Kondurg | కొందుర్గు, మార్చి 25 : అనుమానాస్పద స్థితిలో రహదారిపై యువకుడు మృతి చెందిన సంఘటన కొందుర్గు పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఉదయం వెలుగు చూసింది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని అగిర్యాల్ – నవాబ్‌పేట రోడ్డులో ఉన్న పల్లె ప్రకృతి వనం వద్ద 35 ఏండ్ల యువకుడి మృతదేహం లభ్యమైంది. తలపై బలంగా మోదిన ఆనవాళ్లు ఉన్నాయి. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మృతి చెంది ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు స్థానిక పోలీసులకు మాజీ సర్పంచ్ లింగం గౌడ్ సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. మృతుడు నవాబ్ పేట మండలం మరికల్‌కు చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.