మణికొండ, డిసెంబర్ 28 : ఔటర్ సర్వీస్ రోడ్డు పక్క నుంచి కొనసాగుతున్న సైకిల్ ట్రాక్ పనుల్లో అకస్మాత్తుగా డిటోనేటర్ పేలడంతో ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడిన సంఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..సైబారాబాద్ కమిషనరేట్ నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధి పుప్పాలగూడ సమీపంలోని ఔటర్ సర్వీస్ రోడ్డుపై అకస్మాత్తుగా డిటోనేటర్ పేలడంతో ముగ్గురు కార్మికులకు తీవ్రగాయాలైయ్యాయి. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో నార్సింగి పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు.
ఈ ప్రమాదంలో చందానగర్‌కు చెందిన గణేశ్, వట్టినాగులపల్లికి చెందిన రాములు, గౌతమ్‌లు తీవ్రంగా గాయపడ్డారు. రాములు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం చోటుచేసుకుందని నార్సింగి ఇన్స్పెక్టర్ శివకుమార్ తెలిపారు. ఈ మేరకు ఆ సంస్థ బాధ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.