వికారాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం గత తొమ్మిదేండ్లుగా అన్ని వర్గాల సంక్షేమానికి ఇతోధికంగా కృషి చేస్తున్నది. ఇందుకోసం పలు రకా ల సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చూస్తూ.. దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే పేదల ప్రభుత్వంగా గుర్తింపు తెచ్చుకున్నది. అయితే గత ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో నిర్లక్ష్యానికి గురైన గిరిజనుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారు. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా జిల్లాలోని 84 తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి గిరిజనులకే స్వపరిపాలనను అందించారు. అంతేకాకుండా ఎన్నో ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న గిరిజనుల పో డు భూముల పట్టాల జారీకి కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా విద్య, ఉద్యోగ రంగాల్లో నూ మరిన్ని అవకాశాలు ఎస్టీలకు దక్కేలా గతంలో ఉన్న ఆరు శాతం రిజర్వేషన్‌ను పది శాతానికి పెంచారు. పేద ఎస్టీ కుటుంబాలకు చెందిన పిల్లలు విదేశాల్లో ఉన్నత విధ్యాభ్యాసం చేసేందుకు వీలుగా ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి చేయూతనందిస్తున్న ది. గిరిజనులకు నాణ్యమైన విద్యనందించేందు కోసం జిల్లాకు గిరిజన జూనియర్ కాలేజీలను కూడా ప్రభుత్వం మం జూరు చేసింది. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు గిరిజన దినోత్సవం సందర్భంగా తొమ్మిదేండ్లలో గిరిజనుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రత్యేక కథనం..
పోడుదారులకు పట్టాలు..
ఎన్నో ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న పోడు భూముల సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే పరిష్కారం చూపనున్నది. గతంలో ఏ ప్రభుత్వం కూడా తీసుకోలేని చారిత్రాత్మక నిర్ణయాన్ని సీఎం కేసీఆర్ తీసుకున్నారు. జిల్లాలోని 114 గ్రామ పంచాయతీల్లోని 22,485 ఎకరాల్లోని పోడు భూములను 9,973 మంది గిరిజన, గిరిజనేతరులు సాగు చేసుకుంటున్నారు. అందులో అర్హులైన 436 మంది గిరిజనులకు ప్రభుత్వం త్వరలోనే పట్టాలను పంపిణీ చేయనున్నది. అయితే జిల్లాలో అత్యధికంగా కులకచర్ల, పరిగి, ధారూ రు, యాలాల, చౌడాపూర్ మండలాల్లో పోడు భూములు ఎక్కువగా ఉన్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. మరోవైపు ప్ర భుత్వ మార్గదర్శకాల ప్రకారం 2005కు ముందు నుంచి అటవీ భూములను ఆక్రమించి సాగు చేసుకుంటున్న గిరిజనులతోపాటు మూడు తరాలుగా అటవీ భూములను సాగు చేసుకుంటున్న గిరిజనేతరులకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలను ఇవ్వాలని సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే.
దశాబ్దాల కలను నెరవేర్చిన సీఎం కేసీఆర్..
గిరిజనుల దశాబ్దాల కలను సీఎం కేసీఆర్ నెరవేర్చారు. పరిపాలన సంస్కరణల్లో భాగంగా జిల్లాలోని 84 తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటుచేశారు. దీంతో అవి ప్రగతిపథంలో ముందు కు దూసుకెళ్తున్నాయి. పరిపాలనా సౌలభ్యం కోసం 500లకు పైగా జనాభా ఉన్న తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి ‘మా తండాలో.. మా పాలన’ అనే విధంగా తండాలకు స్వపరిపాలనను అందించారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో తండాలకు మంచి రోజులొచ్చాయి. కేవలం రెండేండ్లలోనే పాత పంచాయతీలకు దీటుగా కొత్త పంచాయతీల్లో అభివృద్ధి పనులు జరుగడం గమనార్హం. గత ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో తండా లు అభివృద్ధికి దూరంగా ఉన్నాయి. అక్కడి సమస్యలను పట్టిం చుకున్నా నాథుడే లేకుండే.. కానీ, ప్రస్తుతం వాటి దశ మా రింది. సీఎం కేసీఆర్ కేటాయిస్తున్న నిధులతో అభివృద్ధికి మారుపేరు గా మారుతున్నాయి. జిల్లాలోని 84 తండాల్లో నూతన పంచాయతీలు ఏర్పాటు కాగా, వాటిలో 58 గ్రామ పంచాయతీలకు పంచాయతీ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం ఒక్కో దానికి రూ.20 లక్షల చొప్పున రూ.11.60 కోట్ల నిధులు విడుదల చేసింది. ప్రభు త్వం ఎస్టీలకు 100 యూనిట్లలోపు విద్యుత్తు వినియోగిస్తున్న వారికి సబ్సిడీని అందిస్తున్నది. జిల్లాలో ఇప్పటివరకు 7,149 మంది రూ. కోటి విలువగల విద్యుత్తు సబ్సిడీని అందించింది.
Rr4
గిరిజనులకు రిజర్వేషన్ల పెంపు..
సీఎం కేసీఆర్ గిరిజనుల సంక్షేమం, ఆర్థికాభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తున్నారు. విద్య, ఉద్యోగ రంగాల్లో గిరిజనులకు రిజర్వేషన్ల పెంపుపై చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. గిరిజనులకు ఇచ్చిన మాట ప్రకారం వాటి వారి రిజర్వేషన్‌ను ఆరు నుంచి పది శాతానికి పెంచారు. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 9.46 లక్షల మంది ఉండగా, గిరిజనులు 97 వేల మంది (10.29 శాతం) ఉన్నారు. జిల్లాలోని దోమ, కులకచర్ల, బొంరాస్‌పేట, పెద్దేముల్, వికారాబాద్ మండలాల్లో ఎస్టీలు అధికంగా ఉన్నారు.
రూ.20 లక్షల సాయం..
పేద గిరిజన కుటుంబాలకు చెందిన పిల్లలు విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేసేందుకు ప్రభుత్వం ఆర్థిక చేయూతనందిస్తున్నది. ఒక్కో విద్యార్థికి రూ.20 లక్షల చొప్పున అందిస్తున్నది. జిల్లాలో అంబేద్కర్ ఓవర్సీర్ పథకం కింద 8 మందికి ఒక్కొక్కరికీ రూ.20 లక్షల చొప్పున రూ.11.2 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించింది.
గిరిజన ఆవాసాలకు రోడ్డు సౌకర్యం..
జిల్లాలోని ప్రతి గిరిజన తండాకూ ప్రభుత్వం రోడ్డు సౌకర్యాన్ని కల్పించింది. గతంలో వానకాలంలో తండాలకు వెళ్లేందుకు గిరిజనులు చాలా ఇబ్బందులు పడేవారు. తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడంతోపాటు ప్రతి తండాకూ రోడ్డును నిర్మించారు. ఇందుకోసం జిల్లాలోని 44 తండాలకు రూ. 51.75 కోట్ల నిధులను ఖర్చు చేశారు. అదేవిధంగా నాలుగు జూనియర్ కాలేజీలను కూడా ఏర్పాటు చేశారు.
జిల్లాకు నాలుగు గిరిజన భవన్లు
గిరిజనుల ఆత్మగౌరవాన్ని మరింత పెంపొందించడంతోపాటు వారి సౌకర్యార్థం నియోజకవర్గానికి ఒక గిరిజన భవన్‌ను ప్రభు త్వం మంజూరు చేసింది. జిల్లా కేంద్రంలో రూ.1.10 కోట్లతో నిర్మించగా దాదాపుగా పూర్తైంది. పరిగిలో రూ.2 కోట్లు, తాండూరులో రూ.2 కోట్లతో చేపట్టిన భవనాల పనులు సాగుతున్నాయి. కొడంగల్‌కు కేటాయించిన గిరిజన భవన్ అదనపు మరమ్మతుల నిమిత్తం ప్రభుత్వం రూ.50 లక్షలను ఇటీవల విడుదల చేసింది.