యాచారం, మార్చి 18 : గ్రీన్ ఫీల్డ్ రోడ్డుకు తమ పట్టా భూములను తీసుకోవద్దని గిరిజన రైతులు పట్టుబడుతున్నారు. పట్టా భూముల జోలికొస్తే ఊరుకునేదిలేదని వారు సర్కారును హెచ్చరిస్తున్నారు. బలవంతపు భూసేకరణను వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తూ బుధవారం మండలంలోని మర్లకుంటతండాలో మంగలిగడ్డతండా, పోతుబండతండా, వాలియతండా, కుర్మిద్దతండా, మర్లకుంటతండాలకు చెందిన రైతులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ప్రభుత్వం దిగొచ్చి గ్రీన్ ఫీల్డ్ రోడ్డుకు తమ భూములను తీసుకోబోమని స్పష్టమైన హామీ ఇచ్చే వరకు దీక్షలు విరమించేది లేదని స్పష్టం చేశారు. బలవంతపు భూ సేకరణను అడ్డుకోవడమే లక్ష్యంగా గిరిజన రైతులు చేపట్టిన రిలే దీక్ష బుధవారంతో రెండో రోజుకు చేరింది.
గ్రీన్ ఫీల్డ్ రోడ్డుకు పట్టా భూములు తీసుకోవద్దని, గ్రీన్ ఫీల్డ్ రోడ్డును వెంటనే రద్దు చేయాలని, ఆన్లైన్లో టీజీఐఐసీ పేరు తొలగించి రైతుల పేర్లను నమోదు చేయాలని.. కాంగ్రెస్ సర్కారుకు, సీఎం రేవంత్‌కు వ్యతిరేకంగా పెద్దఎత్తున రైతులు నినాదాలు చేశారు. గ్రీన్ ఫీల్డ్ రోడ్డును రద్దు చేసేవరకు ఉద్యమం ఆపేదిలేదని, రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇకపై సర్వే కోసం అధికారులు తమ భూముల్లోకి వస్తే ఊరుకునేదిలేదని, అవసరమైతే తరిమికొడతామన్నారు. రైతుల దీక్షకు కుర్మిద్ద గ్రామానికి చెందిన ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు, ప్రజాప్రతినిధులు, గిరిజన సంఘాలు, రైతు సంఘాల నాయకులు తమ మద్దతు తెలిపారు.
గిరిజన రైతుల భూములను బలవంతంగా లాక్కొని గ్రీన్ ఫీల్డ్ రోడ్డు పేరుతో కాంగ్రెస్ సర్కారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తున్నదని నాయకులు, రైతులు ప్రభుత్వంపై మండిపడ్డారు. వ్యవసాయాన్ని నమ్ముకొని జీవనం సాగిస్తున్న గిరిజన తండాలకు చెందిన రైతుల భూముల్లో నుంచి 330 ఫీట్ల రోడ్డు నిర్మిస్తే వారు ఎలా బతకాలని సర్కారును ప్రశ్నిస్తున్నారు. పచ్చని పంట పొలాల్లో గ్రీన్ ఫీల్డ్ చిచ్చుపెట్టడం సమంజసం కాదన్నారు. దీంతో యాచారం, కందుకూరు, కడ్తాల్, ఆమనగల్లు, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం మండలాలకు చెందిన 18 తండాల రైతులు తమ భూములు కోల్పోతున్నట్లు పేర్కొన్నారు. 350 ఎకరాల భూమిని ప్రొహిబిటెట్ లిస్టు నుంచి ప్రభుత్వం వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.
సర్కారు ఫార్మా సిటీని రద్దు చేయకుండానే ఫ్యూచర్ సిటీ అంటూ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఫార్మా సిటీని రద్దు చేస్తామని, రైతుల భూములను తిరిగి రైతులకు ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి.. ఇప్పుడు గుంజుకోవాలనుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సర్కారుకు రైతుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే గ్రీన్ ఫీల్డ్ రోడ్డును రద్దు చేసి, భూసేకరణ పక్రియను ఉపసంహరించుకోవాలని, రైతుల పేర్లను ఆన్లైన్లో నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉద్యమం తప్పదని హెచ్చరించారు. రేవంత్ సర్కారుకు రైతులే తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో కుర్మిద్ద సర్పంచ్ శ్రీవిద్య, వార్డు సభ్యులున్నారు.