యాచారం : తాళం వేసి ఉన్న ఓ కానిస్టేబుల్ (Constable) ఇంట్లోకి గుర్తు తెలియని దుండగులు చొరబడి చోరీకి పాల్పడిన ఘటన యాచారం (Yacharam) పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
సీఐ నందీశ్వర్ రెడ్డి తెలిపిన కథనం ప్రకారం.. మండలంలోని నందివనపర్తి, గ్రామానికి చెందిన కానిస్టేబుల్ వెంకటేష్ తన కుటుంబ సభ్యులతో గురువారం రాత్రి బంధువుల ఇంట్లో జరిగిన ఓ వేడుకకు వెళ్లి రాగా ఇంటి తాళం పగులగొట్టి ఉండడాన్ని గుర్తించాడని తెలిపారు.
ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న రూ.65 వేల నగదు, రెండున్నర తులాల బంగారం, 20 తులాల వెండి ఎత్తుకెళ్లినట్లు పోలీసులకు సమాచారమిచ్చాడని తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు క్లూస్ టీంతో ఘటన స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.