రంగారెడ్డి, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ) ; బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి చింత లేకుండా ప్రభుత్వం అందించిన రైతుబంధు పెట్టుబడి సాయంతో పంటలను సకాలంలో సాగు చేసుకున్న అన్నదాత.. రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. వానకాలం రైతు భరోసాను ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. యాసంగి సీజన్ ప్రారంభమైనా ఇంకా దాని విడుదలపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పుడు కూడా వడ్డీ వ్యాపారులు, దళారులను ఆశ్రయించి.. అప్పులు చేయాల్సిందేనా..? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
రేవంత్ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతన్నకు భరోసా లేకుండా పోయింది. కేసీఆర్ హయాంలో పంటల సాగుకు ప్రతిఏటా ఎకరానికి రూ.పది వేల చొప్పున పంపిణీ చేసేవారు. దానితో జిల్లాలోని రైతులు ఎవరికీ చేయి చాపకుండా అవసరమైన ఎరువులు, విత్తనాలను సమకూర్చుకుని సకాలంలో పంటలను సాగు చేసేవారు. కానీ, ప్రభుత్వం మారడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వానకాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుభరోసా పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టడంతో.. అన్నదాతలు వడ్డీ వ్యాపారులు, దళారుల నుంచి అప్పులు తీసుకొచ్చి.. పంటలను సాగు చేశారు. ప్రస్తుతం యాసంగి సీజన్ మొ దలైంది.
అన్నదాతలు ఇప్పుడైనా రైతుభరోసా అందుతుం దా..? అన్న ఆశతో ఎదురుచూస్తున్నారు. అయితే ప్రభుత్వం మా త్రం దాని విడుదలకు సంబంధిం చి ఎలాంటి ప్రకటన విడుదల చేయకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కూ డా అప్పులు చేసేలా తప్పేలా లేద ని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రాగానే రైతుబంధు పథకాన్ని.. రైతు భరోసాగా మార్చి ఎకరానికి రూ.15,000 ఇస్తామని.. ఊదర గొట్టిన కాంగ్రెస్ నాయకులు పవర్లోకి రాగానే.. ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేస్తామని, పథకం విధివిధానాలను రూపొందిస్తామని చెబుతూ అన్నదాతలను మోసం చేస్తున్నారు.
రైతుభరోసా పంపిణీ చేయకుంటే..ఆందోళనలు చేస్తాం
కేసీఆర్ హయాంలో అన్నదాతల కు సకాలంలో రైతుబంధు సా యం అందేది. దానితో ఎరువు లు, విత్తనాలను కొని పంటలను సాగు చేసుకునేవారు. కానీ, ప్రభు త్వం మారి దారిద్రపు హస్తం పార్టీ అధికారంలోకి రావడంతో అన్నదాతలకు అవస్థలు తప్పడం లేదు. వానకాలంలోనూ రైతుభరోసాను ఎగ్గొట్టారు. ఇప్పుడూ వస్తుందా ..? అంటే ప్రభు త్వం నుంచి ఎలాంటి ప్రకటనలేదు. అన్నదాతలు అప్పుల పాలు కాకుండా.. సర్కారు వెంటనే రైతుభరోసా నిధులను విడుదల చేసి ఆదుకోవాలి. లేకుంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహిస్తాం.
-మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు
రైతులపై వివక్ష తగదు..
గత బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి ఇబ్బందుల్లేకుండా పం టలను సాగు చేసుకున్నాం. రూ. 15 వేలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వానకాలం రైతుభరోసాను ఎగ్గొట్టడం సిగ్గుచేటు. ప్రస్తుతం యా సంగి సీజన్ మొదలైంది. ఈ సీజన్లోనైనా సకాలంలో పెట్టుబడి సాయాన్ని అందించి అన్నదాతలను ఆదుకోవాలి. రైతులపై ప్రభుత్వానికి వివక్ష తగదు.
-గడ్డం రాజేశ్, మంచాల
జిల్లాలో అర్హులైన రైతులు 3,25,217మంది..
వానకాలంలో అన్నదాతలు సాగు చేసిన వరి, పత్తి పంటలకు సరైన మద్దతు ధర రాకపోవడంతో వారు ఆ పంటలను ఇండ్లలోనే నిల్వ చేశారు. దీంతో అవి అమ్ముడు పోకపోవడంతో రైతుల చేతుల్లో చిల్లిగవ్వ లేకుండా పోయింది. ప్రస్తుతం స్పందించి సకాలంలో రైతు భరోసాను విడుదల చేస్తే పంటల సాగుకు ఉపయుక్తంగా ఉంటుం దని వారు కోరుతున్నారు. కాగా జిల్లాలో అర్హులైన రైతులు 3,25, 217 మంది ఉన్నారు. బీఆర్ఎస్ హయాంలో 3,25,217 మంది రైతులకు ప్రభుత్వం ప్రతి ఏటా ఎకరానికి రూ.పది వేల చొప్పున పంపిణీ చేసింది.
విధివిధానాల పేరుతో కాలయాపన..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుబంధు స్థానంలో రైతుభరోసా పథకాన్ని తీసుకొచ్చింది. ఇందుకోసం ఒక కమిటీని కూడా ఏర్పా టు చేసింది. కానీ, ఆ సబ్ కమిటీ మీటింగ్‌లు కాక.. విధి విధానాలను రూపొందించలేదు. దీంతో సబ్‌కమిటీ ఎప్పుడు సమావేశమవుతుందో.. ఎప్పుడు విధి విధానాలను రూపొందిస్తారో తెలియక అధికారులు కూడా రైతులకు ఏం చెప్పలేని పరిస్థితి నెలకొన్నది.