వికారాబాద్, మార్చి 18 : పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏ ర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. మంగళవారం క్యాంపు కార్యాలయం నుంచి జిల్లాలోని తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంఈవోలు, పదో తరగతి పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, ైఫ్లయింగ్ స్కాడ్లు, పోలీస్ స్టేషన్ కస్టోడియన్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పదో తరగతి పరీక్షల నిర్వహణపై కలెక్టర్ పలు సూచనలు చేశారు.
పరీక్షా కేంద్రాల ఏర్పాటు, విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా ఉండేలా వసతుల కల్పనకు కృషి చేయాలన్నారు. ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 3 వరకు పరీక్షలు జరగనున్నాయని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పరీక్షల నిర్వహణలో భాగంగా చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లను నియమించామని, విద్యార్థులు ప్రశాంత వాతావరణలో పరీక్షలు రాసేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.
పదో తరగతి పరీక్షల నిర్వహణకు మొత్తం 69 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో మొత్తం 12,903 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. వీరిలో బాలురు 6,450, బాలికలు 6,453 మంది ఉన్నారని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులు సెల్ఫోన్లకు అనుమతి ఇవ్వరాదన్నారు. కేంద్రాల నిర్వహణ, పరిశీలన కోసం 20మంది తహసీల్దార్లు, 20 మంది ఎంపీడీవోలు, 20మంది ఎంఈవోలు, 69 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 69 మంది డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, 8 మంది పోలీస్ స్టేషన్ కస్టోడియన్స్, 13 మంది రూట్ ఆఫీసర్లు, 10 మంది ఫ్లయింగ్ స్వాడ్లు, 732 మంది ఇన్విజిలేటర్లను నియమించామని తెలిపారు.
విద్యార్థులకు కేటాయించిన పరీక్షా కేంద్రానికి పరీక్ష సమయానికి గంట ముందు చేరుకోవాలని కలెక్టర్ సూచించారు. ఒకరోజు ముందే పరీక్ష కేంద్రాన్ని చూసుకోవాలన్నారు. పరీక్ష ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. 5 నిమిషాలు ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఇవ్వాలన్నారు. ఆ తర్వాత వచ్చిన విద్యార్థులను అనుమతించరాదన్నారు.
పరీక్షా కేంద్రాల్లోకి వచ్చే ఎవరి దగ్గర కూడా మొబైల్ ఫోన్ ఉండేందుకు వీలు లేదన్నారు. ఏఎన్ఎంల దగ్గర కూడా ఉండడానికి వీలు లేదని వివరించారు. పరీక్ష కేంద్రంలోకి నిర్వహణ సిబ్బంది, స్కాడ్స్ తప్పా ఇతరులకు ప్రవేశం లేదన్నారు. ప్రతి విద్యార్థినీ క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. బాలురు, బాలికలకు ప్రత్యేకంగా తనిఖీ చేసే ఉపాధ్యాయులను టీమ్‌లుగా ఏర్పాటు చేయాలని సూచించారు.
ప్రశ్నాపత్రాన్ని నిర్దేశించిన సమయానికి స్వ యంగా సీఎస్, డిపార్ట్మెంటల్ అధికారి ప్రతి రూమ్‌కు తీసుకెళ్లాలని కలెక్టర్ సూచించారు. పరీక్షకు గైర్హాజరైన విద్యార్థుల ప్రశ్నాపత్రాలను వెంటనే తీసుకొని వాటిని భద్రంగా దాచి ఉం చాలన్నారు. పరీక్షా కేంద్రాల చుట్టూ ప్రహరీ సరిగా లేని దగ్గర పోలీస్ సిబ్బందిని అదనంగా నియమించుకోవాలన్నారు. పరీక్షకు ముందు రోజు సీఎస్, డీవోలు ఇన్విజిలేటర్లతో సమావేశమై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలన్నారు. కేంద్రాల్లో మంచినీటి సౌకర్యం, విద్యుత్ సరఫరా, లైటింగ్, ఫ్యాన్లు ఉండేలా ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. పరీక్షలు ప్రారంభమైనప్పటి నుంచి ముగిసే వరకు సిబ్బంది ఎవరూ సెలవులు వాడుకోరాదన్నారు. విధుల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన ఎలాంటి సందేహాలు ఉన్న జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. కంట్రోల్ రూమ్ ఫోన్ 08416 235245 నంబర్‌కు కాల్ చేసి సందేహాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, డీఈవో రేణుకాదేవి తదితరులు పాల్గొన్నారు.
రంగారెడ్డి, మార్చి 18 (నమస్తే తెలంగాణ) : ఈ నెల 21నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని రంగారెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం పదో తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కేంద్రాల్లో అన్ని వసతులు ఏర్పాట్లు చేయాలన్నారు.
ప్రతి పరీక్షా కేంద్రంలో ఏఎన్ఎంలను అందుబాటులో ఉంచాలని ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాలో 249 పరీక్షా కేంద్రాల్లో 51,766మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. పరీక్ష సమయానికి అనుకూలంగా ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను నడిపించాలని సూచించారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు హాజరయ్యేలా బస్సు సర్వీసులను నడపాలన్నారు. ఆయా కేంద్రాల్లో నిరంతరం విద్యుత్ సరఫరా ఉండాలని ఆ శాఖ అధికారులకు సూచించారు.
జిల్లాలోని ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు పరీక్షా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన వసతులను పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు. పరీక్షల సమయంలో విద్యార్థులకు తాగునీరు, తగిన ఫర్నిచర్ కేంద్రాల్లో ఉండేలా ఈ రెండు రోజుల్లో తనిఖీ చేయాలని ఆదేశించారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు రాకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు.