ఇబ్రహీంపట్నం, మే 1: ఇబ్రహీంపట్నంలో (Ibrahimpatnam) ట్రాఫిక్ పోలీసుస్టేషన్ ఏర్పాటైతే అక్రమ పార్కింగ్‌లతో పాటు ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని భావించిన పట్నం వాసులు, వాహనదారుల ఆశలు నీటిమీద రాతలుగానే మారాయి. గత బీఆర్ఎస్ హాయాంలో నాటి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పట్టుబట్టి ఇబ్రహీంపట్నంలో ట్రాఫిక్ పోలీసుస్టేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఒప్పించి ఇక్కడ ట్రాఫిక్ పోలీసుస్టేషన్ ఏర్పాటు చేయించారు. పోలీసుస్టేషన్ ఏర్పాటైనప్పటికీ ట్రాఫిక్ కష్టాలు, అక్రమ పార్కింగ్‌ల సమస్యలు మాత్రం నేటికీ తీరడంలేదని ప్రయాణికులు, దుకాణదారులు, పాదాచారులు వాపోతున్నారు. ముఖ్యంగా ఇబ్రహీంపట్నం మీదుగా హైదరాబాద్-నాగార్జునసాగర్ ప్రధాన రహదారి ఉండటంతో ఇబ్రహీంపట్నం బీఎస్ఎన్ఎల్ టవర్ నుంచి శాస్త్రా గార్డెన్ వరకు ప్రధాన రోడ్డువెంట వాహనదారులు ఇష్టారీతిన అడ్డదిడ్డంగా వాహనాలు నిలుపుతున్నారు. దీంతో పెద్ద వాహనాలకు ఇబ్బందులు తప్పడంలేదు. బుధవారం వచ్చిందంటే ట్రాఫిక్ సమస్య ఇంకా తీవ్రమవుతోందని దుకాణదారులు, చిరు వ్యాపారస్తులు వాపోతున్నారు. ముఖ్యంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రం చుట్టూ కేంద్ర, రక్షణరంగ సంస్థలు, ప్రైవేటురంగ సంస్థలు, విద్యా సంస్థలు పెద్ద ఎత్తున ఉన్నాయి. నిత్యం వేలాది వాహనాలు ప్రయాణాలు సాగించే ఈ రహదారిలో సిగ్నల్ వ్యవస్థలేక ట్రాఫిక్ కష్టాలు రోజురోజుకు అధికమవుతున్నాయి. రోడ్డు దాటాలంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అయినా మారని అక్రమ పార్కింగ్ తీరు
ఇబ్రహీంపట్నంలో సాగర్రహదారివెంట దుకాణ సముదాయాలు, వ్యాపార సంస్థలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఈ దుకాణాలకు పార్కింగ్ వ్యవస్థలేకపోవటంతో ఈ దుకాణాల్లో క్రయవిక్రయాలు జరిపేవారు రోడ్డుపైనే అడ్డదిడ్డంగా వాహనాలు పార్కింగ్ చేస్తున్నారు. దీంతో రోడ్డుపై ప్రయాణాలు సాగించే ఇతర వాహనదారులు, పాదాచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ అక్రమ పార్కింగ్‌లను నిర్మూలించాల్సిన ట్రాఫిక్ పోలీసులు మాత్రం ఏమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
అవగాహనలేని ఆర్టీసీ డ్రైవర్లతో మరిన్ని కష్టాలు
ముఖ్యంగా సాగర్రహదారికి ఇబ్రహీంపట్నం ఆర్టీసీ బస్టాండు ఆనుకుని ఉండటంతో ఈ రోడ్డువెంట ఆర్టీసీ డ్రైవర్లు ఇష్టారీతిన బస్సులు అడ్డదిడ్డంగా నిలిపి ఇతర వాహనదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ముఖ్యంగా ప్రైవేటు ఆర్టీసీ బస్సులకు చెందిన డ్రైవర్లు అవగాహనలేక రోడ్డుమధ్యలో బస్సులను నిలుపుతున్నారు. ప్రక్కకు ఆపాలని కోరినా వారిని దబాయిస్తూ ఇష్టారీతిన నోరు పారేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. వీరికి అవగాహన కల్పించి ట్రాఫిక్ నిబంధనల గురించి తెలపాల్సిన ఆర్టీసీ, ట్రాఫిక్ అధికారులు ఏమాత్రం పట్టించుకోవటం లేదు. ఆర్టీసీ అధికారులు ఇప్పటికైనా బస్సుడ్రైవర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరుతున్నారు.
ఫైన్లు, చలాన్లు వసూళ్లు చేయటంపైనే దృష్టి
ఇబ్రహీంపట్నంలో రోజురోజుకు అధికమవుతున్న ట్రాఫిక్ సమస్య, అక్రమ పార్కింగ్ వ్యవస్థను నిర్మూలించాల్సిన ట్రాఫిక్ పోలీసులు అవేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా సాగర్రహదారిపై అడ్డగోలు పార్కింగ్‌లతో పాటు వాహనాలు ఇష్టారీతిన నడిపేవారిపట్ల కఠిన చర్యలు తీసుకోవల్సిన అధికారులు కేవలం వాహనాలకు ఫైన్లు విధించటం, చలాన్లు వసూళ్లు చేయడంపైనే దృష్టి సారిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ట్రాఫిక్ పోలీసులకు లైసెన్స్, వాహనాలకు సంబంధించిన పత్రాలు అన్ని చూపించడంతోపాటు హెల్మెట్ ధరించినప్పటికీ ఏదో విధంగా ఫైన్లు విధిస్తున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు. చలాన్ల వసూళ్లతో పాటు ట్రాఫిక్ సమస్యలపై కూడా పోలీసులు దృష్టి సారించాలని కోరుతున్నారు.
రహదారి దాటడం కష్టంగా మారింది
జనాభా, వాహనాల సంఖ్యకు అనుగుణంగా పట్నం రహదారి విస్తరణకు నోచుకోవటంలేదు. హైదరాబాద్-నాగార్జునసాగర్ రహదారి మీదుగా మంచాల మండల కేంద్రంతో పాటు పాత ఇబ్రహీంపట్నం, బృంధావన్కాలనీ, కేవీతండాలకు అంబేద్కర్ చౌరస్తా నుంచి వెళాల్సి ఉంటుంది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఈచౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు చేయడంలేదు. దీంతో ఇక్కడ తరుచు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇష్టానుసారంగా వాహనదారులు దూసుకుపోతుండటమే దీనికి కారణమని స్పష్టంగా తెలుస్తోంది. పాత ఇబ్రహీంపట్నం నుంచి కొత్త బస్టాండుకు, మంచాల రోడ్డుకు వెళ్లాలంటే చౌరస్తా వద్ద రహదారి దాటడం గగనంగా మారుతోంది. ఏవైపు నుంచి ఏ వాహనం దూసుకొస్తుందోనన్న భయాందోళన బాటసారులనే కాదు వాహన దారులను వెంటాడుతున్నది.
ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు చేయాలి..
ఇబ్రహీంపట్నంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో నాటి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రత్యేకంగా చొరువచూపి ఇబ్రహీంపట్నంలో ట్రాఫిక్ పోలీసుస్టేషన్ ఏర్పాటు చేయించారని పాతూరి రాజేష్ గౌడ్ అన్నారు. అనంతరం ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు సిగ్నల్ ఏర్పాటు చేయిస్తే బాగుండేది. కాని, అవేమి పట్టించుకోవటంలేదు. ట్రాఫిక్ పోలీసులు ఇష్టారీతిన చలాన్లు విధించి వసూళ్లు చేయటంపైనే దృష్టి సారిస్తున్నారు. కాని, ట్రాఫిక్ సమస్యలు తొలగించటంలో దృష్టి సారించటంలేదు. ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులు అమాయకుల దగ్గర ఇష్టారీతిన చాలాన్లు వసూళ్లు చేయటం అదుపుచేసి ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు చేయాలి.
అక్రమ పార్కింగ్ సమస్యలను పరిష్కరించాలి..
అక్రమ పార్కింగ్‌లతో నిత్యం తీవ్ర ఇబ్బందులెదురవుతున్నాయి. దుకాణ సముదాయాల ముందు నిత్యం అక్రమంగా వాహనాలు పార్కింగ్ చేస్తున్నారని పట్టణానికి చెందిన మహేందర్ అన్నారు. వీటిపై చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవటంలేదు. స్పందించి రోడ్డువెంట అక్రమ పార్కింగ్‌లను తొలగిస్తే ప్రమాదాలు నివారించవచ్చని చెప్పారు.
అవగాహన కల్పిస్తాం..
అక్రమ పార్కింగ్‌లతో పాటు రోడ్లపై అడ్డగోలుగా బండ్లు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఇబ్రహీంపట్నం ట్రాఫిక్ సీఐ గురునాయుడు చెప్పారు. ఇప్పటికే పలుమార్లు అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించామని తెలిపారు. ముఖ్యంగా ప్రైవేటు ఆర్టీసీ డ్రైవర్లు, ర్యాష్ డ్రైవింగ్ చేసేవారికి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.