వికారాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): యాసంగి సీజన్‌కు సంబంధించిన వరి ధాన్యాన్ని సేకరించేందుకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. రేపటి నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నారు. ముందుగా ప్రతి మండలంలో ఒక్కో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి ధాన్యాన్ని సేకరించనుండగా, వచ్చే నెల చివరినాటికి పూర్తిస్థాయిలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గన్నీ బ్యాగులను అందుబాటులో ఉంచారు. వికారాబాద్ జిల్లాలో 122, రంగారెడ్డి జిల్లాలో 35 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. పీఏసీఎస్, డీసీఎంఎస్, ఏఎంసీ, ఐకేపీ, ఎఫ్ఎస్సీఎస్ల ఆధ్వర్యంలో ధాన్నాన్ని సేకరించనున్నారు. ఏ-రకం వరి ధాన్యం రూ.2203, బీ-రకం రూ.2183గా ప్రభుత్వం మద్దతు ధరను నిర్ణయించింది. వికారాబాద్ జిల్లాలో 1.90 లక్షల మెట్రిక్ టన్నులు, రంగారెడ్డి జిల్లాలో 40వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని పౌరసరఫరాల శాఖ అంచనా వేసింది.
యాసంగి సీజన్లో ధాన్యం సేకరణకుగాను జిల్లా యంత్రాంగం అంతా సిద్ధం చేసింది. ఏప్రిల్ 1 నుంచి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నారు. త్వరగా చేతికొచ్చే ధాన్యాన్ని బయట మార్కెట్లో విక్రయించి రైతులు నష్టపోకుండా ముందుగా ప్రతి మండలంలోనూ ఒక్కో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఏప్రిల్ చివరి నాటికి జిల్లావ్యాప్తంగా క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి తీసుకొచ్చేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. వరి క్వింటాలుకు ‘ఏ’ గ్రేడ్ రకం రూ.2203, సాధారణ రకం క్వింటాలుకు రూ.2183లకు ప్రభుత్వం ధాన్యాన్ని సేకరించనున్నది. ధాన్యం విక్రయించిన రెండు, మూడు రోజుల్లోగా రైతుల ఖాతాల్లో డబ్బులను జమ చేయనున్నది. జిల్లాలో 84,848 ఎకరాల్లో వరి పంట సాగు చేయగా, 1.90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారుల అంచనా.
జిల్లాలో 122 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు..
జిల్లావ్యాప్తంగా 122 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. పీఏసీఎస్ ఆధ్వర్యంలో 61, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో 27, ఏఎంసీ ఆధ్వర్యంలో 3, ఐకేపీ ఆధ్వర్యంలో 27, ఎఫ్‌సీఎస్ ఆధ్వర్యంలో 4 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. 8-10 గ్రామాలకు ఒక కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి, రోజుకు 50 మంది రైతుల నుంచి 1000 క్వింటాళ్ల ధాన్యాన్ని సేకరించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏ తేదీన ధాన్యాన్ని తీసుకురావాలన్న విషయమై ఏఈవోలు టోకెన్ అందజేస్తారు. రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వ చేసేందుకు జిల్లాలో 59 గోదాములను సిద్ధంగా ఉంచారు. ఈ ఏడాది 57,396 మంది రైతులు 84 వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. పరిగి, కులకచర్ల, దోమ, బొంరాస్‌పేట, దౌల్తాబాద్, కొడంగల్, తాండూరు, యాలాల, ధారూరు, మర్పల్లి, కోట్‌పల్లి మండలాల్లో అధికంగా వరి సాగు చేశారు. యాసంగిలో 40 లక్షల గన్నీ బ్యాగులు అవసరమని గుర్తించి అధికారులు అందుబాటులో ఉంచారు.
ప్రతి రైతుకూ కనీస మద్దతు ధర.. జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్
వికారాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ తెలిపారు. రైతులెవరూ తక్కువ ధరకు ఇతరులకు విక్రయించకుండా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని సూచించారు. ప్రతి రైతుకూ కనీస మద్దతు ధర వచ్చేలా అధికారులు చర్యలు చేపడుతామన్నారు.
రంగారెడ్డి జిల్లాలో..
షాబాద్, మార్చి 30 : యాసంగి ధాన్యం సేకరణపై రంగారెడ్డి జిల్లాయంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. జిల్లావ్యాప్తంగా 95వేల ఎకరాల్లో వరి పంటను సాగు చేయగా, సుమారు 40వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారుల అంచనా. జిల్లాలో 35 కేంద్రాలను ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. ఏప్రిల్ 1వ తేదీన ప్రారంభించి మే నెల చివరి నాటికి పూర్తి చేసేలా ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నారు. పీఏసీఎస్, ఐకేపీ, డీసీఎంఎస్ ద్వారా ధాన్యం సేకరణ పూర్తి చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ‘ఏ’ గ్రేడ్ క్వింటాలుకు రూ.2,203, ‘బీ’ గ్రేడ్ వరి ధాన్యానికి రూ.2,183గా ప్రభుత్వం మద్దతు ధరను ప్రకటించింది.
రంగారెడ్డి జిల్లాలో 35 కేంద్రాలు ఏర్పాటు..
రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా చేవెళ్ల, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్, ఆమనగల్లు(కల్వకుర్తి), ఎల్బీనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలోని 26 మండలాల్లో 95వేల ఎకరాల్లో వరి సాగైంది. జిల్లాలో 35 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనుండగా, పీఏసీఎస్, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో 31 కేంద్రాలు, ఐకేపీ ఆధ్వర్యంలో 4 కేంద్రాలను జిల్లాయంత్రాంగం ఏర్పాటు చేయనున్నది.
నాణ్యమైన ధాన్యం సేకరణే లక్ష్యం..
నాణ్యమైన ధాన్యం సేకరణపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. 17శాతం తేమ ఉన్న ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయాలని సిబ్బందికి సూచించారు. ప్యాడీ క్లీనింగ్ మిషన్లను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎలక్ట్రానిక్ కాంటాలు, గోనే సంచులను అందుబాటులో ఉంచారు. 10లక్షల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
35 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు..;విజయలక్ష్మి, రంగారెడ్డిజిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్
జిల్లాలో ధాన్యం సేకరణకు అన్ని ఏర్పాట్లు చేశాం. జిల్లావ్యాప్తంగా మొత్తం 35 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నాం. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ధాన్యం సేకరణ ప్రారంభించి మే నెల చివరి నాటికి పూర్తి చేస్తాం. రైతుల నుంచి 40వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించేందుకు చర్యలు చేపడుతున్నాం. ధాన్యానికి సంబంధించి 10లక్షల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయి. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి.