ఆమనగల్లు, మే 16 : పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని రాస్ట్ర ప్రభుత్వాన్ని టీఎస్ఎస్వో వ్యవస్థాపక అధ్యక్షుడు మీసాల లక్ష్మీనివాస్ డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు పట్టణంలో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో దాదాపు రూ.8వేల కోట్లకు పైగా ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్లో ఉందని తెలిపారు. రీయింబర్స్మెంట్ బకాయిలతో సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేటు కాలేజీలు.. అధ్యాపకులకు వేతనాలు చెల్లించలేని దుస్థితికి వచ్చాయని అన్నారు. దీంతో కొన్ని వందల కాలేజీలు మూత పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో పలు కాలేజీలు విద్యార్థుల సర్టిఫికెట్లను ఇవ్వడం లేదని మీసాల లక్ష్మీనివాస్ తెలిపారు. దీనివల్ల వారి చదువులకు ఆటంకం కలుగుతుందని పేర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో విద్యార్థులకు, కాలేజీ యాజమాన్యాలకు ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో తగాదాలు జరిగి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లిన ఘటనలు ఎన్నో ఉన్నాయని చెప్పాయి. అయినప్పటికీ ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించకపోవడం సిగ్గుచేటు అని విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వన్ టైమ్ సెటిల్మెంట్ చేసి.. ఇక నుంచి విద్యా సంవత్సరం ప్రారంభంలోనే రీయింబర్స్మెంట్ డబ్బులు చెల్లిస్తామని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. విద్యార్థుల భవిష్యత్తుపై రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే బకాయిలు విడుదల చేయాలని మీసాల లక్ష్మీనివాస్ డిమాండ్ చేశారు.