వికారాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): జిల్లాలో ఓవర్ లోడ్ విషయంలో నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉన్నది. ఇటీవల మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగి పేదల ప్రాణాలు పోయినా అటు ఓవర్‌లోడ్ వాహనాల యజమాను లు, డ్రైవర్లతోపాటు ఇటు రవాణాశాఖ అధికారుల తీరు మాత్రం మారడం లేదు. జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల్లో సామర్థ్యానికి మించి ఓవర్ లోడ్‌తో కంకర, బండరాళ్లు, ఎర్రమట్టి, ఇసుక, సుద్ధ గనుల తరలింపు నిబంధనలకు విరుద్ధంగా సాగుతూనే ఉన్నది. కేవలం రాత్రి సమయాల్లోనే మైనింగ్‌ను తరలించాలని నిబంధనలున్నా ఎవరూ పట్టించు కోవడంలేదు. ఓవర్ లోడ్‌తో వెళ్లే వాహనాలపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు వారం రోజులపాటు తనిఖీలం టూ హల్చల్ చేయడం.. ఆ తర్వాత చేతులెత్తేయడం రవాణా శాఖ అధికారులకు అలవాటేన్న్న ఆరోపణలు న్నాయి. మీర్జాగూడ ఘోర రోడ్డు ప్రమాదం అనంతరం వారం రోజులపాటు ఒక్క ఓవర్ లోడ్ వాహనం కూడా రోడ్లపై కనిపించకపోవడం తదనంతరం మళ్లీ అవి ఓవర్ స్పీడ్ మైనింగ్‌ను తరలిస్తుండడం చూస్తే రవాణా శాఖ అధికారులు ఓవర్‌లోడ్ వాహనాల య జమానులతో కుమ్మక్కయ్యారన్న ఆరోపణలు జోరుగా ఉన్నాయి. మరోవైపు ఓవర్ లోడ్ వాహనాల తనిఖీల విషయంతోపాటు ఫిట్‌నెస్‌లేని వాహనాలు తిరు గుతున్నా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహ రించ డంపై జిల్లా రవాణా శాఖ అధికారిపై అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్ ఇటీవల ఆయనకు షోకాజు నోటీసు జారీ చేశారు.
ఓవర్ లోడ్ వాహనాలు ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. జిల్లా కేంద్రంతోపాటు నవాబుపేట, పూడూరు, మోమిన్‌పేట, మర్పల్లి, పరిగి, పెద్దేముల్, ధారూరు, బంట్వారం, తాండూరు, యాలాల మండలాల్లో కంకర, బండరాళ్లు, ఎర్రమట్టి, ఇసుక, సుద్ధ గనులతో కూడిన ఓవర్ లోడ్ టిప్పర్లు నిత్యం మైనింగ్‌ను తరలిస్తూనే ఉన్నాయి. వికారాబాద్, పూడూరు, నవాబుపేట, మోమిన్‌పేట మండలాల్లోని ప్రభుత్వ భూ ముల నుంచి అక్రమంగా ఎర్రమట్టిని తరలిస్తూ పలువురు రూ. కోట్లను ఆర్జిస్తున్నారు. రవాణా ఖర్చులు తగ్గించుకునే క్రమంలో మైనింగ్ వ్యాపారులు అత్యాశకు పోయి ఒకేసారి పరిమితికి మించి కంకర, డస్ట్, బండరాళ్లు, సుద్ధగనులు, ఎర్రమట్టిని తరలిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నెలలో రెండు, మూడుసార్లు తనిఖీలు చేశామని చెప్పుకొనేందుకు ఆటోలు, ట్రాక్టర్లను ఆపి తనిఖీలు చేస్తున్న జిల్లా రవాణా శాఖ అధికారులు ఓవర్ లోడ్‌తో వెళ్లే వాహనాలను మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
మైనింగ్ తరలింపునకు వినియోగించే వాహనాలకు ప్రభుత్వ నిబంధనలు పాటించాల్సి ఉం టుంది. అయితే వాహనాల యజమానులు, డ్రైవర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే.. సంబంధిత శాఖ అధికారులు వారు ఇచ్చే మామూళ్లకు అలవాటు పడి చూసీచూడనట్లు ఉంటున్నారనే ఆరోపణలున్నాయి. ప్రతి వాహనంలో ఎంతమేర లోడ్‌ను తీసుకెళ్లాలనేది నిర్ణయించి, ఆ మేరకు టిప్పర్లతోపాటు ఇతర వాహనాలను తయారు చేస్తారు. కానీ, బండరాళ్లు, కంకర, ఎర్రమట్టి, సుద్ధను తీసుకెళ్లే టిప్పర్లను రిజిస్ట్రేషన్ తర్వాత మార్పులు చేస్తూ ఎక్కువ లోడ్‌ను తీసుకెళ్లేలా ఒకట్రెండు ఫీట్ల వరకు వాటి యజ మానులు ఎత్తు పెంచుతున్నారు. టిప్పర్లను ఎత్తు పెంచడంతో పరిమితికి మించి ఓవర్ లోడ్‌తో వెళ్తుండడంతో అవి నియంత్రణ తప్పి రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. సామర్థ్యానికి మించి వెళ్లే వాహనాల విషయంలో అదనపు టన్నుకు వెయ్యి రూపాయల జరిమా నా మాత్రమే రవాణా శాఖ అధికారులు విధిస్తున్నారు. జరిమానాకు మించి వారికి ఆదాయం వస్తుండడంతో నిబంధనలను గాలికి వదిలి అక్రమంగా సంపాదిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. రాత్రి 10 నుంచి ఉద యం 7 గంటల వరకే మైనింగ్ వాహనాలకు అనుమతులున్నా వాటిని పట్టించుకోకుండా 24 గంటలపాటు కంకర, ఎర్రమట్టి, బండరా ళ్లను తరలిస్తుండడంతో ప్రజలు రోడ్లపై వెళ్లాలంటేనే జంకుతున్నారు. టిప్పర్‌లో 20-25 టన్ను ల వరకు మైనింగ్‌ను తీసుకెళ్లాల్సి ఉంటే అదనంగా 10-15 టన్నుల వరకు తరలిస్తున్నారు. ఓవర్‌లోడ్‌తో వెళ్లే వాహనాలపై మోటరు వాహనాల చట్టం ప్రకారం సీజ్ చేయాల్సి ఉన్నా… జిల్లా రవాణా శాఖ అధికారులు మాత్రం జరిమానాలు వేసి వదిలేస్తున్నారు. ఓవర్ లోడ్ వాహనాన్ని నడిపే డ్రైవర్ల లైసెన్సులనూ సీజ్ చేయాల్సి ఉన్నా సంబంధిత అధికారులు వాళ్లు ఇచ్చే మామూళ్లకు అలవాటు పడి పట్టించు కోవడంలేదనే ఆరోపణలు, అసంతృప్తి ప్రజల నుంచి వ్యక్తమవుతున్నది.