రంగారెడ్డి, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ) : ఫార్మాసిటీ ఏర్పాటుకు భూములిచ్చిన రైతులందరికీ జనవరిలో మీర్ఖాన్పేట్లో ఇండ్ల స్థలాలు ఇస్తామని, రైతులకు పైసా ఖర్చు లేకుండా వారి పేరుపై రిజిస్ట్రేషన్ చేయించటంతో పాటు పొజిషన్ కూడా ఇస్తామని రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. ఫార్మా సిటీ కోసం ఇప్పటికే భూసేకరణ జరిగిందని, భూములిచ్చిన రైతులందరికీ పరిహారం కూడా ఇవ్వడం జరిగిందన్నారు. నూతన సంవత్సరంలో జిల్లా ప్రజలు ఆశించిన స్థాయిలో విద్య, వైద్యంతో పాటు ఇతర మౌలిక వసతులు కల్పించేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు.
మంగళవారం ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. మీర్ఖాన్పేట్ వేదికగా ప్రభుత్వం నిర్మించనున్న ఫోర్త్ సిటీని నూతన సంవత్సరంలో ప్రజల ముందు ఆవిష్కరించబోతున్నామన్నారు. అభివృద్ధి చెందిన హైదరాబాద్ తరహాలో ఫోర్త్ సిటీలో విశాలమైన రోడ్లు, పార్కులు, కమ్యూనిటీ భవనాలు, ఆట స్థలాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. అలాగే గ్రీన్ఫీల్డ్ రోడ్డు, ట్రిపుల్ ఆర్ రోడ్లకు భూసేకరణ విషయంలో ప్రణాళికతో ముందుకు వెళతామన్నారు. రైతులందరినీ ఒప్పించి ఈ ప్రాజెక్టులకు భూసేకరణ చేపడుతామన్నారు. రైతులు ఆశించిన స్థాయిలో నష్టపరిహారం ఇప్పించి వారిని ఒప్పించిన తర్వాతే భూసేకరణ విషయంలో ముందుకు పోతామన్నారు.
జిల్లాలో భూ సంబంధిత సమస్యలన్నింటికీ భూ భారతి ద్వారా పరిష్కారం చూపుతామని, జిల్లా స్థాయిలోనే కాకుండా ఆర్డీవో స్థాయిలో సమస్యలను సత్వరమే పరిష్కరించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ నారాయణరెడ్డి స్పష్టం చేశారు. 2025లో జిల్లాలో నెలకొన్న సమస్యలను భూ భారతి ద్వారా పరిష్కారానికి మార్గం చూపుతామన్నారు.
జిల్లాలో ధరణి పోర్టల్లో సుమారు 17వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, వీటి పరిష్కారానికి జిల్లాస్థాయిలోనే కాకుండా ఆర్డీవో స్థాయిలో కూడా ప్రజావాణి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఆన్లైన్ పోర్టల్ ద్వారా అందిన ధరఖాస్తులతో పాటు ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను కూడా క్షుణ్ణంగా పరిశీలించి వాటికి పరిష్కారం చూపుతామన్నారు. ధరణి స్థానంలో ప్రభుత్వం కొత్తగా తీసుకురానున్న భూ భారతిలో సమస్యలకు మరింత సత్వరమే పరిష్కారం లభించబోతుందన్నారు. ఎట్టి పరిస్థితిల్లోనూ అవినీతి అక్రమాలకు ఆస్కారం లేకుండా జిల్లాను రాష్ట్రంలోనే ఉన్నతస్థానంలో ఉంచడానికి ప్రయత్నాలు చేస్తామని పేర్కొన్నారు.