తుర్కయాంజాల్, డిసెంబర్ 28 : జీహెచ్ఎంసీలో శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విలీనంలో భాగంగా తుర్కయాంజాల్ మున్సిపల్‌ను సర్కిల్‌గా మార్చుతూ ప్రభుత్వం చార్మినార్ జోన్లో కలిపింది. ప్రజలు అక్కడికి వెళ్లేందుకు దూరభారం కావడంతో ఆ జోన్లో కలపడాన్ని నిరసిస్తూ స్థానికులు, ప్రజాప్రతినిధుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో తుర్కయాంజాల్ సర్కిల్‌ను ఎల్బీనగర్ జోన్లో కలుపుతున్నట్లు అధికారులు మౌఖికంగా ప్రకటించారు. కొన్ని రోజుల తర్వాత ప్రభుత్వం తుర్కయాంజాల్ సర్కిల్‌ను పూర్తిగా ఎత్తివేయడమే కాకుండా దానిని ఆదిబట్ల సర్కిల్లో కలుపుతూ శంషాబాద్ జోన్‌గా ప్రకటించింది.
తుర్కయాంజాల్ ప్రాంతం నుంచి రవాణా సౌకర్యం ఉన్నా చార్మినార్ జోన్లో కలిపితే ఇబ్బంది అవుతుందని వ్యతిరేకించిన ప్రజలు, నాయకులు.. తుర్కయాంజాల్ను తీసుకెళ్లి శంషాబాద్ జోన్లో విలీనం చేయడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంతం నుంచి చాలా దూరం ఉంటుందని.. ప్రజా రవాణా సౌకర్యం కూడా ఉండని ప్రాంతానికి ఎలా వెళ్లాలని ప్రభుత్వ తీరుతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల అభిప్రాయాలు తెలుసుకోకుండా ప్రభుత్వం ఇష్టానుసారంగా డివిజన్లు, జోన్లను ఏర్పాటు చేసిందని దుయ్యబడుతున్నారు.
స్వాతంత్య్రం అనంతరం 1959 తర్వాత తుర్కయాంజాల్ గ్రామ పంచాయతీగా ఏర్పాటైంది. దీని మొదటి సర్పంచ్‌గా మహ్మద్ జహంగీర్ ఖురేషీ పనిచేశారు. కొన్నేండ్ల తర్వాత తుర్కయాంజాల్ గ్రామ పంచాయతీ నుంచి రాగన్నగూడ, కమ్మగూడ విడిపోయి పంచాయతీలుగా ఏర్పడ్డాయి. స్వాతంత్య్రం అనంతరం పెద్ద పంచాయతీ అయిన తుర్కయాంజాల్ నేడు జీహెచ్ఎంసీలో విలీనంతో ఉనికిని కోల్పోతున్నదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తుర్కయాంజాల్ మున్సిపాలిటీ 76 కిలోమీటర్ల విస్తీర్ణంతో రాష్ట్రంలోనే అతి పెద్ద మున్సిపాలిటీల్లో ఒకటిగా ఉండేది. 2018 ఆగస్టు 2న 9 గ్రామ పంచాయితీలను కలుపుతూ తుర్కయాంజాల్ మున్సిపల్‌ను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మున్సిపాలిటీగా ఏర్పాటైన రోజు 77,000 ఓటర్లుండగా.. నేడు అక్కడ 1,00,000 పైచిలుకు ఓటర్లున్నారు.
లక్షకు పైగా ఉన్న ఓటర్లు తుర్కయాంజాల్ను మున్సిపల్‌గా కాకుండా, సర్కిల్‌గా కాకుండా ఆదిబట్ల సర్కిల్లో డివిజన్‌గా కలపడంతో స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక్కప్పుడు ఓ వెలుగు వెలిగిన మున్సిపాలిటీని పాలకులు కావాలనే కుట్రలో భాగంగానే డివిజన్‌గా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తుర్కయాంజాల్, తొర్రూర్ డివిజన్లకు చెందిన ప్రజలు శంషాబాద్‌లో ఉన్న జోన్ కార్యాలయానికి వెళ్లి రావాలంటే అవస్థలు పడాల్సిందే. అక్కడికి ప్రజా రవాణా లేకపోవడంతో సొంత వాహనాలుంటేనే వెళ్లే పరిస్థితి నెలకొ న్నది. అధికారులు స్పందించి తుర్కయాంజాల్ను సర్కిల్‌గా ప్రకటించాలని ప్రజలు కోరుతున్నారు.
తుర్కయాంజాల్, తొర్రూర్ డివిజన్లను ఆదిబట్ల సర్కిల్లో కలపడంతో పేద, మధ్యతరగతి వారికి ఇబ్బందులు తప్పవు. అక్కడికి వెళ్లేందుకు ప్రజా రవాణా సౌకర్యం లేకపోవడంతో.. ప్రజలు ఏదైనా పనిపై సర్కిల్‌కు వెళ్లాలంటే సొంత వాహనంలో వెళ్లి రావాల్సిందే. ప్రజల అవస్థలను గుర్తించి ప్రభుత్వం వెంటనే తుర్కయాంజాల్ సర్కిల్‌ను తిరిగి పునరుద్ధరించాలి.
– సంపతీశ్వర్రెడ్డి, బ్రహ్మణపల్లి
తుర్కయాంజాల్ సర్కిల్‌ను కావాలనే రాజకీయ స్వార్థంతోనే ఎత్తివేశారు. సంపన్న వర్గాలు మాత్రమే రాజకీయాల్లో ఉండేలా తుర్కయాంజాల్ మున్సిపాలిటీని రెండు డివిజన్లుగా విభజించి.. బడుగు, బలహీన వర్గాల వారికి రాజకీయ అవకాశాల్లేకుండా చేశారు. ప్రజల ఇబ్బందులను గుర్తించి రాజకీయాలకు అతీతంగా తుర్కయాంజాల్ను సర్కిల్‌గా ఏర్పాటు చేయాలి.. లేకపోతే ఉద్యమం తప్పదు.
– కల్యాణ్ నాయక్, తుర్కయాంజాల్ మాజీ కౌన్సిలర్