జిల్లాలోని పలు ప్రాంతాల్లో యథేచ్ఛగా చెట్ల నరికివేత రాత్రి వేళల్లో హైదరాబాద్, కర్ణాటక ప్రాంతాలకు తరలింపుకలప మాఫియాతో అధికారుల కుమ్మక్కు జిల్లాలో చెట్లను నరికి పచ్చదనాన్ని నాశనం చేస్తున్నా.. చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు
వికారాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి జిల్లాలో లక్షల సంఖ్యలో మొక్కలను నాటి పచ్చదనాన్ని పెంపొందిస్తే.. కలప మాఫియా మాత్రం అటవీ ప్రాంతాన్ని నాశనం చేసే పనిలో పడింది. జిల్లాలోని కోట్‌పల్లి, బంట్వారం, మర్పల్లి, పెద్దేముల్, దోమ, కులకచర్ల మండలాల్లోని పలు గ్రామాల్లో గుట్టుచప్పుడు కాకుండా చెట్లను నరికి.. హైదరాబాద్‌తోపాటు కర్ణాటక ప్రాంతాలకు తరలిస్తూ అక్రమంగా సంపాదిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవ డంలేదని పలువురు మండిపడుతున్నారు.
కలప మాఫియా ఇచ్చే మామూళ్లకు అలవాటు పడి నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటున్నారని పేర్కొంటున్నారు. రాత్రి సమయాల్లో యథేచ్ఛగా చెట్లను నరుకుతూ గుట్టు చప్పుడు కాకుండా లారీల్లో వికారాబాద్, నవాబుపేట, శంకర్పల్లి సమీపం నుంచి హైవే మీదుగా కాటేదాన్ ప్రాంతంతోపాటు జిల్లాలోని పలు ప్రాంతాలకు కలపను తరలిస్తున్నారు. ఆయా మండలాల్లోని పలు గ్రామాల్లో నిత్యం ఈ దందా యథేచ్ఛగా జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం.