ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 28 : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 22 నెలలు దాటినా నేటికీ చెరువులు, డ్యాంలు, కుంటల్లో చేపపిల్లల పంపిణీ జరగలేదు. దీంతో మత్స్యకారులు జీవనోపాధి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో మత్స్యకారులకు ఉపాధి కల్పించేందుకు వర్షాలు ప్రారంభమై చెరువు, కుంటల్లోకి నీరు చేరుతున్న సమయంలోనే చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేసేవారు. ఈ ఏడాది జిల్లాలో వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువు, కుంటల్లోకి భారీగా నీరు చేరడంతో చేపపిల్లల కోసం మత్స్యకారులు ఎదురు చూస్తున్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంలోని ఇబ్రహీంపట్నం పెద్దచెరువు ఎంతోమంది మత్స్యకారులకు జీవనోపాధి కల్పిస్తున్నది. ఈ చెరువులో నేటికీ ప్రభుత్వం చేపపిల్లలు వదలకపోవడంతో మత్స్యకారులు ఉపాధిలేక ఇబ్బందిపడుతున్నారు.
గత కేసీఆర్ ప్రభుత్వంలో నీటి విప్లవంలో భాగంగా మత్స్యకారుల జీవితాల్లో వెలుగు నింపింది. జిలాల్లో 210 మత్స్యకార సహకార సంఘాలుండగా అందులో సుమారు 15వేల మంది సభ్యులున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల్లో ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేయడంతో.. మత్స్యకారులు వాటిని పెంచి.. విక్రయించి ఆర్థికంగా అభివృద్ధి చెందారు. అంతేకాకుండా మత్స్యకారులు చేపలు పట్టేందుకు వలలు, ఇతర సామగ్రితోపాటు మార్కెటింగ్ సౌకర్యం కూడా కల్పించింది. అలాగే, గ్రామాలకెళ్లి చేపలను విక్రయించుకునేందుకు ద్విచక్ర వాహనాలను అందజేయడంతో మత్స్యకార కుటుంబాలకు చెం దిన యువకులకు ఉపాధి అవకాశాలు పెరిగాయి.
జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెరువులు, కుం టలు నిండకుండలను తలపిస్తున్నాయి. నిండిన చెరువులు, కుంటల్లో చేప పిల్లలను వదిలితే తమకు జీవనోపాధి లభిస్తుందని ప్రభుత్వం వెంటనే చేప పిల్లలను చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల్లో వదలానని మత్స్యకార సంఘాల నాయకులు పలుమార్లు ప్రభుత్వానికి వినతిపత్రాలు అందించినా ఫలితం లేని పరిస్థితి నెలకొన్నది.
గత కేసీఆర్ హయాంలో ప్రభుత్వం మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేయడంతోపాటు వాటిని అమ్ముకునేందుకు వీలుగా అన్ని రకాల సౌకర్యాలు కల్పించింది. మత్స్యకారులే కాకుండా అన్ని కులవృత్తిదారులను ఆదుకునేందుకు అనేక అవకాశాలను కల్పించింది. అయితే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 22 నెలలు దాటినా నేటికీ మత్స్యకారులకు చేప పిల్లలను పంపిణీ చేయకపోవడంతో వారు ఉపాధిని కోల్పోయే ప్రమాదం ఉన్నది.