యాచారం, జూన్ 16 : అసలే వర్షాకాలం.. ఇండ్ల ముందు కంచెలేని ట్రాన్స్ఫార్మర్లు, ఇనుప విద్యుత్ స్తంభాలు.. అప్పుడప్పుడు మెరుపులు, మంటలు.. ఇండ్లపై నుంచే వేలాడే విద్యుత్ తీగలు.. ఇలా.. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి. దీంతో ప్రజలు భయంభయంతో కాలం వెళ్లదీస్తున్నారు. మండలంలో విద్యుత్ సమస్యలతో ప్రజలు నిత్యం సతమతమవుతున్నారు. ఇండ్లు, పాఠశాలల ముందు కంచెలేని ట్రాన్స్ఫార్మర్లు ప్రమాదకరంగా ఉన్నాయి.
మండల కేంద్రంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద పురాతన ఇనుప స్తంభం ప్రమా దకరంగా ఉంది. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కు కంచె ఏర్పాటు చేయకపోవడంతో గతంలో మూగజీవాలైన కోతులు, కుక్కలు, ఆవుదూడలు మృతి చెందిన ఘటనలున్నాయి. మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయం ఎదుట పెద్ద ఇనుప ట్రాన్స్ఫార్మర్ అత్యంత ప్రమాదకరంగా ఉంది. ఇక్కడ గతంలో స్వాతంత్య్ర దినోత్సవం రోజున జాతీయ పక్షి నెమలి విద్యుత్ షాక్తో మృతి చెందింది. ఎలాంటి చర్యలు తీసుకోని పక్షంలో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి.
మండల పరిధిలోని నానక్నగర్లో జనవాసాల మధ్య పాఠశాల సమీపంలో కంచెలేకుండా రెండు ట్రాన్స్ ఫార్మర్లు ఒకే చోట ప్రమాదకరంగా ఉన్నాయి. ఇనుప విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు పలుచోట్ల ప్రమాదకరంగా ఉన్నాయి. నజ్దిక్సింగారం, చౌదర్పల్లి, తులేఖుర్ధు గ్రామాల్లో ఇండ్ల ఎదుట ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు అందోళన చెందుతున్నారు. తక్కళ్లపల్లి, కొత్తపల్లి, తులేఖుర్ధు, మేడిపల్లి, మాల్, మంథన్గౌరెల్లి, నందివనపర్తి, చౌదర్పల్లి, చింతపట్ల గ్రామాల్లో ఇండ్లపై, పొలాల్లో ప్రమాదకరంగా తీగలు వేలాడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు.
కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో నాసిరకం పనులు చేపట్టడంతో గ్రామాల్లో అనేక స్తంభాలు ఒరిగిపోయాయి. మేడిపల్లి చెరువు సమీపంలో స్తంభాలు నాసిరకంగా వేయడంతో వరుసగా ఒకవైపు ఒరిగి ప్రమాదకరంగా మారాయి. అక్కడక్కడ కొన్ని కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. కొన్ని స్తంభాలకు తీగజాతి చెట్లు అల్లుకుపోగా, మరికొన్ని ట్రాన్స్ఫార్మర్లను కంపచెట్లు, ఇతర పొదలు మింగేశాయి. కొన్ని చోట్ల రోడ్ల పక్కన ఉన్న చెట్లకు విద్యుత్ తీగలు గాలికి తగలడంతో తరచూ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ప్రజలు మండిపడుతున్నారు. ఇటీవల మండల పరిధిలో అనేక చోట్ల విద్యుత్ తీగలు చెట్ల కొమ్మలకు తగులుతున్నాయని వాటి కింద ఉన్న హరితహారం మొక్కలను పదుల సంఖ్యలో నరికివేశారు. పలు చోట్ల ప్రమాదం పొంచి ఉన్నా విద్యుత్ సిబ్బందిలో ఎలాంటి కదలికలు లేకపోవడం గమనార్హం.
మండలంలో గతంలో ఎంతో మంది రైతులు, ప్రజలు విద్యుత్ ప్రమాదాలకు గురై మృతి చెందారు. మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. మండలంలో ముసురుతో కూడిన వర్షం కురిస్తే అక్కడక్కడ ఎప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రోడ్ల పక్కన, జనవాసాల్లో, ఇండ్ల ఎదుట ఉన్న ఇనుప విద్యుత్ స్తంభాలు, వాటిని అనుసరించి ఉన్న తీగలను తాకరాదని,ట్రాన్స్ఫార్మర్లకు దూరంగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు. వర్షాకాలంలో అధికారులు, సిబ్బంది తమ నిర్లక్ష్యాన్ని వీడి మండలంలోని పలుగ్రామాల్లో నెలకొన్న విద్యుత్ సమస్యలను గుర్తించి పరిష్కరించా లని ప్రజలు కోరుతున్నారు.
వర్షాకాలంలో విద్యు త్ సమస్యలు రాకుం డా అధికారులు ముం దస్తు చర్యలు చేపట్టా లి. సమస్యలు పరిష్కరించి ప్రమాదాలు జ రుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. జనవాసాల్లో ఉండే ట్రాన్స్ఫార్మర్లకు కంచె ఏర్పాటు చేయాలి. వేలా డే తీగలను సరిచేయాలి. ఇనుప విద్యుత్ స్తంభాలను తొలగించాలి. ప్రజలు సైతం సమస్యలను గుర్తించి అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లాలి. ప్రమాదా లు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
– మహ్మద్ గౌస్, యాచారం