ఇబ్రహీంపట్నం, జనవరి 5 : ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఓటరులిస్ట్ తప్పుల తడకగా ఉందని, ఒక వార్డులో నివాసముంటున్న వారి ఓట్లు మరో వార్డుల్లోకి మారడంతో ఎవరిఓట్లు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోలేని పరిస్థితి నెలకొందని బీఆర్ఎస్ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు జెర్కోని రాజు, ఇబ్రహీంపట్నం మున్సిపల్ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి మడుపు వేణుగోపాల్‌రావు వివరించారు. సోమవారం ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యాలయంలో ఓటరులిస్ట్ సవరణపై మున్సిపల్ అధికారులు అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జెర్కోని రాజు మాట్లాడుతూ…ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఓటరులిస్టు తప్పుల తడకగా ఉందని.. ఉదాహరణకు ఒకటో వార్డు ఓట్లు ఆరు, ఏడు వార్డుల్లోకి మార్చటం సరైన పద్ధతి కాదన్నారు.
ముఖ్యంగా ఈ ఓటర్ల జాబితాను మార్చటం వెనుక అధికారులు, అధికారపార్టీ నాయకులు కుమ్మక్కై ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, తప్పుల తడకగా మారిన ఓటరు లిస్టును సవరించకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఓటర్లు సవరణ చేయాలని తప్పుల తడకగా మారిందని అధికారులను కోరినప్పటికీ మున్సిపల్ కమిషనర్‌తో పాటు ఇతర అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించటం సరైంది కాదని, వెంటనే ఓట రు లిస్టులను సవరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సుల్తాన్, రాజ్‌కుమార్, మంద సుధాకర్, సురేష్, మల్లేశ్, శంకర్‌నాయక్, ప్రవీణ్, గోపాల్, గణేశ్‌గౌడ్, కరుణాకర్, అరవింద్, మహేశ్, దయాచారి, శ్రవణ్, త్రిలోక్, మనీశ్, మహేశ్, శ్రవన్ తదితరులున్నారు.
పొరపాట్లను సరిచేయండి
షాద్‌నగర్: రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అధికారులు విడుదల చేసిన డ్రాఫ్ట్ ఓటరు జాబితా పూర్తిగా తప్పుల తడకగా ఉందని షాద్‌నగర్ బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్ అన్నారు. ఓటరు జాబితాలోని పొరపాట్లను సరి చేయాలని సోమవారం మున్సిపల్ కమిషనర్ సునీతారెడ్డి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్కో వార్డులో మరణించిన ఓటర్ల పేర్లను ఇంతవరకు తొలగించలేదని, ఒకే వ్యక్తికి చెందిన పేరు, ఫొటో రెండు, మూడుసార్లు నమోదు చేయడం జరిగిందన్నారు.
అదే విధంగా ఒకే కుటుంబానికి చెందిన ఓట్ల వివరాలు ఒక క్రమ సంఖ్యలో కాకుండా వేర్వేరు పేజీల్లో ఉన్నాయన్నారు. ఇంటి నంబర్ల ఆధారంగా గతంలో వేర్వేరు వార్డుల్లో ఉన్న ఓటర్లను గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులను కూడా ఇతర వార్డుల్లో ఓటర్లు చూయించారన్నారు. ముఖ్యంగా షాద్‌నగర్ పట్టణంలో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు నివస్తుండడంతో వారి ఓట్లు కూడా పట్టణంలో ఉన్నాయని, ఇటివల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి, తమ కుటుంబ సభ్యులను పోటీ చేయించి తమ ఓటును వినియోగించుకున్న వ్యక్తులు కూడా స్థానిక ఓటర్ జాబితా చూడడం జరిగిందన్నారు.
ఒక వార్డులో ఒకే ఇంటి నంబర్‌పై ఏకంగా 42ఓట్లు నమోదు చేసినట్లు గుర్తించడం జరిగిందని, వారంతా ఇతర రాష్ర్టానికి చెందిన కార్మికులుగా బయటపడ్డాయన్నారు. డ్రాప్ట్ ఓటరు జాబితాను పూర్తిగా పరిశీలించి ఎలాంటి తప్పులు, పొరపాట్లు లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.ఇంకా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మొయినాబాద్, తాండూరు తదితర చోట్ల కూడా ఓటర్ జాబితాలో పొరపాట్లపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. వెంటనే సవరించాలని సంబంధిత అధికారులకు వినతిపత్రాలు అందజేశాయి.