వికారాబాద్, మార్చి 23 : క్షయ (టీబీ) అనేది ఒక అంటు వ్యాధి. ఇది మైకోబ్యాక్టీరియం ట్యూబర్ కూలై అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. టీబీ రోగులు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వచ్చే తుంపర్లతో ట్యూబర్ కూలై బ్యాక్టీరియా వ్యాపిస్తుంది. ఈ బ్యాక్టీరియా ఒక్కసారి ఒంట్లోకి చేరిందంటే జీవితకాలం మనలోపలే ఉంటుంది. ముఖ్యంగా ఇమ్యూనిటీ తగ్గినప్పుడు ఈ బ్యాక్టీరియా యాక్టివ్ అవుతుంది. ఒకప్పుడు టీబీ వస్తే రెండు మూడు నెలలు దవాఖానల్లో ఉండి చికిత్సలు తీసుకునేవారు. ఇప్పుడు అడ్వాన్డ్స్ చికిత్సలు వచ్చాయి. టీబీ నుంచి కోలుకునేవాళ్ల సంఖ్య పెరిగింది. క్షయ వ్యాధి నిర్మూలనకు ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. అమలులో ఉన్న పర్యవేక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తూ చర్యలు తీసుకుంటుంది.
రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం, బరువు తగ్గడం, సాయంత్రం కాగానే చలివేస్తుందనడం టీబీ లక్షణాలు. ఇవే కాకుండా టీబీ సోకితే చెమటలు పడతాయి. ఆకలి తగ్గిపోవడం, తొందరగా అలసిపోతారు. చాతిలో నీళ్లు చేరడం వల్ల దమ్ము కూడా వస్తుంది. మెదడు టీబీ ఇన్పెక్షన్ ఉంటేతలనొప్పి వస్తుంది.
వికారాబాద్, కొడంగల్, తాండూరు, మర్పల్లి, పరిగి 5 కేంద్రాలు ఉండగా, డీఎంసీ 5 సెంటర్లు ఉన్నాయి. కుల్కచర్ల, బషీరాబాద్, పెద్దేముల్, మోమిన్‌పేట, అనంతగిరి ఉన్నాయి. టీబీ రోగాన్ని బట్టి వివిధ రకాలుగా చికిత్సలు చేయవచ్చు. 6 నెలలు, 9 నెలలు, సంవత్సరం వరకు వ్యాధి తీవ్రతను బట్టి చికిత్సలు ఉంటాయి. రోగులకు పొల్యూషన్ లేకుండా, స్వచ్ఛమైన వాతావరణం ఉంటే వ్యాధి నయం అయ్యే అవకాశాలు ఉంటాయి.
వైద్యాధికారులు నియమించిన ప్రత్యేక బృందం ప్రతి నెలా 200 మంది క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించాల్సి ఉంటుంది. గ్రామాల్లోని ఆశవర్కర్లు, అంగన్వాడీ టీచర్ల సాయంతో రోగులను గుర్తించాల్సి ఉంటుంది. దగ్గు ఎక్కువగా ఉండి వ్యాధి లక్షణాలు గుర్తించిన వారిని సమీపంలోని ఆరోగ్య కేంద్రాల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. వ్యాధి ఉన్నట్లు తేలితే వారికి సౌకర్యవంతంగా ఉండేలా ఇండ్లల్లో కాని, క్షయ దవాఖానల్లో కాని చికిత్సలు చేయడం జరుగుతుంది. అదే విధంగా రోగి కుటుంబ సభ్యులకు సైతం టీబీ చికిత్సలు చేయాల్సి ఉంటుంది. వారికి అవసరమైన జాగ్రత్తలు తెలుపుతూ మందులు అందజేస్తారు. టీబీ రోగికి ప్రతి నెలా రూ.500లు పౌష్టికాహారం కోసం అందజేస్తారు. రోగులను గుర్తించిన ఆశవర్కర్లకు నగదు అందజేయడంతోపాటు రోగికి చికిత్స అనంతరం మరి కొంత నగదును ప్రభుత్వం అందజేస్తుంది. జిల్లాలో మొత్తం 800 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. వికారాబాద్ టీబీ దవాఖానలో 30 మంది రోగులు చికిత్స చేయించుకుంటున్నారు.
టీబీ వ్యాధి సోకకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలి. నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాలకే ప్రమాదం. టీబీకి పూర్తిస్థాయిలో చికిత్స ఉన్నది. వైద్యులు సూచించిన జాగ్రత్తలు పాటిస్తే తప్పకుండా నయమవుతుంది. వికారాబాద్ టీబీ దవాఖానలో 30 మంది రోగులకు చికిత్స అందిస్తున్నాం. వారి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతున్నది.
– డాక్టర్ రవీంద్రయాదవ్, జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి, వికారాబాద్