ఆమన్నపేట, ఫిబ్రవరి 10: అమెరికతో చీకటి వాణిజ్య ఒప్పందం కుదుర్చుకొని భారత వ్యవసాయ రంగాన్ని మోడీ ప్రభుత్వం డొనాల్డ్ ట్రంప్న తాకట్టు పెడుతోందని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య మండిపడ్డారు. సీపీఎం మండల కమిటి ఆధ్వర్యంలో అమెరికాతో భారత్ వాణిజ్య ఒప్పందాన్ని నిరసిస్తూ స్థానిక సుభాష్ సెంటర్లో ప్రధాని నరేంద్ర మోడీ దిష్టి బొమ్మ దగ్ధం చేసి నిరసన తెలిపారు.
నిరసన కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి మాట్లాడుతూ మధ్యంతర ట్రేడ్ డీల్ మూలంగా ఉత్పత్తులపై డ్యూటీ తగ్గింపు, సొయాబీన్, మొక్కజొన్న రైతులకు గడ్డు కాలమేనని ఆయన అన్నారు. 500 బిలియన్ డాలర్ల వ్యాపారం పేరిట దేశ సార్వాభౌమాత్వాన్ని అమెరికాకు తాకట్టు పెట్టే ప్రయత్నం జరుగుతోందని, తక్కువ ధరలకు చమురు ఇస్తున్నా కొనుగోళ్ళను ఆపివేయడం దుర్మార్గం అని మోడీ సర్కార్ను ఆయన విమర్శించారు. మోడీ ప్రభుత్వం దిగుమతి వస్తువులపై సుంకాలను తగ్గించి భారత కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికుల జీవితాన్ని ప్రశ్నార్ధకం చేస్తుందని అన్నారు.
ఢిల్లీ రైతు పోరాటంలోచేసిన హామీలను మోడీ తుంగలో తొక్కి దేశ ప్రజలను మోసం చేస్తున్నారని, ఎరువుల మీద సబ్సిడీలు తగ్గించి ధరలు పెంచడాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఊ అంటే స్వదేశీ జపం చేసే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విదేశాలకు మోకరిళ్ళుతుందని.. మోడీ బృందానికి తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, జిల్లా కమిటి సభ్యుడు బల్గురి అంజయ్య, మండల కార్యదర్శి వర్గ సభ్యుడలు బోయిని ఆనంద్, కందుల హనుమంతు, మండల నాయకులు గన్నేబోయిన విజయ భాస్కర్, నీల అయిలయ్య, ఆవనగంటి నగేష్, గంటెపాక శివ కుమార్, మునికుంట్ల లెనిన్, శానగొండ రాము, బడుగు రమేష్, అంబటి సురేందర్ రెడ్డి, నకిరేకంటి సురేష్, గాదె కృష్ణ, తుర్కపల్లి నరేష్, తదితరులు పాల్గొన్నారు.