రంగారెడ్డి, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : ఇబ్రహీంపట్నం సమీపంలోని గురునానక్ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతూ.. అక్కడే ఏర్పాటు చేసిన హాస్టళ్లలో ఉంటున్న ముగ్గురు విద్యార్థుల అదృశ్యం తీవ్ర కలకలం రేపుతున్నది. వారం రోజుల వ్యవధిలో వీరు మిస్సింగ్ కావడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెం దుతున్నారు. ఎక్కడ వెతికినా వారి ఆచూకీ లభించకపోవడంతో కళాశాల యాజమాన్యం, విద్యార్థు ల తల్లిదండ్రులు ఇబ్రహీంపట్నం ఠాణాలో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.
వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట మండలంలోని గుడిపల్లి గ్రామానికి చెందిన విష్ణు గురునానక్ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతూ.. అక్కడి హాస్టల్లోనే ఉంటున్నాడు. అతడు ఈ నెల 14న కళాశాల/హాస్టల్ నుం చి అదృశ్యమయ్యాడు. అలాగే, అదే కళాశాలలో చదువుతూ… అక్కడి హాస్టళ్లలోనే ఉంటున్న శివాని ఈనెల 17న, పావని ఈ నెల 20న మిస్సింగ్ అయ్యారు. విద్యార్థుల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ రామకృష్ణ తెలిపారు.
జిల్లాలో ఇంజినీరింగ్ కళాశాలలు అత్యధికంగా ఉండడంతో సుమారు ఐదువేలకు పైగా ప్రైవేట్ హాస్టళ్లతోపాటు ఆయా కళాశాలల్లో వసతిగృహాలూ ఉన్నాయి. ఇబ్రహీంపట్నం సెగ్మెంట్లోని ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల, తుర్కయాంజాల్ మున్సిపాలిటీల్లో అధిక సంఖ్యలో ఇంజినీరింగ్ కళాశాలలున్నాయి. ఈ కళాశాలల్లో చదివే విద్యార్థుల కో సం మంగల్‌పల్లి, ఇబ్రహీంపట్నం, శేరిగూడ, తుర్కయాంజాల్, బొంగుళూరు, మన్నెగూడ, ఆదిబట్ల పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున హాస్టళ్లు ఏర్పాటయ్యాయి. అలాగే, మహేశ్వరం, రాజేంద్రనగర్, చేవెళ్ల సెగ్మెంట్లలోనూ ఇంజినీరింగ్ కళాశాలలు అత్యధికంగా ఉండగా.. హాస్టళ్లూ ఎక్కువగానే ఉన్నాయి. వాటిలో వేలాదిమంది విద్యార్థినీ విద్యార్థులు నివాసముంటూ చదువుకుంటున్నా రు. అయితే, వాటి నిర్వహణపై హాస్టళ్ల నిర్వాహకులు సరైన నిఘా ఉంచకపోవడంతో వారు ఎక్కడికి వెళ్తున్నారో.. ఎప్పుడొస్తున్నారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొన్నది. మరోవైపు హాస్టళ్లలో ఉండే విద్యార్థులు గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నారు. హాస్టళ్లపై నిర్వాహకులు నిఘా ఉంచాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.