ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కరువుఛాయలు కమ్ముకున్నాయి. సరిపడా వర్షా లు లేక భూగర్భజలాలు అడుగుంటుతు న్నాయి. ఇప్పటికే రంగారెడ్డి, వికారా బాద్ జిల్లాలోని పలు మండలాల్లోని చెరువులు, కుంటలు ఎండిపోయాయి. బోరుబావులు క్రమంగా వట్టిపోతున్నా యి. సరిపడా నీరందక పంటలూ ఎండిపోతున్నాయి. దీంతో చేసేదేమీ లేక అన్నదాతలు తమ పంటలను పశువులు, జీవాలకు మేతగా వేస్తున్నారు. ఆరుగాలం కష్టపడిన పంట చేతికొచ్చే దశలో కండ్ల ముందే ఎండిపోతుండడంతో వారు లబోదిబోమంటున్నారు.
-యాచారం/మర్పల్లి/ ధారూరు, మార్చి 24
పదేండ్లలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితిని చూడలే..
గత పదేండ్ల కాలంలో ఎప్పుడూ ఇలాంటి కరువును చూడలేదు. నాకున్న ఎకరం పొలంలో వరి పంట వేస్తే మొత్తం ఎండిపోవడంతో పశువులను మేపుతున్నా. రేవంత్‌రెడ్డి వచ్చిన తర్వాత తీవ్ర కరువు వచ్చింది. వర్షాలు సరిగ్గా కురువకపోవడంతో భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. గత కేసీఆర్ హయాంలో పొలం మొత్తం సాగు చేసుకుని సంతోషంగా జీవించా. పంట సాగుకు తీసుకొచ్చిన అప్పులను ఎలా తీర్చాలో అర్థం కావడం లేదు.
-కొర్ర సీతారామ్, కొర్రవాని తండా, మంచాల
రూ. లక్ష అప్పు చేసి మొక్కజొన్న వేశా..
నాకు ఐదెకరాల పొలం ఉన్నది. అందులో రూ.1,00,000 వరకు అప్పు చేసి 4.20 ఎకరాల్లో మొక్కజొన్న పంటను సాగు చేశా. బోరుబావుల్లోని నీళ్లు అడుగంటి దాదాపుగా రెండు ఎకరాల వరకు పంట పూర్తిగా ఎండిపోయింది. గత కొన్నేండ్లుగా మొక్కజొన్న పంటను సాగు చేస్తున్నా. ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి నెలకొనలేదు. భూగర్భ జలాలు పాతాళానికి చేరడంతో అన్నదాతకు కన్నీళ్లు ఆగడం లేదు. గత కేసీఆర్ హయాంలో సమృద్ధిగా వర్షాలు కురువడంతో ఎడాదికి రెండు పంటలు సాగు చేశా. భూగర్భజలాలు అడుగడంతో మండలంలో కరువుఛాయలు కనిపిస్తున్నాయి.
-పడమటి రాజేందర్ రెడ్డి, బూచన్‌పల్లి, మర్పల్లి
మొత్తం పంట ఎండిపోయింది
దౌల్తాబాద్ : మండలంలోని దేవర్‌ఫస్లవాద్ గ్రామంలో దాదాపుగా 100 ఎకరాలకు పైగా వరి పంట ఎండిపోయింది. అదేవిధంగా సుల్తాన్పూర్ గ్రామంలో 50 ఎకరా లకు పైగా పంట ఎండిపోవడంతో పశువులను మేపుతున్నారు. కాగా, దేవర్ ఫస్లవాద్కు చెందిన గొల్ల మల్లప్ప అనే రైతు రూ.లక్ష పెట్టుబడితో కౌలుకు 8 ఎకరాల భూమిని తీసుకుని వరిని సాగు చేయగా పూర్తిగా ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు.
ట్యాంకర్‌తో నీళ్లు అందించినా ఫలితం లేదు..
గతేడాది సమృద్ధిగా నీళ్లు ఉండడంతో నాలుగు ఎకరాల్లో వరి పంటను సాగు చేశా. ప్రస్తు తం కూడా నాలుగు ఎకరాల్లోనే పంటను సాగు చేయగా.. బోరు బావిలో నీళ్లు లేకపోవడంతో మూడు ఎకరాల వరకు పంట పూర్తిగా ఎండిపోయింది. ఆ పంటను కాపాడుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశా. ట్యాంకర్‌తో నీటిని అందించినా ఫలితం లేదు. భూగర్భజలాలు అడుగంటుతుండడంతో అన్నదాతకు గుండె దడ తప్పడం లేదు.
– పడమటి రుక్కీబాయి, పులిచింతల మడుగుతండా, ధారూరు
విద్యుత్తు కోతలు, లోవోల్టేజీ సమస్యతో..
మూడున్నర ఎకరాల్లో వరి పంటను సాగు చేశా. మొదట్లో బోరు నుంచి నీళ్లు బాగానే వచ్చేవి. వర్షాలు లేకపోవడం, ఎండలు ముదురుతుండడంతో భూగర్భజలాలు తగ్గి సాగునీటి ఎద్దడి మొదలైంది. దీనికి తోడు విద్యుత్తు కోతలు, లోవోల్టేజీ సమస్యతో చేతికొచ్చే దశలో ఉన్న రెండెకరాల పొలం ఎండిపోయింది. దీంతో ఆ పంటను పశువులు, జీవాలకు మేతగా వేస్తున్నా. ఆరుగాలం కష్టించిన పంట ఎండిపోవడంతో కుంగుబాటుకు గురయ్యాడు. పంట సాగుకు తీసుకొచ్చిన అప్పులు.. కుటుంబ పోషణకు తీసుకొచ్చిన అప్పులను ఎలా తీర్చాలో అర్థం కావడంలేదు.
– సద్గుణాచారి, యువ రైతు మేడిపల్లి, యాచారం