రంగారెడ్డి, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ) : కేసీఆర్ సచ్చుడో… తెలంగాణ వచ్చుడో అన్న నినాదంతో తెలంగాణ ఉద్యమ రథసారథి.. బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆమరణ దీక్షకు పూనుకున్న రోజు నవంబర్ 29ని పురస్కరించుకుని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నేడు ఉమ్మడి జిల్లాలో దీక్షాదివస్ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని హుడా కాలనీలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ఆవరణలో జరుగనున్న ఈ ప్రోగ్రామ్‌కు ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, షాద్‌నగర్, చేవెళ్ల, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి సెగ్మెంట్లకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, జిల్లా నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు అధికంగా తరలి రానున్నారు.
సుమారు నాలుగు వేల మంది ప్రతినిధులు హాజరయ్యేలా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి అడుగులు పడిన నవంబర్ 29 సందర్భంగా ..శుక్రవారం ఉదయం ముందుగా పార్టీ జెండావిష్కరణతో కార్యక్రమం ప్రారంభమై.. ఉద్య మ పూర్వాపరాలు, ఉద్యమ చరిత్ర, వీరుల త్యాగాలు వంటివి ఉండనున్నాయి. కార్యక్రమానికి మాజీ మంత్రులు మహమూద్ అలీ, సబితాఇంద్రారెడ్డి హాజరు కానున్నారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అధ్యక్షతన జరుగనున్న ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు, మండల పార్టీ అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలు హాజరు కానున్నారు.
ఏర్పాట్లు పూర్తి..
వికారాబాద్ : వికారాబాద్ జిల్లాలో దీక్షాదివస్‌ను సక్సెస్ చేసేందుకు దీక్షాదివస్ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల నుంచి ..సెగ్మెంట్‌కు 500-600 మంది చొప్పున నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు వికారాబాద్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి తరలిరావాలని ఇప్పటికే పిలుపునిచ్చారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం ప్రతి ఏటా నవంబర్ 29న దీక్షాదివస్‌ను ఘనంగా నిర్వహించనున్నట్లు వివరించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి, అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి, మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తామని వివరించారు. అదేవిధంగా ఉద్యమ నేత కేసీఆర్ ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి డాక్యుమెంటరీ ప్రదర్శన ఉంటుందన్నారు.
సక్సెస్ చేయాలి..
శంషాబాద్‌లో జరుగనున్న దీక్షా దివస్‌ను సక్సెస్ చేయాలి. ఇందుకోసం జిల్లా నలుమూలల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు, ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా వేలాదిగా తరలిరావాలి. ఈ ప్రోగ్రామ్ ద్వారా తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్ త్యాగాలను స్మరించుకోవల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. నవంబర్ 29తో దీక్షా దివస్‌కు పదిహేనేండ్లు పూర్తవుతున్నాయి.
-మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే
సెగ్మెంట్‌కు 500-600 మంది చొప్పున తరలివచ్చేలా ఏర్పాటు..
పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు వికారాబాద్ జిల్లా కేం ద్రంలో దీక్షాదివస్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించ నున్నాం. ముందుగా జిల్లా కేం ద్రంలోని అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి.. ఉదయం 9 గంటలకు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తాం. నియోజకవర్గానికి 500-600 మంది చొప్పున నాలుగు సెగ్మెంట్లకు కలిపి రెండు వేల మంది నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు తరలివచ్చి కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు ఏర్పాట్లు చేశాం. దీక్షాదివస్ జిల్లా ఇన్చార్జి ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి సైతం హాజరు కానున్నారు.
-డాక్టర్ మెతుకు ఆనంద్, బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే