రంగారెడ్డిజిల్లాలో సర్వేయర్ల సమస్య తీవ్రంగా ఉన్నది. భూముల సర్వే కోసం ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్న రైతులకు ఆరునెలలు గడిచినా సర్వేయర్లు అందుబాటులోకి రావడంలేదు. వేలాదిమంది రైతులు సర్వేయర్ల కోసం ప్రతిరోజూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో 26 మండలాలు ఉండగా, 9 మంది మాత్రమే పర్మినెంట్ సర్వేయర్లు ఉన్నారు. డిప్యూటేషన్‌పై మరో ఐదుగురు సర్వేయర్లను తీసుకున్నారు.
దీంతో ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 14 మంది సర్వేయర్లు ఉన్నారు. ఒక్కొక్క సర్వేయర్‌కు రెండు నుంచి మూడు మండలాల అదనపు బాధ్యతలను అప్పగిస్తున్నారు. దీంతోపాటు జిల్లాలో కొనసాగుతున్న భూసేకరణ పనులతోపాటు ఫార్మాసిటీ, గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు వంటి పనులకు కూడా వీరినే ఉపయోగిస్తున్నారు. దీంతో సర్వేయర్లు ప్రతిరోజూ ఫార్మా, గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు భూసేకరణ పనుల్లో నిమగ్నమై ఉంటున్నారు. మరోవైపు భూభారతి ద్వారా వచ్చిన సమస్యలు అత్యధికంగా సర్వే పనులతో ముడిపడి ఉండటంతో సర్వేయర్లు అందుబాటులోకి రాక సమస్యలు తీరడంలేదు.
– రంగారెడ్డి, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా భూ సమస్యలే అత్యధికంగా ఉన్నాయి. ఈ సమస్యలను పరిష్కరించాలంటే సర్వేయర్లదే కీలకపాత్ర. కాని, సర్వేయర్లు తగినంత మంది లేకపోవడం వలన భూభారతి సమస్యలు పరిష్కారానికి నోచుకోవడంలేదు. జిల్లాలో మరోవైపు భూముల క్రయవిక్రయాలు పెద్దఎత్తున జరుగుతున్న నేపథ్యంలో భూములు కొనుగోలు చేసిన వారికి సర్వే చేయించుకోవడం తప్పనిసరి అయ్యింది. కాని, భూముల సర్వే చేయాల్సిన సర్వేయర్లు అందుబాటులో లేకపోవడం వలన రిజిస్ట్రేషన్లు నెలల తరబడి నిలిచిపోతున్నాయి. షాద్‌నగర్ డివిజన్ పరిధిలో 6 మండలాలుండగా.. ముగ్గురు, చేవెళ్ల డివిజన్లో నాలుగు మండలాలకు.. ఇద్దరు, కందుకూరు, ఇబ్రహీంపట్నం డివిజన్ల పరిధిలో కూడా సర్వేయర్లు అందుబాటులో లేకపోవడం వలన ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు.
సర్వేయర్లకు మండలాల బాధ్యతలతోపాటు ఫార్మా భూముల రీ సర్వే, గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు సర్వేతో పాటు జిల్లావ్యాప్తంగా వివిధ గ్రామాల్లో చేపడుతున్న భూసేకరణకు సంబంధించిన సర్వే పనులు కూడా అప్పగించారు. ప్రస్తుతమున్న బాధ్యతలతో పాటు మరిన్ని అదనపు బాధ్యతలు అప్పగించడం వలన సర్వేయర్లు అందుబాటులోకి రావడంలేదు. జిల్లాలోని వివిధ మండలాల్లో భూముల సర్వే కోసం ఐదు నుంచి ఆరు నెలల క్రితం దరఖాస్తు చేసుకున్న రైతులకు కూడా సర్వేయర్లు అందుబాటులోకి రాకపోవడంతో సర్వే పనులు జరుగక ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. భూముల క్రయవిక్రయాలు జరిపిన రైతులకు సర్వే పనులు జరుగక రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. భూ సంబంధిత సమస్యలకు పరిష్కారం లభించాలంటే అదనపు సర్వేయర్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. భూ భారతి ద్వారా నిర్వహించిన సదస్సుల్లో 22 వేల సమస్యలు వచ్చాయి. ఈ సమస్యల్లో అత్యధికంగా సర్వేయర్లతో కూడినవి.
సర్వేయర్ల కొరతను తీర్చాలి
గ్రామాల్లో భూముల సర్వే కోసం రైతులు దరఖాస్తులు చేసుకుంటున్నప్పటికీ నెలల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయి. ఇబ్రహీంపట్నం ప్రాంతంలో సర్వేయర్ల సమస్య అధికంగా ఉండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భూ భారతి సదస్సుల్లో సర్వే కోసమే అధికంగా రైతులు దరఖాస్తు చేసుకున్నప్పటికీ నేటికీ అధికారులు పట్టించుకోవడంలేదు. వెంటనే సర్వేయర్లను ఏర్పాటు చేసి రైతుల సమస్యలు పరిష్కరించాలి.
– నిట్టు జగదీశ్వర్
సర్వేయర్లను వెంటనే నియమించాలి
సర్వేయర్ల కొరత తీవ్రంగా ఉండటంతో భూ సమస్యల పరిష్కారం ఇబ్బందిగా మారింది. సర్వే కోసం రైతులు మీ సేవల్లో దరఖాస్తు చేసుకుని నెలల తరబడి రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నప్పటికీ ఫలితం లేకుండా పోతున్నది. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించడంలేదు. వెంటనే సర్వేయర్లను నియమించి భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషిచేయాలి. – భరత్‌కుమార్