షాబాద్, మే 15: అన్నదాతలు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను మార్కెట్లో అమ్ముకునేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఓ వైపు పంటలకు నీరు అందక, మరో వైపు అకాల వర్షాలకు పంటలు దెబ్బతినడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇవన్నీ పక్కకు పెడితే చేతికొచ్చిన పంటను ఎక్కడ అమ్ముకోవాలో రైతులకు అర్థం కావడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడంతో అన్నదాతలు అయోమయంలో పడిపోయారు.
చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్, చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి మండలాలకు సంబంధించి ప్రతి ఏడాది రెండు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేవారు. శంకర్పల్లి మండలం మోకిలా, షాబాద్ మండలం సర్దార్‌నగర్‌లో కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల వద్ద ధాన్యం సేకరించేవారు. గత వారం రోజుల క్రితం మోకిలాలో కేంద్రం ఏర్పాటు చేశారు.
సర్దార్‌నగర్‌లో మాత్రం ఇప్పటివరకు కేంద్రం ఏర్పాటు చేయలేదు. ఇందుకు సంబంధించి తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని అధికారులు చెబుతున్నారు. సర్దార్‌నగర్‌లో ఏర్పాటు కేంద్రం ఏర్పాటు చేస్తే చుట్టుపక్కల మండలాల రైతులకు ఎంతో మేలు జరిగేది. కాగా, రైతులు బయటి మార్కెట్లో క్వింటాల్‌కు రూ.1800 నుంచి రూ.2000 వరకు వడ్లను అమ్ముకుంటున్నారు. ప్రభుత్వ మద్ధతు ధర రూ.2320 ఉండగా, బోనస్ రూ.500 కలిసి మొత్తం రూ.2820 వచ్చేదని, క్వింటాల్‌కు రూ.1000 వరకు నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
13వేల ఎకరాల్లో వరిసాగు..
చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్, చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి మండలాల్లో ఈ యాసంగి సీజన్లో 13వేల ఎకరాల్లో రైతులు వరిపంట సాగు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. మోకిలాలో ఒక్కచోట మాత్రమే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడంతో మిగతా మూడు మండలాల రైతులు ధాన్యం విక్రయించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. మీరు కూడా మోకిలాకు ధాన్యం తీసుకురమ్మని అధికారులు చెబుతున్నారని, ట్రాన్స్‌ఫోర్ట్ ఇబ్బందులు అవుతాయని అన్నదాతలు వాపోతున్నారు. సర్దార్‌నగర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటుపై ఇప్పటివరకు స్పష్టత లేకపోవడంతో రైతులు పండించిన వరిధాన్యాన్ని ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. క్వింటాల్‌కు రూ.1800 విక్రయించగా, ఖర్చుల కింద మరో రూ.100 తగ్గించి రైతుకు క్వింటాల్‌కు రూ.1700 మాత్రమే చెల్లిస్తున్నారు. దీంతో క్వింటాల్‌కు రూ.1000 నష్టపోతున్నామని రైతులు చెబుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం ఏంటని అన్నదాతలు ఆగ్రహానికి గురవుతున్నారు.
ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పిన సర్కార్ ఇప్పటివరకు వరిధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడం సరికాదు. రెండు ఎకరాల పొలంలో వరిపంట సాగు చేశాను. పంటను అమ్ముకునేందుకు రైతులు అవస్థలు పడాల్సి వస్తుంది. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్ధతు ధరతో పాటు రూ.500 బోనస్ అందించాలి.
– పెద్దగోల్ల మల్లయ్య, రైతు కుమ్మరిగూడ, షాబాద్
క్వింటాల్‌కు రూ.వెయ్యి నష్టం..
ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడంతో రైతులకు క్వింటాల్‌కు రూ.వెయ్యి వరకు నష్టం వస్తుంది. నేను ఎనిమిది ఎకరాల పొలంలో వరిపంట సాగు చేశాను. ప్రస్తుతం పంట కోసేందుకు సిద్ధంగా ఉంది. ప్రభుత్వం ఇంకా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడంతో వడ్లను ఎక్కడ అమ్ముకోవాలో తెలియక అయోమయంలో పడ్డాను. బయట మార్కెట్‌కు తీసుకువెళితే క్వింటాల్‌కు రూ.1800 వరకు ధర ఉంది. ప్రభుత్వం రూ.2320 ధరతో పాటు రూ.500 బోనస్ కలిపి రూ.2820 వస్తుందని అనుకున్నాం.
– కొత్తపల్లి వెంకట్‌రెడ్డి, రైతు కుమ్మరిగూడ, షాబాద్
తక్కువ ధరకే వడ్లు కొంటున్నరు..
నేను యాసంగి సీజన్లోఎకరంన్నర పొలంలో వరిపంట సాగు చేశాను. ఓ వైపు అకాల వర్షాలతో పంట దెబ్బతింటుండంతో పాటు, ప్రభుత్వం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడంతో బయటి మార్కెట్‌కు తీసుకువెళ్లి వడ్లను విక్రయిస్తున్నా. అక్కడ తక్కువ ధరకే వడ్లు కొనుగోలు చేస్తున్నరు. ఏం చేయాలో అర్థంగాక దిక్కుతోచని స్థితిలో వడ్లను విక్రయించా. ప్రభుత్వం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడంతో అన్నదాతలకు తిప్పలు తప్పడం లేదు.
– మ్యాథస్రెడ్డి, రైతు మరియాపురం, షాబాద్