందు చెప్పు అంటూ ఎదురు ప్రశ్నలు. దీనికి తోడు రియల్ ఎస్టేట్ కూడా లేకపోవ డం, పంటల ఆదాయం అంతంతే ఉండటంతో అభ్యర్థులను కాసుల కష్టాలు వెంటాడుతున్నాయి. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో గ్రామాల్లో ప్రచారం ఊపందుకున్నది.
అసెంబ్లీ, పార్లమెంట్, సర్పంచ్ ఏ ఎన్నికైనా కాసులతో ముడిపడి ఉన్నది. ప్రచారంలో ప్రత్యర్థులకు దీటుగా రంగంలో దిగాల్సిందే. ఖర్చుల విషయంలో తగ్గేదేలే.. ఏదేమైనా నేను చూసుకుంటా అంటేనే క్యాడర్ వెనుక ఉంటుంది.. లేదంటే వారి దారి వారిదే…అనే భయం దీంతో పోటీకి సిద్ధమైన అభ్యర్థులకు ఖర్చుల టెన్షన్ పట్టుకున్నది. ఎన్నికల్లో బ్యానర్లు, వాల్‌పోస్టర్లు, ప్రచార వాహనాలు, రోజువారీ క్యాడర్ ఖర్చు, పోల్ మేనేజ్మెంట్ వీటన్నింటికీ తోడు మందు, మాంసం లెక్కలు వేరే అనే టాక్ ఉన్నది. వెయ్యి ఓట్లలోపు గ్రామమైతే తక్కువలో తక్కువగా రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఖర్చు అవుతుందనే అంచనాల్లో ఉండగా.. రెండు వేలలోపు జీపీల్లో ఒక్కో అభ్యర్థికీ రూ. 20 లక్షల పైమాటే..
ఇక 2 వేలకు పైగా ఓటర్లుంటే ముప్పై నుంచి యాభై లక్షలు ఆపైన కూడా ఖర్చు పెరుగుతుందనే చర్చ నడుస్తున్నది. ఖర్చులే కాకుండా సొంత పార్టీ నుంచి పోటీకి దిగిన (రెబల్స్) తప్పించేందుకు రూ. లక్షల్లో చేతుల్లో పెట్టాల్సిందే. మరోవైపు ఏకగ్రీవం ఆశావహులను ఊరిస్తున్నది. ఎవరితో పోటీ, ప్రచార లొల్లి, ఖర్చుల బాధ లేకుండా సర్పంచ్ సీటులో కూర్చోవచ్చునని ఊవ్వి ళ్లూరుతున్నా వారూ ఉన్నారు. అయితే, ఏకగ్రీవం పేరుతో గ్రామాభివృద్ధికి పోటీ నుంచి తప్పుకొనే వారికి, చివరకు ఓటర్లకు దావత్.. ఇలా ఖర్చులపై ఖర్చులు తప్పవనే ప్రచారమూ ఉన్నది. చేతిలో చిల్లిగవ్వ లేకున్నా మద్దతుదారుల ప్రోత్సాహంలో సర్పంచ్ బరిలో దిగుతున్న అభ్యర్థులను కాసుల కష్టాలు కలవరపెడుతున్నాయి.
పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా పోటీ చేస్తున్నాననే ఆనందం ఒకవైపు, ఖర్చులకు అప్పు ఎట్లా అనే ఆందోళన మరో వైపు అభ్యర్థులను కలవరపెడుతున్నది. తెలిసిన వారికి ఫోన్లు చేసి అప్పుకోసం బతిమిలాడాల్సి వస్తున్నది. మరి కొన్ని సందర్భాల్లో వడ్డీవ్యాపారులనూ ఆశ్రయిస్తున్నారు. అయితే తాజా, మాజీ సర్పంచ్ల అనుభవాలను చూసిన వ్యాపారులు, పెట్టుబడిదారులు ఎన్నికల కోసం అప్పు ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు. మాజీ సర్పంచ్ల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకు ని అప్పు ఇచ్చేందుకు ఎవరూ ఆసక్తి చూపడంలేదనే చర్చ జరుగుతున్న ది. దీంతో కొందరు తమ భూములను విక్రయానికి పనిలో ఉండగా.. మరికొందరు భార్యాపిల్లలకు చెందిన బంగారాన్ని తాకట్టు పెడుతున్నారు. కాగా, లక్షలాది రూపాయలు ఖర్చు చేసి పోటీచేస్తే మిగిలేది ఏమిటనే ఆలోచనలో మరికొందరున్నారు. తాజా మాజీ సర్పంచ్ల కష్టాలను దృష్టిలో ఉంచుకుని వృథా ఖర్చులు లేకుండా పోటీ చేయాలని అభ్యర్థులపై కుటుంబసభ్యులు, సన్నిహితులు ఒత్తిడి తెస్తున్నారు.