మంచిర్యాల ప్రతినిధి/కుమ్రం భీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి 11(నమస్తే తెలంగాణ ) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పది మున్సిపాలిటీలు, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో బుధవారం పోలింగ్ ముగిసింది. గతంలో జరిగిన ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికలు కాస్త గందరగోళాన్ని తలపించాయి. చాలా మంది ఓటర్లు తమకు పోలింగ్ స్లిప్‌లు రాలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో ఈ సమస్య ఎక్కువగా కనిపించింది. మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు ఓటు వేసి బయటికి వచ్చాక.. చాలా మంది ఓటర్ స్లిప్‌లు రాలేదని, తనకు ఇవ్వలేదంటూ అసహనం వ్యక్తం చేశారు.
ఎన్నికల నిర్వహణలో సర్కార్ విఫలమైందని మండిపడ్డారు. కార్పొరేషన్ పరిధిలోని ఓటర్లకు చాలా మంది ఓటర్ స్లిప్‌లు రాలేదని, అసలు పంపిణీ చేయలేదని చెప్పడం గమనార్హం. ఇక మంచిర్యాల 41వ డివిజన్లో కొందరు మహిళలు ఓటు వేసేందుకు వెళ్లే సమయానికే.. వాళ్ల ఓట్లు మరెవరో వేసి వెళ్లిపోయారు. దీంతో కంగుతిన్న మహిళలు మా ఓటు ఏమైంది. మేము వచ్చిందే ఇప్పుడు ఎవరు వచ్చి ఓటు వేసి వెళ్లినా వేయించుకుంటారా? అంటూ అధికారులను ప్రశ్నించారు. దాదాపు 20 నిమిషాల తర్వాత వారితో అధికారులు టెండర్ ఓటు వేయించి పంపినట్లు తెలిసింది. ఈ డివిజన్‌కు చెందిన కవిత ఠాకూర్, ఆకుల సరితలు పోలింగ్ బూత్ నుంచి బయటికి రాగానే ఈ విషయాన్ని మీడియాకు చెప్పారు. మరో వార్డులో ఓ మహిళ దొంగ ఓటు వేసి దొరికింది.
ఓటు వేసి బయటికి వచ్చిన ఓ మహిళలపై అనుమానం వచ్చి ఆరా తీయగా.. తాను కాంగ్రెస్ పార్టీకి దొంగ ఓటు వేయడానికి వచ్చినట్లు ఆమె స్వయంగా ఒప్పుకున్నారు. దీంతో సదరు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక గుడిపేటలో పోలింగ్ బూత్ వద్దే ఓ పార్టీ నాయకులు పోలింగ్ చిట్టీలతోపాటు డబ్బులు పంచుతుండగా పోలీసులు పట్టుకున్నారు. డబ్బులను స్వాధీనం చేసుకోవడంతోపాటు కేసు నమోదు చేశారు. చెన్నూర్ మున్సిపాలిటీలో రెండో వార్డు కాంగ్రెస్ అభ్యర్థి భర్త పోలింగ్ బూత్ ముందే ఓటర్ స్లిప్‌లతోపాటు డబ్బులు పంచారు.
ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఆదిలాబాద్ మున్సిపాలిటీ 11 వ వార్డులో రామ్‌నగర్ పోలింగ్ బూత్‌కు ఓటు వేసేందుకు వచ్చిన ఓ మహిళ దగ్గర కత్తి దొరికింది. పోలీసుల తనిఖీల్లో మహిళ నుంచి కత్తి స్వాధీనం చేసుకున్నారు. ఆమెను విచారించగా పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చి అదుపులోకి తీసుకున్నారు. స్థానిక మహాలక్ష్మి వాడలో ఓటు వేసేందుకు వెళ్తున్న వారికి ఓ ఆటో డ్రైవర్ అరటిపండ్ల పంపిణీ చేశారు. దీంతో ఆ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. నిర్మల్, ఖానాపూర్, భైంసా, లక్షెట్టిపేట, ఆసిఫాబాద్, క్యాతన్‌పల్లి, బెల్లంపల్లి మున్సిపాలిటీల్లో చెదురుముదురు ఘటనలు తప్ప పోలింగ్ ప్రశాంతంగా సాగింది.
ఓటర్ స్లిప్‌లు ఎవరివ్వాలి..
మాది మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో 42 వ డివిజన్. గతంలో 13వ డివిజన్ ఉంటే కార్పొరేషన్ అయ్యాక 42 వచ్చింది. నాకు ఓటర్ స్లిప్‌లు రాలేదు. ఓటర్ స్లిప్‌లు ఎవరిని అడగాలి. అసలు గవర్నమెంట్ పని చేస్తుం దా? అన్న సందేహం ఉంది. నేను ఇప్పుడు ఏ అధికారిని అడగాలి. ఇలాంటి ఎన్నికలు గతంలో ఎన్నడూ చూడలేదు. ఓటర్ స్లిప్‌లు రాకపోవడం దారుణం.
– సుంకి పద్మావతి,ఎన్టీఆర్ నగర్, మంచిర్యాల కార్పొరేషన్
